చిట్టి చేతులు.. చక్కని రాతలు..!

హాయ్‌ నేస్తాలూ..! మనం స్కూల్‌ నుంచి వచ్చాక.. ఆడుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతాం. అమ్మ పిలిస్తే గానీ.. వెళ్లి హోంవర్క్‌ పూర్తి చేయడానికి ఆసక్తి చూపం అంతే కదా!

Updated : 26 Mar 2024 05:23 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం స్కూల్‌ నుంచి వచ్చాక.. ఆడుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతాం. అమ్మ పిలిస్తే గానీ.. వెళ్లి హోంవర్క్‌ పూర్తి చేయడానికి ఆసక్తి చూపం అంతే కదా! కానీ ఓ చిన్నారి మాత్రం ఏకంగా కథల పుస్తకాలు రాసేస్తోంది. తన ప్రతిభతో రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

బుదాబికి చెందిన అల్మహా రషీద్‌ అల్మెహరీకి ప్రస్తుతం మూడేళ్లు. ‘ఇంత చిన్న వయసు అమ్మాయంటే.. చక్కగా ఇప్పుడిప్పుడే ప్లే స్కూల్‌కి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఇచ్చిన చిన్న చిన్న వర్క్‌ చేయడానికి మారాం చేస్తూ ఉంటుంది. కానీ తను ఏం రికార్డు సాధించి ఉంటుంది’ అని మీకు కూడా అనిపించింది కదూ! అలా అనిపించడం సహజమే కానీ.. ఈ చిన్నారి మాత్రం ఇప్పుడే పుస్తకాలు రాసేస్తోంది. మీకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే నేస్తాలూ!

పర్యావరణ కథలే..!

మన అల్మహా ఇప్పటి వరకు రెండు పుస్తకాలు రాసింది. ఒకదానికి ‘ది ఫ్లవర్‌’ మరోదానికి ‘హనీ బీ’ అని పేరు పెట్టింది. తనకు ప్రకృతి, పర్యావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టమట. అందుకే కథలు కూడా వాటి గురించే రాసింది. ఇంకా పిల్లలకు ఇష్టమైన మరిన్ని విషయాలను కూడా అందులో రాసిందట. తను కథలు రాయడమే కాకుండా అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరిస్తుందట. ఈ చిన్నారి రాసిన పుస్తకాలు పబ్లిష్‌ అయిన 24 గంటల్లోనే.. దాదాపు 1000 కాపీలు అమ్ముడయ్యాయట. ఇంకో విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే అతిచిన్న వయసులో పుస్తకాలు రాసిన అమ్మాయిగా కూడా స్థానం దక్కించుకుంది. తన ప్రతిభను గుర్తించిన ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వారు కూడా అందులో స్థానం కల్పించారు.

అక్క, అన్నయ్య కూడా..!

ఈ చిన్నారికి కథలు రాయడం మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన బొమ్మలు కూడా చాలా బాగా వేస్తుందట. మీకో విషయం తెలుసా.. మన అల్మహా వాళ్ల అక్క తన ఏడేళ్ల వయసులో, అన్నయ్య నాలుగేళ్ల వయసులో వారి పుస్తకాలు పబ్లిష్‌ చేశారట. వాళ్లిద్దరు కూడా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం పొందారు. ఇప్పుడు అల్మహా కూడా వాళ్ల బాటలోనే నడుస్తోంది. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని