వయసు కొంచెం.. ప్రతిభ ఘనం!

 హాయ్‌ నేస్తాలూ..! స్కూల్‌కి సెలవులు ఉన్నాలేకపోయినా.. ఉదయాన్నే నిద్ర లేవడానికి చాలా బద్ధకిస్తాం. స్కూల్‌ ఉంటే.. గబగబా తయారయ్యి వెళ్లిపోతాం. లేకపోతే.. అంతే తొందరగా ఆడుకోవడానికి వెళ్తాం

Updated : 28 Mar 2024 01:13 IST

 హాయ్‌ నేస్తాలూ..! స్కూల్‌కి సెలవులు ఉన్నాలేకపోయినా.. ఉదయాన్నే నిద్ర లేవడానికి చాలా బద్ధకిస్తాం. స్కూల్‌ ఉంటే.. గబగబా తయారయ్యి వెళ్లిపోతాం. లేకపోతే.. అంతే తొందరగా ఆడుకోవడానికి వెళ్తాం.. కానీ ఆ సమయంలో యోగా చేయమంటే అస్సలు చేయం.. ఆ ఆలోచన కూడా రానివ్వం. అమ్మానాన్నలు బలవంతంగా చేయించినా..ఎలా తప్పించుకోవాలా అని చూస్తాం. ఇంతకీ ఇదంతా ఎందుకూ అనుకుంటున్నారు కదూ.. ఓ చిన్నారి యోగాలో సాధించిన ఘనత గురించి తెలియజేద్దామని! దాని కోసం వెంటనే ఈ కథనం చదివేయండి మరి!

దిల్లీకి చెందిన వన్య శర్మకి ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతోంది. ఈ చిన్నారి అతి తక్కువ వయసులోనే యోగా చేయడం ప్రారంభించిందట. చిన్నప్పటి నుంచి తను ఉదయాన్నే లేవగానే ముందుగా యోగా చేస్తుందట. అలా తన ప్రతిభతో వివిధ విభాగాల్లో రికార్డులు సాధిస్తోంది. ‘పిట్టకొంచెం కూత ఘనం’ అన్నట్లు.. వన్య ఇంత చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ కనబరుస్తోంది కదూ!

శిక్షణ కూడా..!

మన వన్య చాలా రకాల యోగాసనాలు వేస్తుందట. తను చేయడమే కాకుండా.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో శిక్షణ కూడా ఇస్తుందట. మీకో విషయం తెలుసా.. అతి చిన్న వయసులో యోగా ట్రైనర్‌గా సర్టిఫికేట్‌ అందుకున్న చిన్నారిగా.. పేరు దక్కించుకుంది. ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు కూడా పొందింది. తన ప్రతిభను గుర్తించిన ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు ‘సూపర్‌ టాలెంటెడ్‌ కిడ్‌’ అవార్డుతో సత్కరించారు. యోగాతో పాటుగా తనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమట. ఉదయాన్నే యోగా, సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చిన వెంటనే.. పుస్తకాలు చదవడం చేస్తుందట. ఎంతైనా మన వన్య చాలా గ్రేట్‌ కదూ! మరి మనమూ యోగా చేయడం, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుందామా!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు