అడుగుల్లో బుడత.. చేతల్లో చిరుత!

బడిమెట్లు ఎక్కక ముందే దేశాల పేర్లను బుజ్జి బుర్రలో ఎక్కించుకున్నాడు ఈ బుడతడు. బుడిబుడి అడుగులు వేస్తూ మాటలు నేర్చే ప్రాయంలోనే అద్భుతమైన ప్రతిభతో అబ్బురపరుస్తు న్నాడు. అపార జ్ఞాపకశక్తితో ఔరా! అనిపిస్తున్నాడు.

Updated : 29 Mar 2024 05:06 IST

బడిమెట్లు ఎక్కక ముందే దేశాల పేర్లను బుజ్జి బుర్రలో ఎక్కించుకున్నాడు ఈ బుడతడు. బుడిబుడి అడుగులు వేస్తూ మాటలు నేర్చే ప్రాయంలోనే అద్భుతమైన ప్రతిభతో అబ్బురపరుస్తు న్నాడు. అపార జ్ఞాపకశక్తితో ఔరా! అనిపిస్తున్నాడు. పాఠశాల వయసు పిల్లలు కూడా కష్టపడి నేర్చుకునే అంశాలనూ అలవోకగా గుర్తు పట్టేస్తున్నాడు. మరి ఆ బుడతడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా!

వైయస్‌ఆర్‌ జిల్లా కడపకు చెందిన ఈ బుడతడి పేరు వడ్డి నాగ గీతాన్ష్‌. మూడున్నరేళ్ల ఈ బుడతడు ఇంకా స్కూల్లోనే చేరలేదు. నాన్న సుధీర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అమ్మ వసుంధర గృహిణి. చిన్ననాటి నుంచే పిల్లాడి మేధస్సును గుర్తించిన అమ్మ పజిల్స్‌ రూపంలోని ప్రపంచ పటాలు తెప్పించి వాటితోనే ఆటలాడించేవారు. అలా ఆ పటంలోని ఆకృతులను చూడకుండా అమర్చుతూ జ్ఞాన సముపార్జనకు తోడ్పాటునందించారు తల్లిదండ్రులు. వివిధ రకాల పజిల్స్‌, ప్రపంచ పటంలో దేశాల పేర్లు, వాటి ఆకృతులను చూపిస్తూ ఆడించేవారు. వాటిని అవపోసన పట్టిన గీతాన్ష్‌ ఎప్పుడు అడిగినా చూడకుండానే చెప్పేసేవాడు. బాలల దినోత్సవం సందర్భంగా.. ఆకాశవాణి కడప కేంద్రంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి పురస్కారాలు అందుకున్నాడు. దీంతో వారు మరిన్ని విషయాలపై అవగాహన కల్పించారు.  

మూడేళ్ల వయసు నుంచే...

గీతాన్ష్‌ మూడేళ్ల వయసులోనే ప్రపంచపటంలోని 121 దేశాల పేర్లు చెప్పి, వాటి ఆకృతుల ఆధారంగా ఆయా స్థానాల్లో అమర్చేవాడు. చూడకుండానే చేతి స్పర్శతోనే ఆ పజిల్స్‌ ఆకృతిని బట్టి దేశాల పేర్లూ టకటక చెప్పేవాడు. ప్రస్తుతం వివిధ దేశాల రాజధానులు, జాతీయ చిహ్నాల పేర్లూ చకచకా చెప్పేస్తున్నాడు. రాకెట్లు, వాటి శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి సారించాడు. చంద్రయాన్‌-3 ల్యాండర్‌పై మక్కువ చూపుతూ వాటి పేర్లు, ఎక్కడ వినియోగిస్తారనే అంశాలు అవలీలగా చెబుతున్నాడు. అతి కష్టమైన పజిల్స్‌ను కేవలం అయిదు నిమిషాల్లోనే అమర్చే నైపుణ్యం పొందాడు. ఈ పిల్లాడి ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ఈ బుడతడి నైపుణ్యాలను గుర్తించిన ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందించారు. భవిష్యత్తులో తాను ఇస్రో శాస్త్రవేత్తగా మారి పరిశోధనలు చేసి దేశానికి సేవలందిస్తానంటున్నాడు.  

కొలిపాక వెంకటసాయి, ఈజేఎస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు