ఇండియా తరఫున ఆడతాను..!

హాయ్‌ నేస్తాలూ..! మనకు ఆటలంటే ఎంత ఆసక్తి ఉన్నా.. అందులో అత్యుత్తమ ప్రతిభ సాధించాలంటే చాలానే కష్టపడాలి.

Published : 03 Apr 2024 00:34 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు ఆటలంటే ఎంత ఆసక్తి ఉన్నా.. అందులో అత్యుత్తమ ప్రతిభ సాధించాలంటే చాలానే కష్టపడాలి. ప్రతిరోజూ సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకోలేం. ఎంచక్కా నచ్చిన ఆహారం తినలేం.. కచ్చితంగా ఒక ప్రణాళికను అనుసరించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం.. అంతే కదా! ఇవన్నీ ఇప్పుడెందుకు అంటే.. ఓ చిన్నారి ఇదే దిశలో నడుస్తూ తన లక్ష్యానికి బాటలు వేసుకుంటుంది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

హైదరాబాద్‌కు చెందిన లట్టాల సాన్వీకి తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది. వీళ్ల అమ్మ ఖుషి గృహిణి, నాన్న సాయి శ్రీరాం సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిన్నారి ఏ విషయాన్నైనా చాలా తొందరగా నేర్చేసుకుంటుందట. చిన్నప్పటి నుంచే తను బాడ్మింటన్‌ ఆట మీద చాలా ఆసక్తి చూపేదట. ఎలాంటి శిక్షణ లేకుండానే.. చాలా పోటీల్లో ఫైనల్స్‌ వరకు చేరిందట. తన ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు.. ఒక బాడ్మింటన్‌ శిక్షణ కేంద్రంలో చేర్పించారట.

కోచ్‌ ప్రోత్సాహమే..

మన సాన్వీ అకాడమీలో చేరిన తర్వాత దాదాపు ఎనిమిది నెలల్లోనే.. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందట. అతి తక్కువ కాలంలో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా సాధించింది. ఇటీవల చెన్నైలో జరిగిన తమిళనాడు ఓపెన్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ 2024లో అండర్‌-9 బాలికల సింగిల్స్‌ విభాగంలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచింది. అండర్‌-11 విభాగంలో కూడా పాల్గొంది. ఇదంతా కోచ్‌ ముప్పాల వేణుగోపాల్‌ ప్రోత్సాహంతోనే సాధ్యమైందని, ఈ చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు.

సాధన..

మొదట్లో తను రోజుకు 1-2 గంటలు ప్రాక్టీస్‌ చేసేది. కానీ ఇప్పుడు.. ఉదయం 4:30 గంటలకే నిద్రలేచి.. 6-8 గంటలు సాధన చేస్తుంది. ఆ తర్వాత సమయంలో వాళ్లమ్మ సాయంతో చదువుకుంటుంది. బాడ్మింటన్‌తో పాటుగా.. స్కేటింగ్‌, డాన్స్‌ అంటే కూడా తనకు చాలా ఇష్టమట. భవిష్యత్తులో ఇండియా తరఫున బాడ్మింటన్‌ ఆడటమే ఆమె లక్ష్యమట. మరి మనమూ తనకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని