ఈ గూగుల్‌ గురూ.. చిన్ని లెక్చరర్‌ కూడా!

హాయ్‌ నేస్తాలూ..! ఒంటిపూట బడికి వెళ్లొచ్చి.. సరదాగా గడిపేస్తున్నారు కదూ! పరీక్షలొస్తున్నాయని, అమ్మ చదువుకోమని ఎంత చెప్పినా అస్సలు వినకుండా.. ఎంచక్కా ఆడుకుంటున్నారు అంతేనా!

Updated : 05 Apr 2024 04:11 IST

హాయ్‌ నేస్తాలూ..! ఒంటిపూట బడికి వెళ్లొచ్చి.. సరదాగా గడిపేస్తున్నారు కదూ! పరీక్షలొస్తున్నాయని, అమ్మ చదువుకోమని ఎంత చెప్పినా అస్సలు వినకుండా.. ఎంచక్కా ఆడుకుంటున్నారు అంతేనా! మనకేమో.. మన పరీక్షలకు చదవడమే కష్టంగా ఉంది. కానీ ఓ చిన్నారి మాత్రం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వాళ్లకు తరగతులు చెబుతూ.. తన జ్ఞాపకశక్తితో ‘గూగుల్‌ గురూ!’ అనిపించుకున్నాడు. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

త్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాకు చెందిన గురు ఉపాధ్యాయ్‌కి ఏడు సంవత్సరాలు. తన తల్లిదండ్రులు అరవింద్‌ కుమార్‌, ప్రియ. ఈ బుడతడు తనకు రెండున్నరేళ్ల వయసున్నప్పుడే జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దేశాల జెండాలు, వాటి పేర్లు గుర్తుపడుతూ.. ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లలో స్థానం దక్కించుకున్నాడు.

బుజ్జి లెక్చరర్‌!

మరో విషయం ఏంటంటే.. ఈ చిన్నారి తన ప్రతిభతో ‘గూగుల్‌ గురు’ అనే పేరును కూడా సొంతం చేసుకున్నాడు. ఏడేళ్ల పిల్లలంటే.. రెండో తరగతి చదువుతూ ఉంటారు. స్కూల్లో వాళ్లకు ఇచ్చిన హోంవర్క్‌ చేయడానికే మారాం చేస్తూ.. పెద్దవాళ్ల సాయం తీసుకుంటారు. కానీ గురు మాత్రం.. యూపీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యేవాళ్లకు.. అంటే కలెక్టర్‌ అవ్వాలనుకునే వారికి.. అలాగే, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తరగతులు చెబుతున్నాడు. ఆ వయసు పిల్లలకు కనీసం ఈ పదాలకు కూడా అర్థం తెలిసి ఉండదు.. కానీ తను చక్కగా 14 సబ్జెక్టులు చెబుతున్నాడట. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా.. నిజమే నేస్తాలూ! ప్రస్తుతం తనే మన దేశంలో అతిచిన్న వయసు కలిగిన లెక్చరర్‌ అట.

ఇదే కారణం..!

గురు చిన్నప్పటి నుంచి ఏ విషయాన్నైనా ఒకసారి వింటే.. చాలు చక్కగా గుర్తుపెట్టుకుంటాడట. తనకు చిన్న వయసులోనే అన్ని సబ్జెక్టుల గురించి తెలియడానికి ఒక కారణం ఉంది నేస్తాలూ.. గురు వాళ్ల అమ్మానాన్నలు తనకు 19 నెలల వయసు ఉన్నప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్‌ అవ్వడం ప్రారంభించారట. అలా వాళ్లు తన దగ్గరే.. ఉండి చదవడంతో, ఆసక్తితో నేర్చుకుని ఇప్పుడు తరగతులు చెబుతున్నాడు. ‘తను సబ్జెక్టు నేర్చుకునేటప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ఒక ఆటలాగే చూస్తాడు. అప్పుడే దాన్ని ఎక్కువగా నేర్చుకోగలడు’ అని చెబుతున్నారు గురు తల్లిదండ్రులు. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు