ఈ చిన్నారి కళతో సాధించాడు..!

హాయ్‌ నేస్తాలూ..! మన చేతికి పెన్నో, పెన్సిలో దొరికితే చాలు.. ఏదో ఒక బొమ్మ గీసేస్తాం. బాగా రాకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తాం.. మనకు నచ్చిన రంగులు వేసి తెగ మురిసిపోతాం.

Updated : 08 Apr 2024 03:17 IST

హాయ్‌ నేస్తాలూ..! మన చేతికి పెన్నో, పెన్సిలో దొరికితే చాలు.. ఏదో ఒక బొమ్మ గీసేస్తాం. బాగా రాకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తాం.. మనకు నచ్చిన రంగులు వేసి తెగ మురిసిపోతాం. అంతే కదా! అది ఒక అందమైన కళ. బొమ్మలు వేయడం అందరికీ అంత సులువుగా రాదు.. కానీ ఓ అబ్బాయి మాత్రం.. అద్భుతంగా బొమ్మలు గీసి రికార్డు సాధించాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందామా మరి!

తమిళనాడులోని విరుదునగర్‌కు చెందిన ఎ.జె.చరణ్‌ చంద్రేశ్‌కు పదకొండు సంవత్సరాలు. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. సాధారణంగా పిల్లలంతా బొమ్మలు వేస్తూనే ఉంటారు. కానీ.. కొందరు వేసినవి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ చిన్నారి ఒక ఫొటోని చూస్తూ.. అచ్చం అలాగే బొమ్మ గీయగలడు. అది కూడా చాలా తక్కువ సమయంలోనే.

బొమ్మలతో విద్య..!

మన చరణ్‌ ఏ బొమ్మని చూసినా ఇట్టే గీసేయగలడు. తను చదివే పాఠశాలలోని విద్యార్థులకు.. ఈ చిన్నారి కొత్త పద్ధతిలో గీసిన బొమ్మలతో పాఠాలు వివరిస్తున్నారట. మరో విషయం ఏంటంటే.. తను కోడిగుడ్డు పెంకుల మీద కూడా చిత్రాలు గీయగలడు. ఇటీవల వాటి మీద స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు గీసి రికార్డు సృష్టించాడు. ఎలాంటి శిక్షణ లేకుండానే అంత అద్భుతంగా బొమ్మలు గీయడం చాలా గ్రేట్‌ కదూ! ‘బొమ్మలు గీయడం వల్ల మనకు ఏకాగ్రత పెరుగుతుంది. అప్పుడు చదువులో కూడా ముందే ఉంటాం’ అని చెబుతున్నాడు చరణ్‌. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని చాలా బహుమతులు కూడా అందుకున్నాడట. తన ప్రతిభను గుర్తించిన ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు ‘సూపర్‌ టాలెంటెడ్‌ కిడ్‌’ విభాగంలో స్థానం కూడా కల్పించారు. ఇలాగే తను మరిన్ని చిత్రాలు గీస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని