ఫొటోగ్రఫీతో అదరగొట్టాడు..!

హాయ్‌ నేస్తాలూ..! మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో.. తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అప్పుడు అమ్మ వాళ్లు మనకు తీయించిన ఫొటోతోనే.. ఆ కోరిక తీరుతుంది. ఏ చిన్న సందర్భాన్నైనా.. ఫొటో మనకు ఎప్పటికీ గుర్తుండేలా చేస్తుంది.

Updated : 19 Apr 2024 04:51 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో.. తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అప్పుడు అమ్మ వాళ్లు మనకు తీయించిన ఫొటోతోనే.. ఆ కోరిక తీరుతుంది. ఏ చిన్న సందర్భాన్నైనా.. ఫొటో మనకు ఎప్పటికీ గుర్తుండేలా చేస్తుంది. అయినా.. ఒక్క ఫొటో గురించి ఇన్ని విషయాలు ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే.. ఆ ఫొటోలు తీస్తూనే రికార్డు సృష్టించిన చిన్నారి గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి. వెంటనే ఈ కథనం చదివేయండి. ఆ వివరాలేంటో మీకే తెలుస్తాయి..!

బిహార్‌కు చెందిన ప్రభాత్‌ రాజన్‌కు ఎనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. ఈ బుడతడు ఫొటోలు అద్భుతంగా తీస్తాడట. ‘మేం కూడా తీస్తాం.. మా అమ్మానాన్నల ఫోన్‌తో. అందులో ప్రత్యేకత ఏముంది?’ అనుకుంటున్నారు కదూ.. కానీ ప్రభాత్‌ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లు తీసినట్లుగా కెమెరాతో చాలా బాగా ఫొటోలు తీస్తాడట. చాలామంది పిల్లలు చదువుతో పాటుగా ఆటలు, డాన్స్‌, పాటలు వంటి వాటి మీద ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ చిన్నారి మాత్రం అందరి కంటే భిన్నంగా ఫొటోగ్రఫీ మీద ఇష్టం పెంచుకున్నాడు. దానికి తగ్గట్టుగా కష్టపడుతున్నాడు.

గుర్తింపు దక్కింది..!

ప్రభాత్‌ ఫొటోగ్రఫీకి సంబంధించిన వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు, సర్టిఫికేట్లు కూడా సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా.. సెలబ్రిటీలకు కూడా ఫొటో షూట్లు చేసి, అందరితో ఔరా అనిపించాడు. తను ఈ రంగంలో ముందుకెళ్లడానికి తల్లిదండ్రులు కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారట. ఇంతటి ప్రతిభ కనబర్చిన ఈ చిన్నారిని ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు గుర్తించి ‘యంగెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌’ అవార్డు అందించారు. ఇంకా తనకు బొమ్మలు గీయడం అంటే కూడా చాలా ఇష్టమట. ఎంతైనా ప్రభాత్‌ చాలా గ్రేట్‌ కదూ.. తను ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని