ఈ అక్కాచెల్లెళ్లది మెరుపువేగం!

హాయ్‌ నేస్తాలూ..! మనమంతా వినోదం కోసం సెల్‌ఫోన్లు, టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటాం కదా! కానీ, ఈ అక్కాచెల్లెళ్లు మాత్రం అలా కాదు! స్కేటింగ్‌ చేస్తూ వినోదం పొందుతున్నామంటున్నారు.

Published : 21 Apr 2024 00:53 IST

హాయ్‌ నేస్తాలూ..! మనమంతా వినోదం కోసం సెల్‌ఫోన్లు, టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటాం కదా! కానీ, ఈ అక్కాచెల్లెళ్లు మాత్రం అలా కాదు! స్కేటింగ్‌ చేస్తూ వినోదం పొందుతున్నామంటున్నారు. అంతేగాక జీవితంలో ఎన్ని సార్లు కిందపడినా మళ్లీ.. మళ్లీ.. పైకి లేవడం ఎలాగో.. ఇది నేర్పిస్తుందంటున్నారు. అందుకే ఈ క్రీడపై మక్కువ చూపుతున్నామని చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ చిన్నారులెవరో, వారి వివరాలేంటో తెలుసుకుందామా!

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నక్షత్ర, దీక్ష అక్కాచెల్లెళ్లు. నక్షత్రకు తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. దీక్షకు ఆరు సంవత్సరాలు. రెండో తరగతి చదువుతోంది. తండ్రి అరుణ్‌కుమార్‌ రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. తల్లి గీతాంజలి గృహిణి. ఈ అక్కాచెల్లెళ్లు కాస్త ఖాళీ సమయం దొరికినా చాలు రయ్‌... రయ్‌... అంటూ స్కేటింగ్‌ చేస్తున్నారు. రింక్‌ లేకపోయినా రోడ్డుపైనే సాధన చేస్తూ పతకాల పంట పండిస్తున్నారు.

చదువుతోపాటు..

నక్షత్ర చిన్ననాటి నుంచే చదువుతో పాటు వివిధ క్రీడల్లోనూ అద్భుతమైన ప్రతిభతో దూసుకుపోతోంది. మూడేళ్ల వయసులోనే స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. క్రీడలపై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించేవారు. ఈ నేపథ్యంలో వారి ఇంటి సమీపంలో స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారులు సత్తా చాటుతుండడం తనలో స్ఫూర్తి నింపింది. దీంతో గత ఏడాది ఆగస్టులో స్కేటింగ్‌లో తర్ఫీదు తీసుకోవడం ప్రారంభించింది. సెప్టెంబరులో గుంటూరులో జరిగిన ఐస్‌ స్కేటింగ్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ అండర్‌-10 పోటీల్లో పాల్గొని 500 మీటర్ల ఇన్‌లైన్‌లో కాంస్య పతకం సాధించింది. అదే స్ఫూర్తితో నవంబరులో పులివెందులలో జరిగిన కడప జిల్లా స్పీడ్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 200 మీటర్లు, 400 మీటర్ల ఫ్యాన్సీ లైన్‌లో రెండు బంగారు పతకాలతో మెరిసింది. అలా స్కేటింగ్‌లో రాటుదేలి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ ఏడాది జనవరి 27 నుంచి 29 వరకు గోవాలో జరిగిన జాతీయస్థాయి అండర్‌-10 స్కేటింగ్‌ పోటీల్లో రిలే, ప్రొ ఇన్‌లైన్‌లో రెండు రజత, ఒక కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇలా ఈ చిన్నారి ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించింది.

నీవల్ల కాదు అన్నా..

అక్కను చూసి స్ఫూర్తి పొందిన దీక్ష తానూ శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ‘నువ్వు బొద్దుగా ఉన్నావు.. స్కేటింగ్‌ చేయలేవు... నీ వల్ల కాదు...’ అని క్రీడా ప్రాంగణంలో తన తోటి స్నేహితులంతా హేళన చేసేవారు. అయినా అకుంఠిత దీక్షతో బంగారు పతకాలు సాధించి, హేళన చేసిన వారికి దీటుగా సమధానం ఇచ్చింది. అక్కను మించి మెరుగైన ప్రదర్శనలతో అబ్బురపరిచింది. గత ఏడాది సెప్టెంబరులో గుంటూరులో జరిగిన ఐస్‌ స్కేటింగ్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ పోటీల్లో (అండర్‌- 8) పాల్గొని 150 మీటర్ల ఇన్‌లైన్‌లో బంగారు పతకం సాధించింది. నవంబరులో పులివెందులలో జరిగిన కడప జిల్లా స్పీడ్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో గోవాలో జరిగిన జాతీయ స్థాయి (అండర్‌-8) స్కేటింగ్‌ పోటీల్లో ప్రొ ఇన్‌లైన్‌, రిలేలలో బంగారు పతకాలను సాధించింది. అంతర్జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

 వేల్పూరి వీరగంగాధర శర్మ, ఈనాడు డిజిటల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని