జర‘జరా’ ఎవరెస్టు ఎక్కేసింది!

చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జరాకు ప్రస్తుతం నాలుగున్నరేళ్లు. ఈ వయసు పిల్లలు రోడ్డు మీద కాస్త దూరం నడవటమే చాలా కష్టం. కానీ ఈ చిన్నారి మాత్రం ఇటీవల ఎవరెస్టు శిఖరం బేస్‌ క్యాంప్‌నే ఎక్కేసింది.

Updated : 26 Apr 2024 04:24 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం కాస్త దూరం నడవడమే ఇబ్బంది అనుకుంటాం. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మెట్లు ఎక్కాల్సి వస్తే.. అలసిపోతాం. ఇక మా వల్ల కాదని కూర్చుండి పోతాం. లేకపోతే పెద్దవాళ్లు ఎవరైనా ఉంటే.. ఎత్తుకోమని మారాం చేస్తాం. అంతే కదా! కానీ అందరికీ భిన్నంగా ఓ చిన్నారి మాత్రం ఏకంగా ఎవరెస్టు శిఖరాన్నే ఎక్కేసింది!  ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జరాకు ప్రస్తుతం నాలుగున్నరేళ్లు. ఈ వయసు పిల్లలు రోడ్డు మీద కాస్త దూరం నడవటమే చాలా కష్టం. కానీ ఈ చిన్నారి మాత్రం ఇటీవల ఎవరెస్టు శిఖరం బేస్‌ క్యాంప్‌నే ఎక్కేసింది. వినడానికి మనకు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే. వాళ్ల నాన్న డేవిడ్‌ సిఫ్రా, అన్నయ్య సాయంతో తను ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగిందట.

రికార్డు పట్టింది..!

మన జరా ఎవరెస్టు శిఖరం బేస్‌ క్యాంపు దాదాపు 17,598 అడుగుల ఎత్తు వరకు చేరుకుంది. మరో విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే ఎవరెస్టు బేస్‌క్యాంపు వరకు అధిరోహించిన అతిచిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు.. అయిదేళ్ల చిన్నారి ప్రిశా లోకేష్‌ నికాజో పేరున ఉండేది. 2023లో తను శిఖరాన్ని అధిరోహించింది.

సులువేమీ కాదు..!

అంతపెద్ద శిఖరాన్ని ఎక్కడం అంటే.. అంత సులభమేమీ కాదు నేస్తాలూ..! ఎందుకంటే అక్కడి వాతావరణ పరిస్థితులు మన దగ్గర ఉన్నట్లు ఉండవు. జరా -25 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా తన ప్రయాణాన్ని కొనసాగించిందట. దానికి తగిన జాగ్రత్తలన్నీ వాళ్ల నాన్న చూసుకున్నారట. ‘తను చిన్నప్పటి నుంచే.. ఎక్కువగా నడుస్తుండేది. అదే తనకు ఇప్పుడు బాగా ఉపయోగపడింది.’ అని వాళ్ల నాన్న చెబుతున్నారు. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని