‘క్లిక్‌’తోనే ఈ బుడతడికి కిక్‌!

హాయ్‌ నేస్తాలూ..! మనలో చాలా మందికి సహజ సిద్ధమైన ప్రకృతితో మమేకమవడానికి సమయమే ఉండటం లేదు కదూ! కానీ ఈ పదకొండేళ్ల బుడతడు మాత్రం అలా కాదు.

Published : 28 Apr 2024 00:12 IST

హాయ్‌ నేస్తాలూ..! మనలో చాలా మందికి సహజ సిద్ధమైన ప్రకృతితో మమేకమవడానికి సమయమే ఉండటం లేదు కదూ! కానీ ఈ పదకొండేళ్ల బుడతడు మాత్రం అలా కాదు. ఒక వైపు కష్టపడి చదువుతూనే, తన తండ్రి ప్రోత్సాహంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి, అక్కడ కనిపించిన వన్యప్రాణులు, పక్షుల చిత్రాలను తన కెమెరాలో బంధిస్తున్నాడు. జాతీయ స్థాయిలో బంగారు పతకాలు, పురస్కారాలు అందుకుంటూ అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. మరి ఆ చిత్రాల చిచ్చరపిడుగు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా!


 

గుంటూరు నగరానికి చెందిన వీర్నపు హర్షిల్‌ కిరణ్‌కు పదకొండేళ్లు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. మూడేళ్లుగా వైల్డ్‌ లైఫ్‌, బర్డ్స్‌ ఫొటోగ్రఫీపై మక్కువ చూపుతూ.. ఇప్పటి వరకు కొన్ని వందల చిత్రాలను తన కెమెరా లెన్స్‌తో బంధించాడు. ఈ బుడతడు తీసిన చిత్రాలను జాతీయ స్థాయిలో బంగారు పతకాలు, అవార్డులు, ప్రశంసాపత్రాలు వరించాయి. తండ్రి కిరణ్‌కుమార్‌ రిజిస్ట్రేషన్‌ స్టాంపుల శాఖలో.. తల్లి అనసూయారాణి ఎల్‌ఐసీలో విధులు నిర్వర్తిస్తున్నారు.

తండ్రి అభిరుచి.. తనయుడి సంకల్పం

హర్షిల్‌ తండ్రి ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో వన్యప్రాణులు, పక్షుల చిత్రాలు తీస్తుండడం ఈ బుడతడికి ప్రేరణగా నిలిచింది. తొమ్మిదేళ్ల వయసు నుంచే ఫొటోలు తీయడం ప్రారంభించాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తండ్రి ప్రోత్సాహంతో ఓ యూనివర్సిటీలోని బర్డ్స్‌ గ్యాలరీలోని రకరకాల పక్షుల చిత్రాలు తీస్తుండేవాడు. మొదట్లో ఆ కెమెరా బరువు మోయలేక ఇబ్బంది పడినా ఫొటోగ్రఫీపై ఉన్న మక్కువతో నెమ్మదిగా దాన్ని వాడే విధానంపై పట్టు సాధించాడు. ఈ క్రమంలో ప్రకృతితో మమేకమవుతూ అరుదైన పక్షుల చిత్రాలు తీయడం ప్రారంభించాడు. సుదూర ప్రాంతాలైన నల్లమల అభయారణ్యం, సుంకేశుల ఆనకట్ట, ఉప్పలపాడు, నగరవనం, రోళ్లపాడు తదితర ప్రాంతాలకు వెళ్లి మరీ, అరుదైన పక్షి జాతులను తన కెమెరాలో బంధించాడు.

వరించిన పురస్కారాలు..

తను తీసిన ఈ చిత్రాలను 2023లో ఉత్తరప్రదేశ్‌లో మణికర్ణిక ఆర్ట్‌ గ్యాలరీలో నిర్వహించిన ఛాయాచిత్రాల ప్రదర్శనలో ఉంచాడు. వాటిల్లో కొన్నింటికి కాంస్య పతకం, ‘పెంటగ్రామ్‌ కోల్‌కతా’ వారి నుంచి ‘రైజింగ్‌ స్టార్‌ ఫొటోగ్రఫీ’ పురస్కారాలు దక్కాయి. మరోవైపు చదువును నిర్లక్ష్యం చేయకుండా పట్టుదలతో విద్యనభ్యసిస్తూనే తన వ్యాపకాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో తీసిన ‘ల్యాండింగ్‌ పెలికాన్‌’ అనే ఛాయాచిత్రానికి గానూ, ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్‌ అమెరికా (పీఎస్‌ఏ) నుంచి బంగారు పతకం, ప్రశంసాపత్రం అందుకున్నాడు.

ఎన్నో అరుదైన చిత్రాలతో..

మహారాష్ట్ర తడోబా టైగర్‌ రిజర్వ్‌లో ఈ చిన్నారి, గంటకు పైగా నిరీక్షించి తీసిన ‘పారడైజ్‌ ఫ్లైక్యాచర్‌’ అనే అరుదైన పక్షి చిత్రానికి జాతీయ స్థాయిలో బంగారు పతకం వరించింది. కొన్ని పక్షులు, అడవి దున్న, పెద్దపులి ఫొటోలు తీసి, ప్రదర్శించగా పీఎస్‌ఏ నుంచి అవార్డులు, ప్రశంసాపత్రాలు వచ్చాయి. 2023 ఆగస్టు 19న వరల్డ్‌ ఫొటోగ్రఫీ రోజున నరసరావుపేటలోని తన పెదనాన్న నిరంజన్‌ ప్రసాద్‌తో కలిసి ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్లు నిర్వహించి పల్నాడు జిల్లా కలెక్టర్‌తో పురస్కారాల్ని అందుకున్నాడు. ‘క్లిక్‌’లోనే తనకు కిక్‌ ఉందంటున్న హర్షిల్‌... ఎప్పటికైనా ‘యంగ్‌ ఇంటర్నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌’ అవ్వాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నాడు. మరి మనం తనకు మనసారా ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుదామా!

వేల్పూరి వీరగంగాధర శర్మ, ఈనాడు డిజిటల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని