ఇది యునయ్‌ విజయం..!

గువాహటికి చెందిన యునయ్‌ గుప్తాకు ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్నాడు. సాధారణంగా పిల్లలకు చదువుతో పాటుగా..

Published : 29 Apr 2024 00:11 IST

హాయ్‌ నేస్తాలూ..! ఇంట్లో అమ్మ ఏదైనా బరువులు ఎత్తే పని చెబితే.. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటాం. మనకు ఆటలంటే ఎంత ఇష్టం ఉన్నా.. బరువులు ఎత్తాల్సిన ఆటలైతే.. తేలిగ్గా ‘నేను ఆడను’ అనేస్తాం.. అంతే కదా! కానీ మనలాంటి ఓ బుడతడు మాత్రం బరువులు ఎత్తుతూ రికార్డులు సాధిస్తున్నాడు. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

గువాహటికి చెందిన యునయ్‌ గుప్తాకు ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్నాడు. సాధారణంగా పిల్లలకు చదువుతో పాటుగా.. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల మీద ఆసక్తి ఉంటుంది. అలాగే.. మన యునయ్‌కి ‘కెటిల్‌బెల్‌’ ఆట అంటే చాలా ఇష్టమట. ‘ఇదేం ఆట.. ఎప్పుడూ విన్నట్లుగా అనిపించడం లేదే?’ అనుకుంటున్నారా! అదే పిల్లలూ.. బంతుల్లా ఉండే ఇనుప గోళాలను పైకి ఎత్తడం. దీన్నే ‘కెటిల్‌బెల్‌’ ఆట అంటారు. ‘అంతేనా.. వాటిని ఎత్తడం ఎంత పనీ..’ అని అనుకోకండి. అంత సులువేమీ కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. అవి మీద పడి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది.

మూడు విభాగాల్లో..!

మన యునయ్‌.. చిన్నప్పటి నుంచే కెటిల్‌బెల్‌ నేర్చుకోవడం ప్రారంభించాడట. తన ప్రతిభతో 11వ జాతీయ కెటిల్‌బెల్‌ ఛాంపియన్‌- 2024లో విజేతగా నిలిచాడు. 5, 10, 30 నిమిషాల మూడు విభాగాల్లో, తనే మొదటి స్థానంలో నిలిచి.. సత్తా చాటుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే.. గతేడాది జరిగిన పదో జాతీయ కెటిల్‌బెల్‌ ఛాంపియన్‌షిప్‌లో కూడా తనే మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు. కెటిల్‌బెల్‌లో ఛాంపియన్‌గా నిలిచిన వాళ్లలో యునయ్‌నే అతి చిన్న వయస్కుడట. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు కూడా సాధించాడు. ఇంతటి ప్రతిభ కనబర్చిన ఈ చిన్నారిని గుర్తించిన.. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు అందులో స్థానం కూడా కల్పించారు. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని