భరత వేదముగా సమీక్షా నాట్యం..!

హాయ్‌ నేస్తాలూ..! ఆటల మీద మనకు సహజంగానే ఆసక్తి ఉంటుంది. కానీ.. ఎంత సాధన చేసినా కొన్నిసార్లు అవి మనకు అంతగా రాకపోవచ్చు. కానీ పాటలు, డాన్స్‌ మాత్రం అలా కాదు.

Updated : 01 May 2024 04:31 IST

హాయ్‌ నేస్తాలూ..! ఆటల మీద మనకు సహజంగానే ఆసక్తి ఉంటుంది. కానీ.. ఎంత సాధన చేసినా కొన్నిసార్లు అవి మనకు అంతగా రాకపోవచ్చు. కానీ పాటలు, డాన్స్‌ మాత్రం అలా కాదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా ఇవి పరిచయం ఉంటాయి. అందులో అంతగా ప్రతిభ చూపకపోయినా.. కొంతైనా వచ్చే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అనుకుంటున్నారా.. ఓ చిన్నారి తన నృత్యంతో రికార్డు సాధించింది. మరి తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

లండన్‌కు చెందిన సమీక్షా దివాకర్‌కు ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతోంది. సాధారణంగా పిల్లలకు ఆటలు, పాటలు, డాన్స్‌ ఇలా చాలా వాటి మీద ఆసక్తి ఉంటుంది. అలాగే.. మన సమీక్షకు భరత నాట్యం అంటే చాలా ఇష్టమట. అదేంటి.. తను లండన్‌కు చెందిన అమ్మాయి కదా? మరి భరత నాట్యం ఎలా తెలుసు అనుకుంటున్నారు కదూ! వాళ్ల కుటుంబ సభ్యులు మన భారతదేశానికి చెందిన వాళ్లే. సమీక్ష అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా అక్కడ స్థిరపడ్డారన్నమాట.

చిన్నప్పటి నుంచే..!

సమీక్ష తన చిన్న వయసు నుంచే భరత నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిందట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో 21 నిమిషాల 30 సెకన్ల పాటు ఆగకుండా భరత నాట్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన ప్రతిభతో ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కించుకుంది. ‘సమీక్ష ఎంతసేపైనా డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటుంది. నేర్చుకోవాల్సింది పూర్తయ్యే వరకు అలా చేస్తూనే ఉంటుంది. అందుకే 21 నిమిషాలు ఆపకుండా డాన్స్‌ చేయగలిగింది. అలాగని చదువునేం నిర్లక్ష్యం చేయదు. అందులోనూ ముందంజలోనే ఉంటుంది’ అని వాళ్లమ్మ చెబుతున్నారు. ఇంత చిన్న అమ్మాయి.. అంతసేపు డాన్స్‌ చేయడమంటే మాటలు కాదు.. కదా నేస్తాలూ..! సరైన క్రమంలో సాధన చేస్తే.. ఏదైనా సాధించగలం అని నిరూపించిన ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని