చకా చక్‌.. ఎంతో చక్కగా క్లిక్‌ క్లిక్‌!!

హాయ్‌ నేస్తాలూ...! మనందరికీ మ్యూజియాలు అంటే భలే ఇష్టం కదూ! అందులో సాధారణంగా రాజుల కాలం నాటి వస్తువులు, అరుదైన, అద్భుతమైన శిల్పాలు, ఎంతో విలువైన విగ్రహాలు, ఆయుధాలు, నాణేలు..

Published : 02 May 2024 00:04 IST

హాయ్‌ నేస్తాలూ...! మనందరికీ మ్యూజియాలు అంటే భలే ఇష్టం కదూ! అందులో సాధారణంగా రాజుల కాలం నాటి వస్తువులు, అరుదైన, అద్భుతమైన శిల్పాలు, ఎంతో విలువైన విగ్రహాలు, ఆయుధాలు, నాణేలు.. ఇలా ఎన్నో విశేషాలుంటాయి కదా! కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే మ్యూజియంలో ఇవేమీ ఉండవు. చిత్రాలు మాత్రమే ఉంటాయి! మరో విచిత్రం ఏంటంటే.. చాలా వరకు మిగతా మ్యూజియాల్లో ఫొటోలు తీసుకోనివ్వరు కదూ! ఇక్కడ మాత్రం ఎన్నంటే అన్ని ఫొటోలు తీసుకోవచ్చు. అసలు ఛాయాచిత్రాలు తీసుకోకుండా ఈ మ్యూజియాన్ని సందర్శించి రాలేం తెలుసా! ‘ఔనా..! ఇంతకీ మ్యూజియం పేరేంటి? అదెక్కడుంది?’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు కదూ! ఇంకెందుకాలస్యం.. చకచకా ఈ కథనం చదివేయండి సరేనా!

చిత్ర విచిత్రమైన మ్యూజియం తమిళనాడులోని చెన్నైలో ఉంది. దీని పేరు క్లిక్‌ ఆర్ట్‌ మ్యూజియం. సెల్ఫీ మ్యూజియం అని కూడా పిలుస్తుంటారు. దీన్ని శ్రీధర్‌ అనే ఆర్టిస్ట్‌ అంకుల్‌ ప్రారంభించారు. ఇందులో 24 త్రీడీ చిత్రాలు కొలువు తీరి ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే.. సందర్శకులు వీటితో ఫొటో దిగేంత వరకూ ఇవి ఓ రకంగా అసంపూర్తి చిత్రాలే!!

చింపాంజీ నవ్వు.. బ్రూస్‌లీ ఫైట్‌!

ఈ క్లిక్‌ ఆర్ట్‌ మ్యూజియంలో చింపాంజీతో సెల్ఫీ చిత్రం బాగా ఫేమస్‌. మనలాంటి చిన్నారులకు ఇక్కడ ఫొటో దిగడమంటే భలే ఇష్టం. అలాగే మొసలి, నిప్పులు కక్కే డ్రాగన్‌, బర్గర్‌ అందించే చిన్నారి, మోనాలిసా, బంతితో ఆడుకునే డాల్ఫిన్‌, ఎగసి పడే పెద్ద అలలో సర్ఫింగ్‌, తొంగి చూసే పాము, ఛార్లీ చాప్లిన్‌ లాంటి చిత్రాలు గోడలకు ఉంటాయి. ఇవి త్రీడీ అనుభూతిని కలిగిస్తాయి. సందర్శకులకు ప్రతి చిత్రం దగ్గర ప్రత్యేక స్థానం ఉంటుంది. అక్కడున్న గుర్తుల ప్రకారం నిల్చొని సెల్ఫీ కానీ, ఫొటో కానీ తీసుకుంటే చాలు.. వారూ ఆ చిత్రంలో భాగమైపోతారు.

దేశంలో ప్రథమం!

మన దేశంలో ఇదే మొట్టమొదటి త్రీడీ ట్రిక్‌ ఆర్ట్‌ మ్యూజియం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 దేశాల్లో ఇలాంటివి 42 మాత్రమే ఉన్నాయట. చెన్నైలోని ఈ మ్యూజియానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడి చిత్రాలతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ తెగ సంబరపడిపోతుంటారు. కేవలం మనలాంటి పిల్లలే కాకుండా, పెద్దలు కూడా ఇక్కడ చక్కగా సందడి చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ మ్యూజియంలో మొత్తంగా 30 నుంచి 40 లక్షల వరకు ఫొటోలు తీసుకుని ఉంటారని ఓ అంచనా. నేస్తాలూ.. మొత్తానికి ట్రిక్‌ ఆర్ట్‌ మ్యూజియం సంగతులు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని