ఈ అక్కాతమ్ముళ్లు అదరగొట్టారు..!

హాయ్‌ నేస్తాలు..! మనలో చాలా మందికి కొత్త అంశాలు నేర్చుకోవాలని ఉంటుంది. మనకు అది నచ్చిన పని అయితే.. దాని కోసం ఎంతైనా కష్టపడతాం.

Updated : 03 May 2024 00:41 IST

హాయ్‌ నేస్తాలు..! మనలో చాలా మందికి కొత్త అంశాలు నేర్చుకోవాలని ఉంటుంది. మనకు అది నచ్చిన పని అయితే.. దాని కోసం ఎంతైనా కష్టపడతాం. అయినా అందరికీ ఒకే రంగంలో రాణించాలని ఏం లేదు కదా! కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే  అక్కాతమ్ముళ్లు ఒకే అంశంలో రికార్డు సాధించారు. మరి వాళ్లెవరో? ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన చావా ఆకృతి, తారక్‌నంద అక్కాతమ్ముళ్లు. ఆకృతి వయసు ఎనిమిది సంవత్సరాలు. తనది మూడో తరగతి పూర్తయింది. తమ్ముడి వయసు నాలుగేళ్లు.. ఎల్కేజీ పూర్తయింది. అమ్మానాన్నలు అశ్లేష, రాజ్‌కుమార్‌.. వైద్యులు. సాధారణంగా పిల్లలు పుస్తకంలో ఉన్నవి చదవడానికే బద్ధకిస్తారు. కానీ చిన్నారి ఆకృతి 195 దేశాలు, వాటి రాజధానుల పేర్లు కేవలం 4 నిమిషాల 42 సెకన్లలో చెప్పి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. ‘కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మా అమ్మానాన్నలు.. ప్రతిరోజు కథలు చెబుతుండేవారు. వాటిని ఎక్కువగా గుర్తుపెట్టుకునేదాన్ని. అది గమనించిన అమ్మానాన్న ముందుగా రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లు, ఎక్కాలు నేర్పించారు. అవి కూడా తొందరగానే నేర్చుకోవడంతో.. దేశాలు, రాజధానుల పేర్లను నేర్పించడం ప్రారంభించారు. అవన్నీ పూర్తిగా నేర్చుకోవడానికి నాకు ఆరు నెలల సమయం పట్టింది’ అని చెబుతోంది ఆకృతి.

 అక్క బాటలోనే తమ్ముడూ..!

సాధారణంగా చిన్న పిల్లలు ఇంట్లో ఎవరైనా ఒక అంశం మీద ఆసక్తి చూపిస్తే, దాన్ని వాళ్లూ.. చేయాలనుకోరు. కానీ తారక్‌ మాత్రం వాళ్లక్క రాష్ట్రాలు, రాజధానుల పేర్లు ప్రాక్టీస్‌ చేస్తుంటే విని.. తనూ ఆసక్తి పెంచుకున్నాడు. అలా అక్కతో పాటుగా సాధన చేయడం ప్రారంభించాడు. మొదటిసారి పోటీలో పాల్గొని ఓడిపోయినా.. నిరాశ పడకుండా మళ్లీ ప్రయత్నించాడు. కేవలం 2 నిమిషాల 10 సెకన్లలో 100 దేశాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తన ప్రతిభతో అక్కలాగే.. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కించుకున్నాడు. ‘మా అక్క స్ఫూర్తితోనే.. మూడేళ్ల వయసు నుంచే నేనూ దేశాల పేర్లు చెప్పడం నేర్చుకున్నాను. నాకు మొదట్లో మాటలు సరిగ్గా రాలేదు.. అప్పుడు మా అమ్మానాన్నలు చాలా కంగారు పడ్డారు. కానీ సంవత్సరంలోపే.. రికార్డు సాధించాను’ అంటున్నాడు బుడతడు తారక్‌. ఎంతైనా ఈ చిన్నారులిద్దరూ చాలా గ్రేట్‌ కదూ! భవిష్యత్తులో వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..! 
మంత్రి భాస్కర్‌, ఈటీవీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని