తక్ష్వి లింబో స్కేటింగ్‌ అదుర్స్‌..!

హాయ్‌ నేస్తాలూ..! స్కేటింగ్‌ అనే పదాన్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పనేం లేదు. ఎందుకంటే.. ఈ మధ్య చాలామంది పిల్లలు ఆ ఆట మీద ఆసక్తి చూపుతున్నారు. దాంట్లో రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు.

Updated : 04 May 2024 04:33 IST

హాయ్‌ నేస్తాలూ..! స్కేటింగ్‌ అనే పదాన్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పనేం లేదు. ఎందుకంటే.. ఈ మధ్య చాలామంది పిల్లలు ఆ ఆట మీద ఆసక్తి చూపుతున్నారు. దాంట్లో రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్నారి మాత్రం.. లింబో స్కేటింగ్‌లో వరల్డ్‌ రికార్డు సాధించింది. ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా ఈ కథనం చదివేయండి..!

హ్మదాబాద్‌కు చెందిన తక్ష్వి వఘాణికి ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతోంది. ఈ చిన్నారి లోయెస్ట్‌ లింబో స్కేటింగ్‌లో రికార్డు సృష్టించి.. అందరినీ ఔరా! అనిపించింది. స్కేటింగ్‌ అంటే తెలుసు. కానీ ఈ ‘లోయెస్ట్‌ లింబో స్కేటింగ్‌’ అంటే ఏంటని ఆలోచిస్తున్నారు కదూ! ‘కొన్ని ఇనుప కడ్డీలను తీసుకొని వాటిని కొంత ఎత్తులో, నిర్ణీత దూరంలో అమరుస్తారు. స్కేటింగ్‌ షూ ధరించి, అవి కదలకుండా.. వాటి కింద నుంచి ముందుకు వెళ్లాలి’ దీన్నే లోయెస్ట్‌ లింబో స్కేటింగ్‌ అంటారు.

ప్రతిభతోనే..!

మన తక్ష్వి 25 మీటర్ల 16 సెంటీ మీటర్ల దూరం లింబో స్కేటింగ్‌ చేసింది. ఒక్క ఇనుప కడ్డీ కూడా కింద పడకుండా.. లక్షాన్ని చేరుకుంది. ఇంతటి ప్రతిభ కనబర్చిన ఈ చిన్నారికి ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో కూడా స్థానం దక్కింది. తను లింబో స్కేటింగ్‌ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 15 లక్షల మంది వీక్షించారు. ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు తన మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఈ స్కేటింగ్‌ చూడటానికి మనకు ‘భలేగా ఉంది!’ అనిపిస్తుంది. తను స్కూల్‌కి వెళ్లే ముందు, వచ్చాక ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేసేదట. కానీ అది చాలా కష్టమట నేస్తాలూ. అయినా కూడా ఈ చిన్నారి మాత్రం చాలా సాధన చేసి.. రికార్డు సాధించింది. గతంలో ఈ రికార్డు పుణెకు చెందిన మనస్వి అనే చిన్నారి పేరు మీద ఉండేది. ఎంతైనా మన తక్ష్వి చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు