పట్టు వదలని ‘చక్ర’మార్కుడు!

హాయ్‌ నేస్తాలూ! మనకు చిన్నప్పటి నుంచి ఆటల మీద ఆసక్తి ఉంటుంది. కానీ... సరదాగా ఆడటం కాకుండా, నచ్చిన ఆటను ఎంచుకొని.. దానిలో ఉన్నత స్థానానికి వెళ్లేది కొద్ది మంది మాత్రమే. అలాంటి కోవకు చెందిన ఈ చిచ్చరపిడుగు.. స్కేటింగ్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండిస్తున్నాడు.

Updated : 06 May 2024 04:11 IST

హాయ్‌ నేస్తాలూ! మనకు చిన్నప్పటి నుంచి ఆటల మీద ఆసక్తి ఉంటుంది. కానీ... సరదాగా ఆడటం కాకుండా, నచ్చిన ఆటను ఎంచుకొని.. దానిలో ఉన్నత స్థానానికి వెళ్లేది కొద్ది మంది మాత్రమే. అలాంటి కోవకు చెందిన ఈ చిచ్చరపిడుగు.. స్కేటింగ్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండిస్తున్నాడు. మరి ఆ చిన్నోడి వివరాలు తెలుసుకుందామా!

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు హౌసింగ్‌ బోర్డుకాలనీకి చెందిన దాదన సఖేష్‌ రెడ్డికి పదకొండేళ్లు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి సురేంద్రరెడ్డి ఓ చిరుద్యోగి. తల్లి లక్ష్మీదేవి గృహిణి. ఈ చిచ్చరపిడుగు తొమ్మిదో ఏట నుంచి స్కేటింగ్‌ పై మక్కువతో శిక్షణ పొందుతున్నాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నాడు. రింక్‌ లేకున్నా రోడ్డు పైనే ప్రాక్టీస్‌ చేస్తూ సత్తా చాటుతున్నాడు.

నాన్న ప్రోత్సాహంతో...

చిన్ననాటి నుంచే పాఠశాలలో నిర్వహించే వివిధ క్రీడలపై సఖేష్‌ ఆసక్తి కనబరిచేవాడు. తండ్రి సురేంద్రరెడ్డి ప్రోత్సాహంతో స్కేటింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. తల్లిదండ్రుల కలను సాకారం చేసేందుకు ఏకాగ్రతతో పట్టువదలని విక్రమార్కుడిలా మూడేళ్ల పాటు సాధన చేశాడు. స్థానికంగా నిర్వహించే చిన్న చిన్న టోర్నమెంట్లలో పాల్గొని మెరుగైన ప్రదర్శన కనబరిచి పతకాలు సాధించేవాడు. అలా మొదలైన అతని ప్రస్థానం మూడు నెలల్లోనే జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వరకు వెళ్లింది.

పతకాల పంట పండిస్తూ...

గత నెల ఏప్రిల్‌ 28న హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో జరిగిన అండర్‌-11 విభాగంలో 15వ ఆల్‌ ఇండియా ఓపెన్‌ రోలర్‌ స్కేటింగ్‌ 500 మీటర్ల జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించి సత్తా చాటాడు. అక్కడి కలెక్టర్‌ చేతుల మీదుగా పతకం అందుకున్నాడు. గోవాలో జరిగిన రిలే నేషనల్‌ 2024లో 500 మీటర్ల పోటీల్లో కాంస్య పతకం, 4×100 మీటర్లలో రజతం సాధించాడు. ఈ ఏడాది జూన్‌లో శ్రీలంకలో జరగనున్న పోటీలకు ఎంపికయ్యాడు. ఆగస్టు 27న మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకూ అర్హత సాధించాడు. 

ఎక్కడ పోటీలు జరిగినా...

గతేడాది తిరుపతిలో జరిగిన స్పీడ్‌ స్కేటింగ్‌లో 400 మీటర్ల పోటీల్లో స్వర్ణ పతకం సాధించాడు. 200, 4×100 మీటర్లలో రజతం అందుకున్నాడు. 2023 గుంటూరులో 22వ స్పీడ్‌ స్కేటింగ్‌ 400 మీటర్లలో కాంస్య పతకం, 4×100లో స్వర్ణం గెలుపొందాడు. ఐస్‌ స్కేటింగ్‌ అంతర్‌ జిల్లాల 500 మీటర్ల పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. పులివెందులలోని వైయస్సార్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ 2023లో 200, 400 మీటర్ల పోటీల్లో స్వర్ణం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇలా ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొంటూ, పతకాలు కైవశం చేసుకుంటున్నాడు. సఖేష్‌ రెడ్డి ఇలాగే భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని.. మనమూ మనసారా తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేదామా... మరి!

కొలిపాక వెంకటసాయి, ఈజేఎస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు