చరితకు లెక్కలు.. ఓ లెక్కే కాదు!

హాయ్‌ నేస్తాలూ! లెక్కలంటే మనలో చాలామందికి భయం కదా! మ్యాథ్స్‌ అంటే కష్టమైన సబ్జెక్టని అనుకుంటాం కదూ! కానీ, ఈ చిన్నారి మాత్రం లెక్కలంటే తెగ మక్కువ చూపిస్తోంది.

Published : 12 May 2024 00:12 IST

హాయ్‌ నేస్తాలూ! లెక్కలంటే మనలో చాలామందికి భయం కదా! మ్యాథ్స్‌ అంటే కష్టమైన సబ్జెక్టని అనుకుంటాం కదూ! కానీ, ఈ చిన్నారి మాత్రం లెక్కలంటే తెగ మక్కువ చూపిస్తోంది. అలవోకగా వేదిక్‌ మ్యాథ్స్‌లో రాణించడమేగాక, ట్రిగ్నామెట్రీ టేబుల్‌లోని విలువలను చకచక చెబుతూ పతకాల పంట పండిస్తోంది. మరి ఆ చిచ్చరపిడుగు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా!

న్నమయ్య జిల్లా నందలూరుకు చెందిన ఆకుల చరితకు పన్నెండేళ్లు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. చిన్ననాటి నుంచే లెక్కల్లో రాణిస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. తండ్రి రామనర్సింహులు ప్రైవేటు లెక్కల అధ్యాపకుడిగా, తల్లి శివనాగకుమారి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

చరితకు నాలుగేళ్ల వయసు నుంచే తన తండ్రి లెక్కల్లో ప్రాథమిక అంశాలైన కూడికలు, తీసివేతలు, మల్టిప్లికేషన్లు, క్యూబ్‌రూట్స్‌లో శిక్షణ ఇచ్చేవారు. అలా ఆరేళ్లకే వాటిల్లో రాటుదేలడంతో పాటు.. వివిధ దేశాల రాజధానుల పేర్లు చెబుతూ.. వాటిని ప్రపంచ పటంలో గుర్తించేది. తను చదివే పాఠశాలలో వేదిక్‌ మ్యాథ్స్‌, అబాకస్‌లో శిక్షణ తీసుకుంటూనే ఇంటికొచ్చాక కూడా మూడు నాలుగు గంటల పాటు సాధన చేసేది.

పతకాలే పతకాలు!

అలా లెక్కల్లో పట్టు సాధించడంతో.. 2019లో విజయవాడలో నాసో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో విజేతగా నిలిచి, రాష్ట్ర స్థాయిలో పసిడి పతకం సాధించింది. 2022లో వేదిక్‌ మ్యాథ్స్‌ వాల్యూమ్‌ 1లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రతిభ పరీక్షల్లో బంగారు పతకం సొంతం చేసుకుంది. వాల్యూమ్‌ 2లోనూ సత్తా చాటడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కడపలో నిర్వహించిన జిల్లా స్థాయి వేదిక్‌ మ్యాథ్స్‌లో పది నిమిషాల్లో చేయాల్సిన 50 లెక్కలను కేవలం ఎనిమిది నిమిషాల్లోనే పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచి, బంగారు పతకం కైవసం చేసుకుంది. మార్చిలో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఏడున్నర నిమిషాల్లో 50 లెక్కలు పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, పురస్కారాలతో పాటు రూ.5 వేల పారితోషికం అందుకుంది. గత నెల 30న హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి మ్యాథ్స్‌ పోటీల్లో 19 రాష్ట్రాల నుంచి చిన్నారులు పాల్గొనగా.. తొమ్మిది నిమిషాల పదహారు సెకన్లలో టార్గెట్‌ పూర్తిచేసి, బంగారు పతకం గెలుపొందింది.

తండ్రి ప్రోత్సాహంతో..

యూట్యూబ్‌లో కథక్‌, వివిధ పాఠ్యంశాలను చూస్తూ నేర్చుకుంటోంది. రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచి మరీ చదువుకుంటోంది. తన తండ్రి ప్రోత్సాహంతో ట్రిగ్నామెట్రి, ప్రోగ్రేషన్లు, రిగ్రేషన్ల వాల్యూస్‌ అలవోకగా చెప్పేస్తోంది. స్కిప్పింగ్‌లోనూ ప్రతిభ చూపుతోంది. భవిష్యత్తులో ఐఏఎస్‌ కావాలన్నదే తన కల అని చెబుతున్న చరిత.. నిజంగా గ్రేట్‌ కదూ!

వేల్పూరి వీరగంగాధర శర్మ, ఈనాడు డిజిటల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని