సాత్విక్‌.. స్విమ్మింగ్‌ రికార్డు..!

హాయ్‌ నేస్తాలూ..! వేసవి సెలవుల్లో ఎంచక్కా ఆడుకుంటున్నారు కదూ! ఇప్పటి వరకు మనం రకరకాల ఆటల్లో రికార్డులు సాధించిన వాళ్ల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు స్విమ్మింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ఒక చిన్నారి గురించి తెలుసుకుందాం.

Published : 16 May 2024 00:06 IST

హాయ్‌ నేస్తాలూ..! వేసవి సెలవుల్లో ఎంచక్కా ఆడుకుంటున్నారు కదూ! ఇప్పటి వరకు మనం రకరకాల ఆటల్లో రికార్డులు సాధించిన వాళ్ల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు స్విమ్మింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ఒక చిన్నారి గురించి తెలుసుకుందాం. వెంటనే ఈ కథనం చదివేయండి. ఆ వివరాలేంటో మీకే తెలుస్తాయి..!

కేరళలోని ఎర్నాకులానికి చెందిన సాత్విక్‌ సందీప్‌కు తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. తనకు చిన్నప్పటి నుంచే.. స్విమ్మింగ్‌ అంటే ఆసక్తి ఎక్కువట. అందుకే తన అమ్మానాన్నలు.. అప్పటి నుంచే స్విమ్మింగ్‌లో శిక్షణ ఇప్పించారు. శిక్షణలో చేరిన తక్కువ కాలంలోనే.. పోటీల్లో పాల్గొని, బహుమతులు కూడా సొంతం చేసుకున్నాడట.

సరికొత్తగా..!

సాధారణంగా స్విమ్మింగ్‌ అంటే.. కాళ్లు, చేతులు ఆడించాలి. లేకపోతే నీటిలోనే మునిగిపోతారు. కానీ మన సాత్విక్‌ చేతులు కట్టేసి ఉన్నప్పుడు.. స్విమ్మింగ్‌ చేసి రికార్డు సాధించాడు. అలా 1 గంట 35 నిమిషాల్లో 4.5 కిలో మీటర్ల దూరం స్మిమ్మింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తన ప్రతిభతో ‘వరల్డ్‌వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాడు.

పట్టు వదలకుండా..!

‘సాత్విక్‌ చాలా పట్టుదలతో ప్రాక్టీస్‌ చేస్తాడు. చేతులు కట్టేశాక స్విమ్మింగ్‌ చేయడం.. సాధారణంగా చేసే దానిలా ఉండదు, చాలా కష్టం. అయినా సరే.. తను కష్టపడి తక్కువ సమయంలోనే నేర్చుకున్నాడు. స్విమ్మింగ్‌ చేయాలంటే.. శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉండాలి. అందుకోసం సాత్విక్‌ ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం కూడా చేస్తాడు. పిల్లలు చాక్లెట్లు, ఐస్‌క్రీములు చాలా ఇష్టంగా తింటారు. కానీ తను మాత్రం.. కావాల్సిన ఆహారాన్నే తీసుకుంటాడు’ అని సాత్విక్‌ కోచ్‌ బిజు చెబుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యుత్తమ స్విమ్మర్‌ అవ్వాలనేదే ఈ చిన్నారి లక్ష్యమట. మరి మనమూ తనకి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని