బుడత కొంచెం.. మోత ఘనం!

హాయ్‌ నేస్తాలూ..! మనకు కీబోర్డు, డ్రమ్స్‌ వాయించడం రాకపోయినా.. ఎవరైనా వాటితో మ్యూజిక్‌ వాయిస్తుంటే ఆసక్తిగా వింటాం. అదే మనలాంటి పిల్లలైతే ఆశ్చర్యపోతాం అంతే కదా!

Updated : 19 May 2024 03:37 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు కీబోర్డు, డ్రమ్స్‌ వాయించడం రాకపోయినా.. ఎవరైనా వాటితో మ్యూజిక్‌ వాయిస్తుంటే ఆసక్తిగా వింటాం. అదే మనలాంటి పిల్లలైతే ఆశ్చర్యపోతాం అంతే కదా! అలాంటి విషయమే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకాలస్యం వెంటనే ఈ కథనం చదివేయండి!

ణిపుర్‌కి చెందిన బెన్హవి గంగ్టెకి తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. ఈ బుడతడికి చిన్నప్పటి నుంచి మ్యూజిక్‌ మీద ఆసక్తి ఎక్కువట. ఈ వయసు పిల్లలు ఏదో ఒక ఆట లేకపోతే.. మ్యూజిక్‌ వంటివి నేర్చుకోవడం సాధారణమే. కానీ బెన్హవి మాత్రం డ్రమ్స్‌ వాయించడం, పియానో వాయించడం ఇలా మ్యూజిక్‌కి సంబంధించిన పరికరాలన్నీ ప్లే చేయడం నేర్చుకున్నాడు. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

నాన్న ప్రోత్సాహమే!

సాధారణంగా పిల్లలు ఒకే పనిని ఎక్కువసేపు చేయడానికి అస్సలు ఇష్టపడరు. కానీ.. మన బెన్హవి మాత్రం ఓ కార్యక్రమంలో.. పలు భాషల్లోని 78 పాటలకు 6 గంటల 28 సెకన్లు ఆపకుండా.. మ్యూజిక్‌ వాయించి.. రికార్డు సాధించాడు. మ్యూజిక్‌ వాయించడమే కాకుండా.. ఆగకుండా పాటలు కూడా పాడాడు నేస్తాలూ! ఆశ్చర్యంగా ఉంది కదూ! అత్యుత్తమ ప్రతిభ కనబర్చి.. ప్రముఖుల ప్రశంసలు పొందాడు. ఇంకా.. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాడు. అయితే.. తను ఇంతటి ఘనత సాధించడానికి వాళ్ల నాన్న ప్రోత్సాహమే కారణమట. బెన్హవి సాధన చేయడానికి కావాల్సిన అన్ని వస్తువులు తనకు అందుబాటులో ఉంచడమే కాకుండా.. ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో.. ఎన్ని గంటలైనా తోడుగా ఉండేవారట. భవిష్యత్తులో.. సంగీత ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టించడమే తన లక్ష్యమంటున్న బెన్హవికి మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని