భళా బాల.. భలే భలే బాల!

హాయ్‌ నేస్తాలూ..! సెలవుల్లో సమయాన్ని బాగా వృథా చేస్తున్నారు కదూ! మనలో చాలా మంది ఎంత వయసు వచ్చినా కొత్తవి నేర్చుకోవడంపై ఉత్సాహం చూపకుండా టీవీలు, స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటారు.

Published : 20 May 2024 00:14 IST

హాయ్‌ నేస్తాలూ..! సెలవుల్లో సమయాన్ని బాగా వృథా చేస్తున్నారు కదూ! మనలో చాలా మంది ఎంత వయసు వచ్చినా కొత్తవి నేర్చుకోవడంపై ఉత్సాహం చూపకుండా టీవీలు, స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ ఓ బుడతడు మాత్రం సమయాన్ని సద్వినియోగం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. మరి ఆ చిరుత గురించి ఇప్పుడు తెలుసుకుందామా!

కాకినాడ జిల్లా తునికి చెందిన రామనారాయణరాజుకు ప్రస్తుతం అయిదేళ్ల వయసు. యూకేజీ చదువుతున్నాడు. మూడేళ్ల వయసు నుంచే ఏదైనా నేర్చుకోవడమంటే ఆసక్తి చూపేవాడు. అది గమనించిన తల్లిదండ్రులు శిక్షణ మొదలు పెట్టారు. అతి తక్కువ కాలంలోనే అందరూ మెచ్చుకొనే స్థాయికి వెళ్లాడు. ఇటీవల ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో కేవలం 9 సెకన్ల వ్యవధిలోనే దక్షిణ అమెరికాలోని 13 దేశాల జెండాలు గుర్తించి అందరినీ అబ్బురపరిచాడు. అత్యంత వేగంగా 13 దేశాల జెండాలు గుర్తించిన చిన్నారిగా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కించుకున్నాడు. 

అలా నేర్చుకున్నాడు..

చిన్నప్పటి నుంచి జెండాలపై ఉన్న ఆసక్తితో ముందుగా ఒకటి, రెండు దేశాల జెండాలు గుర్తు పట్టడం నేర్చుకున్నాడు. అలా అది కాస్త పది, ఇరవైకి చేరుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇప్పుడు 195 దేశాలు.. వాటి జెండాలు.. రాజధానులు.. ఆ దేశాలు ఏ ఖండంలో ఉంటాయో కూడా చెప్పగలడు. ఏదైనా తెలియకపోతే ఇంటర్‌నెట్‌ సాయంతో నేర్చుకుంటుంటాడు. రామనారాయణరాజుకు క్రికెట్‌ అంటే కూడా ఇష్టం. ఐపీఎల్‌లోని జెర్సీలు చూపిస్తే.. అది ఏ టీమ్‌ అనేది చెప్పగలడు. తమ కుమారుడికి ఏది ఇష్టమో.. అటువైపు ప్రోత్సహించడం వల్లనే ఇది సాధ్యమైందంటున్నారు రామనారాయణ రాజు తల్లిదండ్రులు. భవిష్యత్తులో ఎటువైపు వెళ్లాలనేది తానే నిర్ణయించుకుంటాడని, చెడు వైపు వెళ్లకుండా మాత్రమే తాము పర్యవేక్షిస్తామంటున్నారు. ఇంత చిన్న వయసులో బుడతడి టాలెంట్‌ను చూసి చుట్టు పక్కల వారు మెచ్చుకుంటుంటే తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఎంతైనా ఈ బుడతడు  నిజంగా గ్రేట్‌ కదూ!

దాసర హేమరాజు, ఈజేఎస్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని