ఈ చిన్నారి.. చిచ్చరపిడుగు!

విజయవాడలోని లబ్బీపేటకు చెందిన కామిశెట్టి ధ్రువసాయికి ప్రస్తుతం మూడు సంవత్సరాలు. నాన్న సత్యప్రకాశ్‌ ప్రైవేటు ఉద్యోగి.. అమ్మ హిమజ గృహిణి.

Published : 21 May 2024 00:17 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం చదివింది ఏదైనా బాగా గుర్తుండాలంటే.. మళ్లీ మళ్లీ చదువుతాం.  గుర్తుండకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం.. అది చదువులోనైనా, నిత్య జీవితంలోనైనా.. అంతే కదా! కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే బుడతడు మాత్రం.. ఏదైనా విషయాన్ని ఒకసారి చెబితే చాలు, ఇట్టే గుర్తు పెట్టుకుంటున్నాడు. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. మరి ఆ చిన్నారి ఎవరో? తన వివరాలేంటో తెలుసుకుందామా..!

విజయవాడలోని లబ్బీపేటకు చెందిన కామిశెట్టి ధ్రువసాయికి ప్రస్తుతం మూడు సంవత్సరాలు. నాన్న సత్యప్రకాశ్‌ ప్రైవేటు ఉద్యోగి.. అమ్మ హిమజ గృహిణి. ఈ బుడతడు సాయి.. తనకు ఏడాదిన్నర వయసు ఉన్నప్పటి నుంచే.. పుస్తకాల్లో బొమ్మలు చూపిస్తూ, వాటి గురించి చెప్పమనేవాడట. చెప్పిన వెంటనే.. మళ్లీ తను కూడా వాటిని పలకడానికి ప్రయత్నించేవాడట. 

పతాకాలు గుర్తించి..!

మన చిన్నారి సాయి.. 170 దేశాల జాతీయ జెండాలను కేవలం 4 నిమిషాల్లో గుర్తించాడు. అలాగే 32 దేశాల రాజధానుల పేర్లు, మన దేశంలోని రాష్ట్రాలు.. రాజధానుల పేర్లు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఇట్టే వివరించేస్తున్నాడు. అంతే కాకుండా.. మన ఇండియా మ్యాప్‌లో ఏ రాష్ట్రం ఎక్కడుంటుందో కూడా గుర్తిస్తున్నాడు. లోగో చూసి.. ఏ కంపెనీ కారో కూడా చెబుతున్నాడు. ఇంకా బడిబాట పట్టకపోయినా.. ఆంగ్లంలో ఒక్కో అక్షరానికి 8 నుంచి 10 పదాల వరకు చెప్పగలడు. ఫొటోలు చూసి.. స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు, నదుల పేర్లు కూరగాయలు, రంగులు, పువ్వులు.. ఇలా అన్నింటినీ బాగా గుర్తుపెట్టుకొని వాటి పేర్లు చెప్పేస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే నేస్తాలూ..!

తెలుగులోనూ..!

ప్రస్తుతం చాలామంది పిల్లలకు తెలుగు భాష నేర్చుకోవడానికి చాలా సమయం పడుతోంది. కానీ సాయి మాత్రం.. తెలుగులో వర్ణమాలతో సహా.. గుణింతాలు, వాటి సంబంధ పదాలు కూడా చెబుతున్నాడు. అంతే కాకుండా.. తెలుగు నెలలు, వారాలు వివరిస్తున్నాడు. తను భక్తి పాటలు కూడా పాడతాడట. స్విమ్మింగ్, ఫుట్‌బాల్‌ అంటే చాలా ఇష్టమట. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ! 

కర్ల వెంకటేష్, చిట్టినగర్, విజయవాడ, న్యూస్‌టుడే  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని