గౌనులాంటి కేకు!

హాయ్‌ నేస్తాలూ.. ‘మీకు కేకులూ, చాక్లెట్లూ అంటే ఇష్టమేనా?’ అని ఎవరైనా మనల్ని అడిగితే, ‘ఇష్టమేనా అని అలా చిన్నగా అడుగుతారేంటి?

Published : 10 Sep 2023 00:32 IST

హాయ్‌ నేస్తాలూ.. ‘మీకు కేకులూ, చాక్లెట్లూ అంటే ఇష్టమేనా?’ అని ఎవరైనా మనల్ని అడిగితే, ‘ఇష్టమేనా అని అలా చిన్నగా అడుగుతారేంటి? అసలు వాటి పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతుంటేనూ..!’ అని టక్కున జవాబిచ్చేస్తాం. ఇప్పటి వరకూ కేకులను జంతువులు, పక్షులు, వాహనాలు, బొమ్మలు ఇలా రకరకాల రూపాల్లో చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కేక్‌ మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకే ప్రపంచ రికార్డూ సాధించింది. ఆ వివరాలే ఇవి..

స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ బేకరీ నిర్వాహకులకు ఏదైనా కొత్తగా చేయడం అలవాటు. అలాగే ఒకసారి విభిన్నమైన కేక్‌ను తయారు చేయాలని అనుకున్నారు. అనుకోవడమేంటి చేసేశారు కూడా.. కానీ, దాన్ని చేత్తో పట్టుకొని తీసుకెళ్లలేరు. వాహనంలోనూ వేసుకెళ్లలేరు. ‘మరి ఎలా?’ అనే కదా మీ అనుమానం.. ఆ కేక్‌ని ఏకంగా ధరించొచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. నిజమే నేస్తాలూ.. సదరు బేకరీ వాళ్లు ఓ గౌను రూపంలో తయారు చేశారా కేక్‌ని. అంతేకాదు.. ఇది ‘ది లార్జెస్ట్‌ వేరబుల్‌ కేక్‌ డ్రెస్‌’గా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించింది.  

కూతురి మీదే ప్రయోగం..

ఈ కేక్‌ తయారు చేయాలనే ఆలోచన ‘నటాషా కొలినే కిమ్‌ ఫాహ్‌ లీ ఫొకాస్‌’ అనే మహిళదట. కేక్‌ డిజైనర్‌ అయిన ఆమె 2014లో ఓ బేకరీని ప్రారంభించారు. కేకుల తయారీ, నిల్వ తదితర అంశాల మీద ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుందామె. డ్రెస్‌ ఆకారంలో కేకు తయారు చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే, ఆమె తన కుమార్తె మీదే మొదటగా ప్రయత్నం చేశారట. అది బాగా రావడంతో స్థానికంగా జరిగే ఓ పోటీలో భాగంగా ఈ భారీ గౌను కేకు తయారీకి శ్రీకారం చుట్టారు.

అందరికీ పంచిపెట్టారట..

అసలు ఆ కేకును గౌను ఆకారంలో ఎలా తయారు చేశారనే సందేహం మీకు వచ్చే ఉంటుంది కదూ.. దాని కోసం ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నారట. మొదట అల్యూమినియం తీగలు, రేకుల సాయంతో గౌను ఆకారాన్ని తయారు చేశారు. ఆ తర్వాత ఆ అచ్చుల ఆధారంగా కేకును రూపొందించారు. దాని మొత్తం బరువు 131.15 కిలోలు. ఆ గౌను పైన వివిధ డిజైన్లు, పువ్వుల ఆకారం కోసం ‘రాయల్‌ ఐసింగ్‌’ అనే పద్ధతిని ఉపయోగించారట. ఇంకో విషయం ఏంటంటే.. దీని తయారీకి ప్రాణం పోసిన నటాషానే.. ఆ కేకును ధరించి, గిన్నిస్‌ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్నీ అందుకున్నారు. కార్యక్రమం అంతా పూర్తయ్యాక.. ఆ కేక్‌ను ముక్కలుగా కోసి అందరికీ పంచిపెట్టారట. నేస్తాలూ.. ఈ కేకు విశేషాలు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని