ఈ నది నీళ్లు..అలా ఎందుకబ్బా?

హలో ఫ్రెండ్స్‌.. మనకు నదులు, సముద్రాల గురించి ఎంత తెలిసినా.. ఇంకా అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి

Published : 26 Oct 2023 01:19 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు నదులు, సముద్రాల గురించి ఎంత తెలిసినా.. ఇంకా అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అలాంటి ఒక ఆసక్తికర విషయాన్నే ఓ శాస్త్రవేత్తల బృందం తాజాగా కనిపెట్టింది. ఆ వివరాలేంటో చదివేయండి మరి..

ఆఫ్రికాలోని కాంగో నదికి ‘రుకీ’ అనే ఒక ఉపనది ఉంది. దీన్ని ‘డార్కెస్ట్‌ రివర్‌ ఇన్‌ ది వరల్డ్‌’గా శాస్త్రవేత్తలు ఇటీవల తేల్చారు. ఇందులోని నీళ్లు ఎంత ముదురు రంగులో ఉంటాయంటే.. కనీసం మన ముఖం ప్రతిబింబం కూడా అందులో కనిపించదట.

కారణమదేనట..

‘ఇంతకీ ఆ రుకీ నదిలోని నీటికి ఆ ముదురు రంగు ఎలా వచ్చింది?’ అని ఆలోచిస్తున్నారా.. అదే చెప్పబోతున్నా నేస్తాలూ.. ఆ నది చుట్టుపక్కల దట్టమైన అడవులు ఉన్నాయి. ఆ అడవుల్లోని చెట్ల నుంచి రాలిపడిన ఆకులు, వర్షం నీటితోపాటు నదిలో కలుస్తున్నాయట. ఆ ఆకుల్లోని కార్బన్‌ అవశేషాల కారణంగా నీళ్లు ముదురు రంగులోకి మారుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. కొత్తవాళ్లెవరైనా ఈ నది నీటిని చూస్తే, బురద నీళ్లని అనుకుంటారట.

అంతకుమించి..

ఇప్పటివరకూ అమెజాన్‌ అడవుల్లోని రియో నది నీళ్లే అత్యంత ముదురు రంగులో ఉంటాయని పేరుంది. కానీ, వాటితో పోల్చుకుంటే ఈ రుకీ నదిలోని నీళ్లు ఒకటిన్నర రెట్లు డార్క్‌గా ఉన్నాయట. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త తన పరిశోధన పత్రంలో కాఫీని అతిగా మరిగిస్తే ఎంత ముదురు రంగు ఉంటుందో ఈ నదిలోని నీరు కూడా అలా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు నేస్తాలూ.. ఈ నదిలో కలుస్తున్న ఆర్గానిక్‌, కార్బన్‌ మూలకాలపైన రకరకాల పరిశోధనలు సాగుతున్నాయట. నేస్తాలూ.. మొత్తానికి ఈ ‘డార్కెస్ట్‌ రివర్‌ ఇన్‌ ది వరల్డ్‌’ విశేషాలు కొత్తగా ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు