ఈ అక్కాచెల్లెళ్లు ఆల్‌ రౌండర్లు!

వాళ్లిద్దరూ... అక్కాచెల్లెళ్లు. అంతే కాదు ఆల్‌ రౌండర్లు! భగవద్గీత పారాయణం.. శ్లోకాల పఠనం ఓ వైపు.. యోగాసనాలు మరోవైపు... ఇవే కాకుండా కరాటేలోనూ రాణిస్తూ.. అందరూ ‘ఔరా...!’ అని అవాక్కయ్యేలా చేస్తున్నారు.

Published : 04 Feb 2023 00:02 IST

వాళ్లిద్దరూ... అక్కాచెల్లెళ్లు. అంతే కాదు ఆల్‌ రౌండర్లు! భగవద్గీత పారాయణం.. శ్లోకాల పఠనం ఓ వైపు.. యోగాసనాలు మరోవైపు... ఇవే కాకుండా కరాటేలోనూ రాణిస్తూ.. అందరూ ‘ఔరా...!’ అని అవాక్కయ్యేలా చేస్తున్నారు. మరి ఆ చిచ్చర పిడుగుల గురించి తెలుసుకుందామా. అయితే ఇంకెందుకాలస్యం.. ఈ కథనం చదివేయండి.

 

సంజన

ల్గొండ జిల్లా అప్పాజిపేటకు చెందిన దాసోజు సంజన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, దాసోజు సౌమ్య ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. నరసింహాచారి, లక్ష్మీప్రసన్న వీరి తల్లిదండ్రులు. వీరికి ఆధ్యాత్మిక భావాలున్నాయి. నాన్న కరాటే శిక్షకుడు. దీంతో చిన్నతనం నుంచే ఈ అక్కాచెల్లెళ్లకు కళలపై ఆసక్తి ఏర్పడింది.

సౌమ్య


అవలీలగా...

భగవద్గీతలోని శ్లోకాలను కంఠస్థం చేయడం అంత సులువు కాదు. కానీ అక్కాచెల్లెళ్లిద్దరూ దాదాపు 700 శ్లోకాలను అవలీలగా పఠించగలరు. యజుర్వేదం, అధర్వణ వేదాన్నీ పఠిస్తారు. 60 ధర్మాచరణ శ్లోకాలు, 30 గీతాలు, గేయాలు, దైవిక ప్రార్థనలను పది గంటలకు పైగా ఏకధాటిగా, పూర్తి కంఠస్థంగా అప్పజెప్పగలరు. శ్లోకాలను ఏకధాటిగా ఎటు నుంచి అడిగినా అక్కడి నుంచి తడబాటు లేకుండా చెప్పడం వీరి ప్రత్యేకత.


సత్తా చాటారు!

సిద్దిపేటలో 2022లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో సత్తా చాటి వీరు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జపాన్‌ కరాటే అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో కటా విభాగంలో సంజన బంగారు పతకం సాధించింది. కుమిటే విభాగంలో సౌమ్య స్వర్ణం గెల్చుకుంది. నల్గొండలో జరిగిన 34వ రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్‌లో సౌమ్యకు బంగారు పతకం, కటాలో వెండి పతకం దక్కింది. సూర్యాపేటలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీల్లో భాగంగా జరిపిన సహస్ర గళ గీతార్చనలో పాల్గొన్నారు. శ్లోకాలు పఠించి శ్రోతలను అలరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో గతేడాది సెప్టెంబరున లీడ్‌ వరల్డ్‌ ఆధ్వర్యంలో 18,000 మందితో భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పుస్తకం చూడకుండా 700 శ్లోకాలు పఠించి అబ్బురపరిచారు. వందకు పైగా యోగాసనాలు వేయడంలో అక్కాచెల్లెళ్లు దిట్ట. కాలు కింద పెట్టకుండా కరాటేలో 400 వరకు ఏకధాటిగా కిక్స్‌ కొట్టగలరు.


అమ్మానాన్న సహకారంతో...

‘కరోనా సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండటంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేయడం అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు 700 శ్లోకాలను అవలీలగా పఠించే స్థాయికి చేరుకున్నాం. రోజూ నాన్న సారథ్యంలో కరాటే సాధన ప్రారంభించాం. ఇది దినచర్యగా మారింది. యోగా, కరాటేలో ప్రావీణ్యం సాధించాం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాం’ అని చెబుతున్నారు సంజన, సౌమ్య. మరి ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా.

ఏర్పుల రమేష్‌,
సూర్యాపేట సాంస్కృతికం, న్యూస్‌టుడే


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని