sri ram: ఈ బుడుగు.. భలే చిచ్చరపిడుగు!

హాయ్‌ నేస్తాలూ! మనలో చాలామంది ఎదుటివారిని చూసి.. నాకు వారిలా ప్రతిభ లేదే అని బాధపడుతుంటారు. కానీ మనలోని ప్రత్యేకతను మాత్రం గుర్తించం.

Published : 05 Jun 2024 04:38 IST

హాయ్‌ నేస్తాలూ! మనలో చాలామంది ఎదుటివారిని చూసి.. నాకు వారిలా ప్రతిభ లేదే అని బాధపడుతుంటారు. కానీ మనలోని ప్రత్యేకతను మాత్రం గుర్తించం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. ఓ బుడతడు దాన్ని గుర్తించి, పదును పెట్టాడు. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. అందరి మన్ననలు పొందుతున్నాడు. మరి ఆ చిచ్చరపిడుగు గురించి తెలుసుకుందామా!

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన నల్ల శ్రీరామ్‌ ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. తన తండ్రి నరేంద్రనాథ్‌ ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో చీఫ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉంటున్నారు. తల్లి జోత్స్న అక్కడే ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. శ్రీరామ్‌కు చిన్నప్పటి నుంచీ కొత్తగా ఏదైనా నేర్చుకోవడమంటే ఇష్టం. చిన్నప్పుడు పుణెలో ఉండేటప్పుడు అబాకస్‌లో అయిదు స్థాయిలు పూర్తి చేశాడు. చెస్, క్రికెట్‌ ఆడటానికి ఆసక్తి చూపుతుంటాడు. సాధారణంగా మనం కాలి, చేతి మెటికలు మహా అయితే రెండు, మూడు విరవగలుగుతాం. కానీ ఓ రోజు ఇంటి వద్ద అంతా కూర్చున్నప్పుడు శ్రీరామ్‌ వచ్చి తన కుడికాలి మెటికలు ఆపకుండా విరవగలనని తల్లిదండ్రులకు చెప్పాడు. అది చూసి ఆశ్చర్యపోయి ఇంటర్నెట్‌లో దానికోసం వెతికారు. అప్పటికే ఒక నిమిషం వ్యవధిలో 71 సార్లు విరిచిన రికార్డ్‌ ఉందని తెలుసుకున్నారు. అలా ప్రాక్టీస్‌ చేయడానికి ప్రోత్సహించారు. ఒక నిమిషంలో 76 సార్లు కుడికాలి మెటికలు విరిచి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సాధించాడు.

అత్యంత వేగంగా...

శ్రీరామ్‌కు చిన్నప్పటి నుంచి నంబర్లు, అక్షరాలు వేగంగా చెప్పే అలవాటు ఉండడంతో దానిలో తల్లిదండ్రులు తర్ఫీదు ఇచ్చారు. అలా.. దాదాపు 28 సెకన్లలో 1 నుంచి 100 వరకు నంబర్లు చెప్పి అత్యంత వేగంగా లెక్క పెట్టిన వ్యక్తిగా ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సాధించాడు.

చెప్పలేని ఆనందం..

చిన్నవయసులోనే తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్న శ్రీరామ్‌ను చూసి చుట్టుపక్కల వారు అభినందిస్తుంటే.. తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. బాబుకు నచ్చిన పని చేయడానికి ప్రోత్సహించడం వల్లనే ఇది సాధ్యమైందని వారు అంటున్నారు. తన జీవితం తన చేతుల్లోనే ఉంచుతామని, స్నేహితుల్లా.. చేయూత అందిస్తున్నామంటున్నారు. పిల్లలను కేవలం చదువుల్లోనే కాకుండా.. ఆటలు, ఇతర యాక్టివిటీల విషయంలో కూడా ప్రోత్సహిస్తేనే వారనుకున్నది సాధించగలరంటున్నారు. మరి శ్రీరామ్‌ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని మనమూ మనసారా కోరుకుందామా!

 దాసర హేమరాజు, ఈనాడు పాత్రికేయ పాఠశాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని