ఉద్వేగాల భారం... వదిలించుకుందాం!

తెలియని భయం, అర్థంలేని ఆందోళన, అంతులేని నిరాశ... మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? కనిపించని బరువేదో నెత్తినెక్కి తైతక్కలాడుతున్న భావన స్థిమితంగా ఉండనీయడం లేదా? ఇవన్నీ ‘ఎమోషనల్‌ బ్యాగేజ్‌’ ప్రభావాలే.

Updated : 21 May 2024 15:18 IST

తెలియని భయం, అర్థంలేని ఆందోళన, అంతులేని నిరాశ... మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? కనిపించని బరువేదో నెత్తినెక్కి తైతక్కలాడుతున్న భావన స్థిమితంగా ఉండనీయడం లేదా? ఇవన్నీ ‘ఎమోషనల్‌ బ్యాగేజ్‌’ ప్రభావాలే. తక్షణం, ఆ మోతను దించుకోండి. కాలంచెల్లిన ఉద్వేగాల్ని వదిలించుకోండి.

చిక్కని చీకటి.
ఈదురుగాలి.
ఉరుములూ మెరుపులూ.
ఒంటరి మహిళ.
ఎక్కడికో వెళ్తోంది.
ఓ అజ్ఞాత వ్యక్తి వెనుక నుంచి వచ్చాడు.
ఆమె గొంతు పట్టుకున్నాడు.
పట్టుబిగించాడు. ఊపిరాడకుండా చేశాడు.  
విడిపించుకోడానికి విఫల ప్రయత్నం చేసిందామె.
ఆ ప్రాణాపాయ స్థితిలోనూ..
అతనెవరో తెలుసుకోవాలనే ఉత్కంఠ.
సత్తువనంతా కూడగట్టుకుని తల పక్కకు తిప్పింది.
మనిషిలాంటి జంతువు!
కాదు కాదు. జంతువును పోలిన మనిషి!
ఎప్పుడో, ఎక్కడో చూసినట్టు గుర్తు.
ఇంట్లోనా, స్కూల్లోనా?
బాల్యంలోనా, కౌమారంలోనా?
స్పష్టత వచ్చేలోపే కల చెదిరింది.
కలత మిగిలింది.
కలలన్నీ నిజం కాకపోవచ్చు.
కానీ, చాలా పీడకలలకు చేదు
జ్ఞాపకాలే ముడిసరుకు.  
మస్తిష్కంలో పోగుపడిన ఆ పాత వాసనల ఉద్వేగాల మూట..
ఎమోషనల్‌ బ్యాగేజ్‌!

                   

జీవితం అంటేనే.. అనుభవాల ఆల్బమ్‌. బాల్యం, కౌమారం, యవ్వనం.. ప్రతి దశలోనూ కొత్త సంఘటనలు వచ్చి చేరుతుంటాయి. అందులో అనవసరమైనవీ, అప్రధానమైనవీ అనేకం. చిన్నాచితకా లెక్కలేనన్ని. కాలక్రమంలో తొంభైశాతం వరకూ తుడిచిపెట్టుకుని పోతాయి. ఆ దశలన్నీ దాటిన తర్వాత.. కొన్ని తీపి జ్ఞాపకాలు, కాసిన్ని చేదు అనుభవాలు మాత్రమే మిగులుతాయి. తీపి జ్ఞాపకాలతో ఏ ఇబ్బందీ లేదు. ఎంతోకొంత మంచే చేస్తాయి. మనుగడపై మక్కువ కలిగిస్తాయి. బంధాలను బలోపేతం చేస్తాయి. పాత ముచ్చట్లతో శరీరంలో ఆనంద రసాయనాల ఊట పెరుగుతుంది. సమస్యంతా చేదు అనుభవాలతోనే. కుంగదీసే జ్ఞాపకాలతోనే. ఆ బరువును భరిస్తున్నంత కాలం.. మనశ్శాంతిగా ఉండలేం. మనం మనలా ఆలోచించలేం. మనం మనలా ప్రవర్తించలేం. మనసును ఓ పెద్ద పెట్టెలా ఊహించుకుంటే, అందులో పోగుపడిన పాత వస్తువుల్లాంటివి.. గతకాలపు నెగెటివ్‌ ఉద్వేగాలు. 

ఆత్మీయుల మరణం..

దుఃఖాన్ని కలిగిస్తుంది. నైరాశ్యాన్ని పెంచేస్తుంది. బతుకు పట్ల మమకారాన్ని చంపేస్తుంది.

లైంగిక దాడి..

భయానకమైన ఘటన. అప్పటి వరకూ అతనొక రక్త సంబంధి, దూరపు చుట్టం, స్నేహితుడు. కొన్నిసార్లు, ముక్కూ మొహం తెలియని మనిషీ కావచ్చు. ఎవరైతేనేం..

ఆ సమయంలో లోపలి సైతాన్‌ బయటి కొస్తుంది. పశువాంఛను తీర్చుకుంటుంది. అదొక నరకం. ఇలాంటి సందర్భాల్లో ఒంటికి తగిలే దెబ్బల కంటే, మనసును మెలితిప్పే గాయాలే ఎక్కువ. కాలం గడిచి పోతున్నా ఆ పుండ్లు పచ్చిగానే ఉంటాయి. దుఃఖస్రావం జరుగుతూనే ఉంటుంది.

కుటుంబ విచ్ఛిన్నం.. 

కొన్ని ఇళ్లు అశాంతి నివాసాలు. ఆలూ మగల తిట్ల్లూ, శాపనార్థాలూ, ఆత్మహత్య ప్రయత్నాలూ.. చివరికి విడాకుల వరకూ వెళ్తుంది వ్యవహారం. ఫలితంగా.. అమ్మ ఒడి దూరమై కొందరు, నాన్న ప్రేమ కరవై కొందరు, ఇద్దర్నీ కోల్పోయి మరికొందరు పిల్లలు.. ఒంటరితనానికి గురవుతారు. ప్రేమరాహిత్యానికి బలవుతారు. 

ఎమోషనల్‌ బ్యాగేజ్‌ చాలావరకూ బాల్యంలోని చేదు ఉద్వేగాలతోనే నిండిపోతుంది. కౌమార, యవ్వనాల్లో ఇంకొన్ని పోగుపడతాయి. పరీక్షల్లో అపజయాలూ, ప్రేమలో వైఫల్యాలూ, ఆర్థిక సమస్యలూ, వరుస అబార్షన్లూ, అయినవారి వెన్నుపోట్లూ, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురుదెబ్బలూ కల్లోలపరుస్తాయి. కోలుకోకుండా చేస్తాయి. గతంలో మొదలైన ఆ దుఃఖం వర్తమానంలో కూడా కొనసాగుతుంది. భవిష్యత్తుకూ బదిలీ అవుతుంది. ఫలితంగా, ఉద్వేగాల మూట మరింత బరువెక్కుతుంది. ఆ మోత మోయలేకా, ఎలా దించుకోవాలో అర్థంకాకా మానసిక సమతౌల్యాన్ని కోల్పోయేవారు ఎంతోమంది.

అనేక ఉదాహరణలు..

రాజేంద్ర బహుళజాతి సంస్థలో ఉద్యోగి. అతనికో అన్నయ్య ఉండేవాడు. ఐఐటీలో సీటు రాకపోవడంతో.. క్షణికావేశంలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఆ విషాదం నుంచి తేరుకోడానికి రాజేంద్రకు చాలా సమయం పట్టింది. కొంతకాలం డిప్రెషన్‌లోనూ ఉన్నాడు. స్వతహాగా తెలివైనవాడు కావడంతో, చదువులకు ఇబ్బంది కలగలేదు. మంచి మార్కులతో ఎంబీయే పూర్తి చేశాడు. ఓ కంపెనీ పెట్టి పదిమందికీ ఉపాధి కల్పించాలన్నది రాజేంద్ర కల. పెట్టుబడి సొమ్ము సమకూరిన తర్వాత కూడా .. వైఫల్య భయంతో వెనుకడుగు వేస్తున్నాడు. అన్నయ్య మరణం తాలూకు విషాదం ఎమోషనల్‌ బ్యాగేజ్‌ రూపంలో అతన్ని వెంటాడుతోంది. 

బరువు తగ్గడం అందుకే అంత కష్టం

రాధిక బాగా చదువుకుంది. తెలివైంది. మంచి ఉద్యోగం చేస్తోంది. పెళ్లి విషయంలో మాత్రం ఓ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఒకరిద్దరు కుర్రాళ్లు నచ్చారు కూడా. కానీ, ‘ఎస్‌’ చెప్పాలంటే తెలియని బెరుకు. ఈ సమస్యకు మూలం ఆమె బాల్యంలో ఉంది. రాధిక అమ్మ కడుపులో ఉన్నప్పుడే.. అప్పుల బాధతో తండ్రి ఊరొదిలి వెళ్లిపోయాడు.

తల్లి కష్టాలను దగ్గర నుంచీ చూసిందామె. ఆ బరువైన జ్ఞాపకాలు మగజాతి పట్ల అపనమ్మకాన్ని సృష్టించాయి. ఎమోషనల్‌ బ్యాగేజ్‌ ప్రభావం వల్లే ప్రేమ-పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేస్తోంది.

క్రిస్టఫర్‌ మ్యాథ్స్‌లో జీనియస్‌. డిగ్రీ చదివే రోజుల్లోనే.. ఓ గణితశాస్త్ర సూత్రంలోని ప్రామాణికతను ప్రశ్నిస్తూ పెద్ద వ్యాసం రాశాడు. దాన్ని తనకు తెలిసిన ప్రొఫెసరుకు చూపించాడు. కొద్దిరోజులకు ఆ పరిశోధన పత్రం ఓ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైంది. అదీ సదరు ప్రొఫెసరు పేరు మీద. ఆ సంఘటన క్రిస్టఫర్‌ను దాదాపుగా పిచ్చివాణ్ని చేసింది. అతనిలోని జిజ్ఞాసను చంపేసింది. మనుషుల పట్ల విశ్వాసం కోల్పోయాడు. ఇప్పటికీ నలుగురితో కలవలేకపోతున్నాడు. ఎవర్నీ నమ్మలేక పోతున్నాడు. చివరికి జీవిత భాగస్వామిని కూడా.

కొన్నిసార్లు, అవ్యక్తమైన ఉద్వేగాలు కూడా ఎమోషనల్‌ బ్యాగేజ్‌లో చోటు సంపా దిస్తాయి. మనకు ఎవరి మీదో కోపం వస్తుంది. భయం వల్ల కావచ్చు, భక్తితో కావచ్చు.. ఆ కోపాన్ని వ్యక్తం చేసేంత ధైర్యం మాత్రం ఉండదు. దీంతో ఆ ఉద్వేగం లోలోపలే ఉండిపోతుంది. గుర్తొచ్చిన ప్రతిసారీ ఉడికిపోతూ ఉంటాం. ఓ పెద్ద కంపెనీలో మనకు ఉద్యోగం వస్తుంది. కానీ, మరో నగరానికి వెళ్లాలి. కుటుంబ బాధ్యతల కారణంగా ఆ ఆఫర్‌ను తిరస్కరిస్తాం. జీవితాంతం చిరుద్యోగిగానే మిగిలిపోతాం. రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఆ పశ్చాత్తాపం వేధిస్తూనే ఉంటుంది. ఒకానొక బలహీన క్షణంలో ఎవరితోనో తప్పుగా ప్రవర్తిస్తాం. లేదంటే, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏ చిన్నపాటి దొంగతనానికో పాల్పడతాం.

ఆ అపరాధభావం శూలంలా గుచ్చుకుంటూనే ఉంటుంది. ఇలాంటి ఉద్వేగాలన్నీ బుర్రలో పొరలుపొరలుగా పేరుకుపోతాయి. నేరుగా ఆలోచనల్లో చేరుకుపోతాయి.     

సమస్య మూలాల్లోకి..

ఏదో పనిమీద బయల్దేరతాం. చౌరస్తా దగ్గర కాలికి బురద అంటుతుంది. ఆ ఒక్క కారణంతో ప్రయాణం వాయిదా వేసుకుంటామా? లేదు. శుభ్రంగా కడిగేసుకుని మళ్లీ ముందుకెళ్తాం. 

సెలెబ్రిటీల ఇంట్లో మనమూ ఉందామా

క్రికెట్‌ ఆడుతుంటాం. కాలు బెణుకుతుంది. ఆ చిన్నపాటి ఎదురుదెబ్బకు కుంగిపోతామా? లేదు. నొప్పి తగ్గిపోగానే మళ్లీ ఆటను ఆరంభిస్తాం. కొందర్ని మాత్రం.. కడిగేసు కున్నాక కూడా మరకల ఆనవాళ్లు వెంటాడుతూ ఉంటాయి. మానిపోయిన తర్వాత కూడా కనిపించని గాయాలు బాధిస్తూనే ఉంటాయి. ఎమోషనల్‌ మేనేజ్‌మెంట్‌ తెలియకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది.

అద్దిల్లు ఖాళీ చేస్తున్నప్పుడు..

చేతికందిన ప్రతి వస్తువునూ లారీలో ఎక్కించం. పడేయాల్సిన వాటిని పడేస్తాం. తూకానికి ఇవ్వాల్సిన వాటిని తూకానికి ఇచ్చేస్తాం. వదిలేయాల్సినవి అక్కడే వదిలేస్తాం. మనకు పనికొచ్చేవి మాత్రమే కొత్తింటికి తీసుకెళ్తాం. అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ.. గతం నుంచి ఫార్వర్డ్‌ చేస్తున్నప్పుడు కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి. కానీ, అలా జరగడం లేదు. తెలిసి కొన్నిసార్లూ, తెలియక కొన్నిసార్లూ పనికిరాని సరుకునంతా నెత్తిన పెట్టుకుని తెచ్చుకుంటాం. ఆ ప్రభావంతో.. గతమనే కళ్లజోడు లోంచే వర్తమానాన్నీ చూస్తాం.
ఏ బాల్యంలోనో ఎదురైన దురదృష్టకర అనుభవాలే పునరావృతం అవుతాయని నమ్ముతాం. ఆత్మీయతలు నాటకంలా, బూటకంలా తోస్తాయి. కొత్త స్నేహాల్ని ఇష్టపడం. పాత బంధాల్ని కొనసాగనివ్వం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేం. దూకుడుగా ముందుకెళ్లలేం. గిరిగీసుకుని బతికేస్తాం. ఫలితంగా, అసలే అంతంతమాత్రంగా ఉన్న అనుబంధాలు మరింత బలహీనపడతాయి. కెరీర్‌ దెబ్బతింటుంది. డిప్రెషన్‌ దాడి చేస్తుంది. ఆత్మహత్య ఆలోచనలు తరుముకొస్తాయి.

ఆ ప్రభావం శరీరాన్నీ వదిలిపెట్టదు.. ఎసిడిటీ, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగం తదితర రుగ్మతలకు దారితీస్తుంది. చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు చుట్టుముడతాయి. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. మనసు బలహీనపడేకొద్దీ మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాలు.. తదితర దురలవాట్లు బలపడతాయి. మరీ పసితనంలో సంభవించిన విషాదాలు మనకు గుర్తుండకపోవచ్చు.

కానీ ఆ నీడలు మాత్రం వెంటాడుతాయి. ఏదో ఓ సందర్భంలో, ఏదో ఓ రూపంలో బయటపడతాయి. కొందరికి నీళ్లంటే భయం. కొందరికి చీకటంటే దడ. కొందరికి సమూహాలంటే వణుకు. ప్రతి ఫోబియా వెనుకా.. ఎమోషనల్‌ బ్యాగేజ్‌ పాత్ర ఉండితీరుతుందంటారు మానసిక నిపుణులు.

మార్పు వైపుగా..

గతం వర్తమానాన్ని మింగేయకూడదు. వర్తమానం భవిష్యత్తును దెబ్బతీయకూడదు. నిన్నటి కథ నిన్నటిదే. నేటి జీవితం నేటిదే. రేపటి సంగతి రేపటిదే. నేర్పగలిగితే, పాత జ్ఞాపకాలనేవి ఎన్నో కొన్ని పాఠాలు నేర్పాలి. అంతే కానీ, క్యాన్సర్‌లా బాధించకూడదు.  అయినా కక్షగట్టినట్టు వేధిస్తుంటే.. నష్టనివారణ చర్యలు తీసుకోవాల్సిందే. ఇన్నేళ్లుగా మనం నెత్తిన మోస్తున్న ఉద్వేగాల మూటను కిందికి దించుకోవాలి. గోతాంలోని గతానుభవాలన్నీ బయటికి తీయాలి. ఆ దురదృష్టకర దృశ్యాల్లో భాగమైన వ్యక్తుల్ని గుర్తుచేసుకోవాలి. క్షమించాల్సిన వాళ్లను క్షమించేయాలి. క్షమాపణలు అడగాల్సిన వాళ్లను మనసులోనే క్షమాపణలు అడిగేయాలి. విస్మరించాల్సిన సంఘటనల్ని విస్మరించాలి. ఒప్పుకోవాల్సిన తప్పుల్ని ఆత్మసాక్షి న్యాయస్థానం ముందు నిజాయతీగా ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సిన సంఘటనల్లో ఎద లోతుల్లోంచి పశ్చాత్తాపం ప్రకటించాలి. ప్రతి వాక్యానికీ ఫుల్‌స్టాప్‌ ఉన్నట్టే, ప్రతి ఉద్వేగానికీ¨ ఓ ముగింపు ఉంటుంది. కానీ, చాలా సందర్భాల్లో మనం కామాతో సరిపెడతాం.

ఆ కొనసాగింపే మనకు కష్టాలు తెచ్చిపెడుతుంది.

ఏదో విషయంలో వైఫల్యం ఎదురవుతుంది. ఒకట్రెండు రోజులు కుమిలిపోతాం. తర్వాత, ఆ వైఫల్యాన్ని ఆమోదిస్తాం. నష్టాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెడతాం. అక్కడితో ఓ అధ్యాయం పూర్తవుతుంది.  ఆత్మీయులు మరణిస్తారు. ఓ నెలరోజులు బాధపడతాం. తర్వాత, ఎవరికైనా చావు అని వార్యమనే నిర్ణయానికొస్తాం. క్రమంగా దుఃఖం మసకబారుతుంది. అంతటితో మనసు తేట పడుతుంది.

ఎవరో మోసం చేస్తారు. ఆర్థికంగా దెబ్బతీస్తారు. దీంతో కొద్దిరోజులు తిట్టుకుంటాం. తర్వాత, ‘మన జాగ్రత్తలో మనం ఉండాలి’ అని సర్దిచెప్పుకుంటాం.

ఆ తీర్మానంతో ఓ ఘట్టం పరిసమాప్తం అవుతుంది.

గతాన్ని మార్చలేం. ఏమార్చలేం. కానీ యథాతథంగా ఆమోదించగలం.

ఆ కష్ట నష్టాలకు మనమే బాధ్యత తీసుకోగలం. ఇదంతా మన చేతుల్లో పని. ఈ మాత్రం చొరవ చాలు.. పాత ఉద్వేగాల పనిపట్టడానికి.   

మనలోని బాధనూ, ఆక్రోశాన్నీ ఆత్మీయులతో పంచుకోవడం ద్వారా కూడా కొంత భారాన్ని దించు కోవచ్చు. లేదంటే, ఆ దురదృష్టకర అనుభవాన్ని ఆత్మకథాత్మక పద్ధతిలో ఓ పుస్తకంలో రాసుకోవచ్చు. చివర్లో దాన్ని తగులబెట్టమని సూచిస్తారు మానసిక నిపుణులు. దీనివల్ల, కాగితాలతోపాటు నెగెటివ్‌ ఉద్వేగాలూ కనుమరుగు అవుతాయని ఓ నమ్మకం. 

ఎమోషనల్‌ బ్యాగేజ్‌ సమస్యకు ధ్యానం ఉత్తమ పరిష్కారం. ధ్యానస్థితిలో మనం.. కొత్తగా ఆలోచించం. వచ్చిన ఆలోచనల్ని కొనసాగించం. అలా అని, ఆలోచనల్ని బలవంతంగా తరిమేయం. బయటి వ్యక్తిలా గమనిస్తూ ఉంటామంతే. సాధన పెరిగేకొద్దీ మనం వేరు, మన ఆలోచనలు వేరు అనే ఎరుక సాధ్యపడుతుంది. ఆ సత్యదర్శనంతో ఇంతకాలం నుంచీ మోస్తున్న బ్యాగేజ్‌ దానంతట అదే తేలికైపోతుంది. ఉద్వేగాల్ని వదిలించుకోడానికి చిత్రలేఖనమూ ఓ మార్గమే. ఈ ప్రక్రియలో లోలోపల గూడుకట్టుకుపోయిన భావనల్ని కాన్వాస్‌ మీద పెడతాం. ప్రత్యేక పరిస్థితుల్లో  డ్రామా థెరపీని కూడా సిఫార్సు చేస్తారు వైద్యులు. పశ్చాత్తాపాన్నీ, బాధనూ, భయాన్నీ.. ఒకటేమిటి, బుర్రలో పోగైన సకల ఉద్వేగాలనూ నాటకంలోని ఓ పాత్ర రూపంలో వ్యక్తం చేయడం ద్వారా గుండెబరువు దించుకోవచ్చు. ఈ చిట్కాలేవీ పనిచేయనప్పుడు మానసిక నిపుణులను సంప్రదించాలి. వైద్యం చేయించుకోవాలి.   

తాబేళ్ల కన్నీళ్లే అక్కడి సీతాకోక చిలుకలకు ఆహారం

నది నిండుగా పారుతోంది. ఇద్దరు వ్యాపారులు ప్రవాహాన్ని దాటే ప్రయత్నంలో ఉన్నారు. అంతలోే ఓ అందమైన అమ్మాయి వచ్చింది. ‘నాకు ఈత రాదు. అవతలి ఒడ్డున మా నాన్నగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీరే సాయం చేయాలి’ అని వేడుకుంది. ‘పరాయి స్త్రీని తాకడం ధర్మ విరుద్ధం’ అంటూ మొదటి వ్యాపారి తిరస్కరించాడు. రెండో వ్యాపారి మాత్రం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆమెను భుజాలపై కూర్చో బెట్టుకుని నదిని దాటాడు. ముగ్గురూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. కృతజ్ఞతలు తెలియజేసి వెళ్లిపోయిందామె. వ్యాపారులిద్దరూ చెరో దిక్కునకు ప్రయాణమయ్యారు. ఏడాది తర్వాత మళ్లీ ఎక్కడో కలుసుకున్నారు.

‘ఆ రోజు అలా అమ్మాయిని భుజం మీద కూర్చోబెట్టుకుని..’ అంటూ పాత విషయాన్ని తిరగదోడే ప్రయత్నం చేశాడు మొదటి వ్యాపారి. ‘ఒడ్డుకు చేరగానే నేను ఆ యువతిని దించేశాను. మీరు మాత్రం ఇంకా మోస్తూనే ఉన్నారు’ అంటూ నవ్వేశాడు రెండో వ్యాపారి.

నిజమే, బుర్రలో చెత్త నిండిపోతే..

వక్రమైన ఆలోచనలే వస్తాయి. అవి హానికర నిర్ణయాలకు కారణం అవుతాయి. 

హోటళ్లూ, రైల్వేస్టేషన్లలో పెద్దక్షరాల్లో కనిపించే ఓ హెచ్చరిక ఎవరికైనా వర్తిస్తుంది.

‘మీ (ఎమోషనల్‌) బ్యాగేజ్‌కు..

మీరే బాధ్యులు!’


మనసుకు పరీక్ష

మోషనల్‌ బ్యాగేజ్‌ అనేక ఉద్వేగాల సమాహారం. ఆ మూటను తూకం వేసుకోడానికి ఈ పరీక్ష పనికొస్తుంది.

వివరణ: అవును.. కాదు.. ప్రతి ప్రశ్నకూ ఈ రెండింటిలో ఏదో ఓ సమాధానాన్ని ఎంచుకోవాలి. ‘అవును’ ఎక్కువైనకొద్దీ ఎమోషనల్‌ లగేజ్‌  పెరుగుతున్నట్టే. ఐదు లోపు అయితే.. ఆలోచనా ధోరణిలో చిన్నపాటి మార్పులు సరిపోతాయి. అంతకు మించితే మనల్ని మనం సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్టు. ఉద్వేగాల బరువు ఇబ్బంది పెడుతున్నట్టు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..