తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!

ఆరోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూలు వార్షికోత్సవం. ప్రోగ్రాం ఆశ్రమం ఆవరణలోనే జరుగుతోంది.

Updated : 19 May 2024 02:47 IST

- పోల్కంపల్లి శాంతాదేవి

రోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూలు వార్షికోత్సవం. ప్రోగ్రాం ఆశ్రమం ఆవరణలోనే జరుగుతోంది. ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకూ క్లాసులో ఫస్ట్‌ వచ్చిన పిల్లలకూ వ్యాసరచనల్లో గెలుపొందిన వాళ్ళకూ సేవాశ్రమం నిర్వాహకుల చేత మెమెంటోలూ బహుమతులూ ఇప్పించిన తరవాత ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకు పిలిచి అభినందించి శాలువా కప్పి మెమెంటో అందజేసి, ఆమెను సభకు పరిచయం చేశారు.

‘‘శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయులలో మణిపూస వంటిది. వరుసగా మూడు సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం అందుకుంటోంది. పిల్లలకు కేవలం స్కూల్‌ పాఠాలే కాకుండా తన జీవితపాఠాలు కూడా రంగరించి కౌన్సెలింగ్‌ ఇస్తూ ఉంటుంది. ఖాళీ సమయాలలో మా సేవాసదన్‌లో పని చేస్తూ పిల్లలకు కావలసిన సేవలందిస్తూ వాళ్ళకు ప్రియమైన అక్కగా, అమ్మగా ఉంటోంది. ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. మిగిలింది ఆమె మాటల్లో వినండి. శ్రీమతి అరుణ గారిని తమ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.’’

అరుణ లేచి సభకూ, అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారాలు తెలియజేసింది.

‘‘పిల్లలకు నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుండి నేర్చుకున్నవే. మొదటిది- జీవితంలో మద్యం జోలికి పోవద్దు. పచ్చటి కాపురాలను వల్లకాడుగా మార్చే రాక్షసి అది. రెండవది- క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. క్షణికావేశానికి లోను కావడం వల్లే నేను హంతకురాలినయ్యాను. నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏమిటంటే వయసులో ప్రేమించడం తప్పు కాకపోయినా... ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి, వారిని ఒప్పించి ముందుకు తీసుకెళ్ళాలి. కన్నవాళ్ళను కాదనుకుని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే- నమ్మినవాడు దగా చేస్తే, ఒంటరి బతుకైపోతుంది. సమాజం దృష్టిలో లేచిపోయి చేసుకున్న పెళ్ళి అవుతుంది. ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ రెండు తప్పులూ నేను చేశాను. నాలుగు గోడల మధ్య బందీనైనాకగానీ నేను తప్పు చేశానని తెలియలేదు. ఎవరిని ప్రాణాధికంగా ప్రేమించి అతడు లేకపోతే బతకలేననుకుని ఇంట్లో అందరినీ కాదనుకుని పారిపోయి గుళ్ళో తాళి కట్టించుకున్నానో- అతడిని నా చేతులతో చంపేశాను. ఏ పిల్లలను నా గుండెల్లో దాచుకుని పెంచుకోవచ్చని ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టానో, ఆ పిల్లలు నాకు దూరమయ్యారు. వాళ్ళ దృష్టిలో- వాళ్ళ తండ్రిని చంపిన కిరాతకురాలిగా మిగిలిపోయాను. ప్రపంచం దృష్టిలో హంతకినయ్యాను.

నా పంచప్రాణాలూ నువ్వేనని చెప్పిన నా భర్త... నన్ను తన ప్రాణమెత్తుగా ప్రేమించిన నా భర్త... నాకు ఇద్దరు పిల్లలు పుట్టేవరకూ నన్ను అపురూపంగా చూసుకున్న నా భర్త... నిన్ను చంపేసి నేను జైలుకెళతానే- అనే స్థితికి వచ్చాడంటే తాగుడుకు బానిస కావడం వల్లే. మనిషిని రాక్షసుడిగా మార్చే ఆ మద్యానికి లైసెన్స్‌ ఇచ్చి- పీకలదాకా తాగి మృగంలా మనుషుల మధ్య విచ్చలవిడిగా తిరగమని ఎందుకు వదిలి పెట్టింది ప్రభుత్వం? ఆదాయం కోసం ప్రభుత్వం ఏమైనా చేయొచ్చా?

తాబేళ్ల కన్నీళ్లే అక్కడి సీతాకోక చిలుకలకు ఆహారం

అమ్మా నాన్నలకు మేం ముగ్గురం ఆడపిల్లలం. నేను ఆఖరుదాన్ని. నేను టెన్త్‌ క్లాసులోకి వచ్చేసరికి మా ఇద్దరు అక్కలకూ పెళ్ళిళ్ళయ్యి అత్తగారిళ్ళలో కాపురాలు చేసుకుంటున్నారు. మా నాన్న రెవెన్యూ ఆఫీసులో అటెండరు. నాన్న జీతం చిన్నది కావడం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది. బస్తీలో రెండు గదుల సొంత ఇల్లు ఉండేది మాకు. మా బస్తీలోనే రమేష్‌ వాళ్ళ ఇల్లుండేది. నేను స్కూలుకు వాళ్ళ ఇంటి ముందు నుండే వెళ్ళేదాన్ని. ఉంగరాల జుట్టుతో అందంగా స్టయిల్‌గా ఉండేవాడు రమేష్‌. ఆటో నడిపేవాడు. అతడు కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని. నేను ఇష్టపడుతున్నానని అర్థమై అతడూ చూసేవాడు. నేను ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లోకి వచ్చేసరికి మామధ్య మాటలు కలవడం, నా ఎగ్జామ్స్‌ అయ్యేసరికి పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం జరిగిపోయింది. ఇంట్లో ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది. ఇద్దరి కులాలు వేరుకావడంతో మా పెళ్ళికి మా రెండిళ్ళలో ఒప్పుకోలేదు. అమ్మయితే నన్ను బాగా కొట్టింది కూడా. ఎంతో మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది. డిగ్రీ చదివిద్దామనుకున్న నాన్న చదువు మానిపించాడు- ప్రేమా దోమా అంటూ పిచ్చివేషాలు వేస్తున్నానని. మా అక్కలకు ఫోన్‌ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పించడమే కాదు... నాకు సంబంధాలు చూడమని కూడా చెప్పాడు. ఇంటి నుండి బయటికి పోకుండా అమ్మ కావలి కాయడం మొదలు పెట్టింది. నాకేం చేయాలో పాలుపోలేదు. ఒకరోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్‌ స్నేహితుడు వచ్చాడు. అమ్మవారి గుళ్ళో పెళ్ళికి అన్ని ఏర్పాట్లూ జరిగాయనీ తను పంపించిన ఫ్రెండ్‌తో వచ్చేయమనీ కబురు పంపించాడు రమేష్‌. వెనుకా ముందూ ఆలోచించలేదు. కట్టుబట్టలతో రమేష్‌ ఫ్రెండ్‌ వెంట వెళ్ళిపోయాను. కనిపెంచిన వాళ్ళను మోసం చేసి పోతున్నానన్న ఆలోచన అస్సలు రాలేదు. లేచిపోయి పెళ్ళి చేసుకుంటే కన్న కడుపులు రగిలి పోతాయన్న దిగులు కలగలేదు. రమేష్‌ నావాడైతే చాలనుకున్నాను.

గుళ్ళో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లూ చేసి నాకోసం ఎదురు చూస్తున్నాడు రమేష్‌. అతడి స్నేహితులు కూడా ముగ్గురు నలుగురు ఉన్నారక్కడ. వాళ్ళ సాయం వల్లే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్‌. ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది నన్ను పెళ్ళికూతురిగా అలంకరించి పెళ్ళి పీటల మీద కూర్చోబెట్టడానికి.

అరగంటలో మా పెళ్ళి తంతు ముగిసింది. నా మెడలో పసుపు తాడు పడింది. అందరం వెళ్ళి హోటల్‌లో భోజనాలు చేశాం. ఆ రాత్రి ఒక స్నేహితుడి ఇంట్లోనే మా ఫస్ట్‌ నైట్‌ గడిచి పోయింది. ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళాడు రమేష్‌.

మమ్మల్ని చూడగానే వాళ్ళమ్మ మహంకాళి అవతారం ఎత్తింది. ఎవరికీ చెప్పకుండా కులం కాని పిల్లను పెళ్ళిచేసుకు తీసుకువచ్చాడని కోపంతో, నోటికొచ్చినట్లు తిట్టి బయటి నుండి బయటనే పంపించేసింది. వేరే గల్లీలో ఒక చిన్న ఇంటిలో మా కాపురం మొదలైంది.

ఆటో అద్దెకు తీసుకుని నడిపేవాడు రమేష్‌. ఎలాగైనా కొంత డబ్బు కూడబెట్టి సొంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా మిగులుతాయనేవాడు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు. ‘మనం ఆర్థికంగా పైకొచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ- నీళ్ళున్న మడుగులోకి కప్పలు చేరినట్టుగా- మన చుట్టూ చేరుతారు’ అనేవాడు- వేమన పద్యం చెప్పి. ఇంటి అద్దె, ఆటో అద్దె పోగా మిగిలిన డబ్బుతో నన్నెంతో అపురూపంగా చూసుకునేవాడు. తన ఖర్చులకు కొంత డబ్బు జేబులో పెట్టుకుని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేవాడు. నేను ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు. పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్‌ నన్ను ఎంత అపురూపంగా చూశాడో చెప్పలేను. ‘ఇలాంటప్పుడు మన దగ్గర మీ అమ్మో మా అమ్మో ఉండాలి. కానీ మనకా అవకాశం లేదు. నాకు నువ్వూ నీకు నేనూ. నేనే నీకు అత్తా అమ్మా దగ్గరలేని లోటు తీర్చాలి. కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలు ఉంటాయట కదా. అవి తీరితేనే పొట్టలో పాప ఆరోగ్యంగా పెరుగుతుందట. చెప్పు, నీకేమేం కావాలి? మొహమాట పడొద్దు’ అనేవాడు. రెండేళ్ళలో నాకు మరో బాబు పుట్టాడు. వాడి జాతకం ఎంత దురదృష్టకరమైనదో కానీ అప్పటి నుండీ నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి.

రమేష్‌ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది. ఆర్డరిచ్చి మందు సీసాలు తెప్పించడం చూసి ‘నీకు తాగే అలవాటుందా?’ అని అడిగాను భయంగా.

‘మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మా ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వొద్దా? వాళ్ళు నాకోసం ఎంత చేశారు! వాళ్ళకు కంపెనీ ఇవ్వడానికి తాగుతున్నానుగానీ తాగుడు నాకు అలవాటు కాదు’ అన్నాడు. అప్పుడప్పుడు తాగి వచ్చేవాడు. ఫ్రెండ్స్‌ పార్టీ ఇచ్చారు తాగాల్సి వచ్చింది అనేవాడు. రోజులు గడుస్తున్నకొద్దీ రమేష్‌ తాగి రావడం ఎక్కువ అయింది. దాంతోపాటే ఇంట్లోకి డబ్బులివ్వడం తగ్గింది. ఇద్దరిమధ్యా తగవులు ప్రారంభమయ్యాయి. నేను తిట్టడం, అతడు కొట్టడం... ఒకరోజు తాగిన మబ్బులో యాక్సిడెంట్‌ చేశాడు. ఎవరిదో కొత్త కారుకు ఆటో గుద్దేశాడట. జరిగిన డ్యామేజ్‌కి కారాయన ఉగ్రుడైపోయి బూటు కాళ్ళతో తన్ని పోలీసులకు పట్టించాడు. తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు. స్నేహితులు తలా కొంత డబ్బు వేసుకుని బెయిల్‌ మీద బయటికి తీసుకువచ్చినా అతడు మారలేదు. తాగి ఆటో నడుపుతాడని పేరు రావడంతో ఎవరూ ఆటో అద్దెకివ్వడం లేదు. పిల్లలు పస్తులు, నాకు పస్తులు... రమేష్‌ ఏ స్నేహితుడో పెట్టిస్తే తింటున్నాడు, లేదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తిని వస్తున్నాడు. వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు కానీ నేనే అత్తింటికీ పుట్టింటికీ దూరమై ఒంటరినయ్యాను. తన పరువు తీశానన్న కోపం నాన్నకు ఇన్నాళ్ళయినా పోలేదు. మనుమలను చూడాలనీ నన్ను తీసుకుపోయి పుట్టింటి సారె పెట్టాలనీ ప్రాణం కొట్టుకుపోతున్నా అమ్మను నాన్న రానివ్వలేదు. ‘కన్నవాళ్ళను గడ్డి పరకల్లా వదిలేసి పోయింది కదా, దానికి లేని ప్రేమ మనకెందుకు? నువ్వు దాన్ని ఇంటికి తీసుకువస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు’ అని ఒట్టు పెట్టాడట నాన్న. మా ఇంటి పక్కన ఉండే నా చిన్న నాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది.

నాన్న అన్న మాట నిజమే కదా! ముగ్గురిలో చిన్నదాన్నని ‘నా బుజ్జితల్లి, నా బంగారుతల్లి’ అని ముద్దు చేసేవాడు. నన్ను ‘బుజ్జి’ అనే పిలిచేవాడు. వాళ్ళ ప్రేమను కాదనుకుని రమేష్‌ని నమ్ముకుని వచ్చేశాను. నాకు రమేష్‌ ఒక్కడుంటే చాలనుకున్నాను. కొట్టినా తిట్టినా ప్రేమ చూపినా రమేష్‌ ఒక్కడే కదా నాకు.

రమేష్‌ తాగని రోజు నాతో, పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు. నన్నూ పిల్లల్నీ సినిమాలకీ షికార్లకూ తిప్పేవాడు. ఆ రోజు సరదాగా బయటే తిని వచ్చేవాళ్ళం.

‘తాగకపోతే నువ్వెంతో బాగుంటావు. చూడు తాగితాగి పొట్ట ఉబ్బు కొచ్చింది కళ్ళూ ఉబ్బుకొచ్చాయి. ఎంత అందంగా ఉండేవాడివి. ఆ అందం చూసే నీ మీద మనసుపడ్డాను కదా! తాగితే నువ్వు మనిషివి కాదు. రాక్షసంగా మారిపోతావు. మనకిద్దరు పిల్లలున్నారు. వాళ్ళను చదివించుకోవాలి కదా! వచ్చిన పైసలన్నీ తాగుడుకు పెడితే సంసారం ఏం కావాలి? అందర్నీ కాదనుకుని వచ్చి పెళ్ళి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా? నువ్వు తాగుడు జోలికి పోవద్దు’ అని ఎంతో నచ్చచెప్పేదాన్ని. ఇక తాగనని చేతిలో చెయ్యేసి చెప్పేవాడు. అంతే, ఒకటి రెండు రోజులు... మళ్ళీ యథావిధిగా తాగి వచ్చేవాడు. దేనికోదానికి పేచీ పెట్టుకుని నన్ను చావగొట్టేవాడు.

* * * * * *

మేమున్న ఇంట్లోనే మరో పోర్షన్‌లో ఉన్న పద్మ భర్త కూడా ఆటో నడుపుతాడు. పిల్లల చదువుల కోసం పద్మ నాలుగిళ్ళలో పనిచేస్తుంది. ‘కన్న తల్లివి. పిల్లలకు తిండి పెట్టక చంపుకుంటవా ఏంది?’ అంటూ నన్ను తీసుకుపోయి రెండు ఇళ్ళలో పనికి పెట్టింది. ఇలా పనికి కుదిరానని తెలిసి ‘నా పరువు తీస్తవా’ అంటూ ఆ రోజు తన్నులే తన్నులు. రాత్రి వాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు... ఉంటే కద పెట్టేది. ఏ నాలుగు రోజుల కిందనో ఇచ్చిన వెయ్యి రూపాయలు ‘అప్పుడే అయిపోయాయా’ అంటూ గొడవ పెట్టుకునేవాడు, కొట్టేవాడు.

ఎవరో శేఠ్‌ దగ్గర ట్రాలీ నడపడానికి నెల జీతం మీద కుదిరాడు. తాగుడు మాత్రం మానలేదు. రాత్రికి రోజూ నేను కావలసిందే.  సారా కంపు కొట్టే ఆ మనిషిని చేరనివ్వ బుద్ధి కావడం లేదు. తాగిన మత్తులో కావలించుకోవడం తప్ప ఆ ప్రేమ, అనురాగం ఎప్పుడో అతడి నుండి దూరమైపోయాయి. ‘తాగడం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దు’ అంటూ దగ్గరికి రానివ్వడం లేదు. ఆ వాసనకు కడుపులో తిప్పుతోంది.

‘నన్ను కావలించుకు పండుకుంటే తప్ప నిద్ర రాదనే దానివి... ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవడి దగ్గర పడుకుని వస్తున్నావే? ఇళ్ళల్ల పనిచేస్తున్నది అందుకేనా! రంకు మరిగావు కదా’ కొట్టడానికి చేతులు కాళ్ళు సరిపోవన్నట్టుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి తెచ్చి కొట్టాడు. కొట్టిన చోటల్లా కర్రు కాల్చి ఒత్తినట్టుగా వాతలు దేలుతున్నాయి. నా అరుపులకు పిల్లలు లేచి ఏడవడం మొదలు పెట్టారు. పెద్దోడు ‘అమ్మను కొట్టకు’ అంటూ అడ్డొస్తే వాడికీ పడ్డాయి దెబ్బలు.ఆ దెబ్బలకు వాడికి జ్వరం వచ్చింది.

రాత్రి అయ్యిందంటే గజగజ వణికిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు. ఒళ్ళంతా దెబ్బలతో కమిలిపోయింది. ఇక వీడు మారడు. నాకీ తన్నులూ ఈ నరకం తప్పదు. భరించే ఓపిక లేదు. వదిలేసి పోదామంటే ఈ పిల్లలను ఎట్లా సాక్కోవాలి? ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్తి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వరా? నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను. తాగి చావడానికి ఒకనాడు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను. కానీ, పిల్లల ముఖం చూస్తే చావబుద్ధి కాలేదు. నేను చస్తే నా పిల్లలను ఎవరు చూస్తారు, రోడ్ల పాలవుతారు కదా? ఇద్దరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్తకుప్పల మీదనో ఎంగిళ్ళు ఏరుకుని తినే దృశ్యం నా కళ్ళ ముందు కదిలి ఆత్మహత్య ఆలోచన మనసులోకి రానీయకూడదనుకున్నా. ఎంత కష్టమైనా నా పిల్లల కోసం బతకాలనుకున్నాను.

* * * * * *

ఆ రోజు ఎంత రాత్రయినా నాకు నిద్ర పట్టలేదు. ఎటు మళ్ళి పడుకున్నా దెబ్బలు ఒరుసుకుపోయి పడుకోనివ్వడం లేదు. ఆరోజు నాకూ రమేష్‌కూ పెద్ద గొడవే జరిగింది. నేను పనిచేసే ఇంటివాళ్ళు ఆరోజే నెల జీతం ఇచ్చారు. తాగడానికి ఆ డబ్బు ఇమ్మని వేధింపులు మొదలుపెట్టాడు.

‘నా పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు విరుచుకుంటున్నాను. నువ్వు కష్టం చేసుకున్నది తాగి తందనాలు ఆడింది చాలదా... నేనివ్వను’ మొండిగా ఎదిరించాను. ఫలితం... వాడి చేతుల్లో ఒళ్ళు వాచిపోయింది. కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయినవాడు రాత్రికి ఫుల్లుగా తాగి వచ్చాడు.

ఒళ్ళంతా సలుపుతోంది. కమిలిన దెబ్బలవల్ల ఎటూ పడుకోలేకపోతున్నాను. నన్ను శారీకంగా మానసికంగా ఇంత బాధ పెట్టి వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు- అంతెత్తు బాన పొట్ట వేసుకుని. వాడే లేకపోతే రోజూ ఈ నరకం ఉండదు కదా. నాలుగిళ్ళలో పనిచేసుకుని నా పిల్లలను సాక్కుంట, చదివించుకుంట. నా బతుకు నేను బతుకుత. నన్ను ప్రేమగా చూసుకునే రమేష్‌ ఎప్పుడో చచ్చిపోయాడు. ఉన్నది తాగుడు భూతమే.

ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బతకను. నా పిల్లలకు నేనుండాలంటే వాడు చావాలి. నా పిల్లల వైపు చూశాను.

పసిమొగ్గలు... అమాయకంగా నిద్రపోతున్నారు. నేనింక ఎక్కువ ఆలోచించలేదు. దిండు తీసుకున్నాను. నోరు తెరుచుకుని నిద్రపోతున్న రమేష్‌ ముఖం మీద అదాటున అదిమాను. నిజానికి నేనంత బలమైన దాన్ని కాదు. వాడు విదిలించుకు లేస్తే నా పీక పట్టుకుని నన్నే చంపేసేవాడు. కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడేగానీ పెద్దగా ప్రతిఘటించలేదు.

బరువు తగ్గడం అందుకే అంత కష్టం

తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం పోయింది. ముక్కు దగ్గర వేలుంచి చూశాను. కదిలించి చూశాను. ప్రాణం పోయిందని నిర్ధారణ అయింది. రోజూ నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పీడ విరగడైందని తేలిక పడ్డంత టైమ్‌ పట్టలేదు, ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న నా భర్తనే నా చేజేతులా చంపుకున్నానన్న వాస్తవం నా కళ్ళముందు నిలిచింది. పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి. ఇప్పటికీ వాడు తాగని రోజు నామీదా పిల్లల మీదా చూపించే ప్రేమ గుర్తుకొచ్చి లోపలి నుండి దుఃఖం తన్నుకు వచ్చింది.

తెల్లవారింది. పిల్లలు లేచి నాతో పాటు ఏడవడం మొదలు పెట్టారు. ఇరుగు పొరుగు వచ్చారు. ‘ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడనీ నిద్రలోనే చనిపోయాడనీ’ చెప్పాను. మా అత్తావాళ్ళింటికి వెళ్ళి ఎవరు చెప్పారోగానీ వాళ్ళూ పరిగెత్తుకు వచ్చారు.

మా బావ బెదిరించాడు. ‘నిన్న సాయంత్రం నా దగ్గరికి పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. ఇంతట్ల ఏమైంది? నిజం చెప్పు. చెప్పకపోతే పోలీసులను పిలవాల్సి వస్తుంది. పోలీసుల చేతిల పడితే చావగొట్టి నిజం
కక్కిస్తరు’ అన్నాడు.

భయపడిపోయా. ‘రోజూ తాగొచ్చి కొడుతుంటే, దెబ్బలకు తట్టుకోలేక నేనే చంపిన బావా!’ అని చెప్పా.

‘మొగుని చేతిల తన్నులు తిననోళ్ళు ఎవరున్నరు ఈడ. అందరం తన్నులు తిని నోరుమూసుకుని పడున్నోళ్ళమే. కొట్టిండని మొగుణ్ణి చంపుకుంటరా? ఇదెక్కడి కథ...’ నానా రకాలుగా మాట్లాడసాగారు గుమిగూడిన జనాలు. మా అత్త నా జుట్టు పట్టి లాగి కొట్టడం మొదలుపెట్టింది.

‘కొడితే పోయిన పానం వస్తదా నీ తిక్కగాని! పోలీసులు చూసుకుంటరులే...’ పద్మ, మా పక్కపోర్షన్లో ఉండే మరొకామె మా అత్తను నానుండి దూరంగా లాక్కుపోయారు.

రమేష్‌ను పోస్టుమార్టానికి తీసుపోవడానికి అంబులెన్స్‌ రావడమూ నన్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోవడమూ ఒకేసారి జరిగాయి. నాకు జీవిత ఖైదు పడింది. ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికానో ఆ పిల్లలకే నేను దూరమయ్యాను.

నా పిల్లలను పోలీసులు మా అత్తావాళ్ళకే ఆప్పగించారట.

* * * * * *

వారానికోసారి ‘ములాఖాత్‌’ అని ఉంటది. బంధువులు వచ్చి మాట్లాడుతుంటారు.

నా తోటి ఆడ ఖైదీలందరూ సంబరంగా బయల్దేరుతుంటే నేను నా గదిలోనే ఉండిపోయాను... నన్ను పలకరించేటందుకు వచ్చే బంధువులు ఎవరూ లేరు కాబట్టి. ప్రేమ పెళ్ళి చేసుకుని పుట్టింటికి దూరమయ్యాను. వేరే కులమని అత్తగారు దగ్గరికే రానివ్వలేదు. చేసుకున్నవాడు నట్టేట ముంచాడు.

ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను ‘నీ కోసం మీ అమ్మ వచ్చింది, రా’ లేడీ పోలీసు వచ్చి పిలిచింది.

నమ్మలేకపోయాను. రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదుటన లేచి పరిగెత్తాను. ఇనుప గ్రిల్‌ గళ్ళలోంచి అమ్మ చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డ కట్టిన దుఃఖమంతా కరిగి బయటికి వచ్చేలా పొగిలి పొగిలి ఏడ్చాను. అమ్మ కూడా అలాగే ఏడ్చింది.

‘ఎలా వచ్చావమ్మా? నాన్నకు తెలిస్తే తిడతాడు కదా?’

‘నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని. పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతుంటే మీ నాన్నే చూడలేక ఇంటికి తీసుకు వచ్చాడు.’

నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ‘మీ నాన్న వకీలు సాబ్‌ను కలిసొచ్చాడు. భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చెయ్యడానికి ఏమీ లేదు. అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాడట ఆయన.’

‘నా బాధంతా పిల్లల గురించేనమ్మా!’

‘దిగులుపడకు. నేను చూసుకుంటా కదా!’

అప్పుడప్పుడూ పిల్లలను తీసుకువచ్చేది అమ్మ. మొదట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు, వాళ్ళ తండ్రిని చంపినదాన్నని. అక్కావాళ్ళు కూడా ములాఖాత్‌ రోజు వచ్చేవాళ్ళు. నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. నిజానికి, రమేష్‌ బతికి ఉండగా నా పుట్టింటివాళ్ళ సపోర్టే నాకుంటే అతణ్ణి చంపాలన్న ఆలోచన కానీ చంపాల్సిన అవసరం కానీ వచ్చేది కాదేమో. ఒంటరినై ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నావల్ల జరిగిపోయిన అనర్థమది. అందరికంటే జైలరమ్మా, సూపరింటెండెంట్‌ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు. జైలు కొచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, క్షణికావేశంతో తప్పు చేశారన్న సానుభూతి ఉండేది వాళ్ళకు. ‘లైఫ్‌ శిక్ష పడిందని కుంగిపోకండి. మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉంది’ అని ధైర్యం చెప్పేవాళ్ళు. ఎన్నో మంచి విషయాలు వాళ్ళ వల్ల నేను తెలుసుకున్నాను.

సెలెబ్రిటీల ఇంట్లో మనమూ ఉందామా

ఇక్కడ- నాలాగే క్షణికావేశంతో హత్యచేసి వచ్చినవాళ్ళు ఉన్నారు, దొంగసారా అమ్మి పట్టుబడి వచ్చినవాళ్ళూ ఉన్నారు, కరడు గట్టిన నేరస్తులూ ఉన్నారు. విడుదలైన ప్రతిసారీ మళ్ళీ నేరం చేసి అత్తగారింటికి వచ్చినంత హాయిగా జైలుకొచ్చేవాళ్ళూ ఉన్నారు. జైలు జీవితం నాకు చాలా నేర్పింది. నా అమాయకత్వం వదిలింది. ‘బయటికి వెళ్ళే అవకాశమే వస్తే నేను మాత్రం మళ్ళీ జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకోను’ అనుకునేదాన్ని. నా మనస్సెప్పుడూ నా పిల్లల గురించే ఆలోచించేది.

ఏడేళ్ళ తరువాత నన్ను విడుదల చేశారు. అక్కడున్న ఏడు సంవత్సరాలలో జైళ్ళ పద్ధతి ప్రకారం టైలరింగ్‌, బేకరీ, చాక్‌ పీసుల తయారీ వంటివన్నీ నేర్పించారు. నేను ఇంటర్‌ వరకూ చదివి ఉండటం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు.
బయటికి వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది. హత్య చేసి జైలు నుండి బయటకి వచ్చానని తెలిసి నాకు ఎవరూ పని ఇచ్చేవాళ్ళు కాదు. నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్ళకు తెలిసిపోయి, నానా తిట్లూ తిట్టి నన్ను తీసేసేవాళ్ళు. ఇక ఎలా నా పిల్లలకు తిండి పెట్టి చదివించుకునేది. ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి హంతకురాలినన్న ముద్ర పొందానో వాళ్ళకు పట్టెడన్నం పెట్టుకోలేక పోతున్నాను. ఎన్నాళ్ళు అమ్మావాళ్ళ మీద ఆధారపడతాను? నేను జైల్లో వుండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు. అమ్మకొచ్చే పెన్షన్‌ మీదనే నాలుగు ప్రాణాలు బతకాల్సి వస్తోంది.

ఆ తరవాత రెండు మూడేళ్ళు అత్యంత బాధాకరమైన దినాలని చెప్పొచ్చు. నేను చెయ్యని కష్టం లేదు. ఎలాగో ఒకలా నా పిల్లలకు పట్టెడన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు.

జైలు నుంచి వచ్చేసినా అప్పుడప్పుడూ జైలర్‌ సాబ్‌ను కలుస్తూనే ఉన్నాను. నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను. ఒకసారి అలా వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ సేవా సదన్‌లో టీచరుగా పని ఇప్పించారు. ఎనిమిది సంవత్సరాలైంది టీచరుగా చేరి. ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో, టీచరుగా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు. పిల్లలకి నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే...’’ నా మాటలు ముగిశాయి సభికుల కరతాళ ధ్వనుల మధ్య.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..