పోలి స్వర్గం

కార్తీకమాసం చివరిరోజును పోలి స్వర్గంగా వ్యవహరిస్తారు. హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. ఈ మాసం ముగింపు సందర్భంగా వత్తులతో దీపాలను వెలిగిస్తారు. ....

Published : 29 Nov 2016 16:06 IST

పోలి స్వర్గం
నవంబరు 19

కార్తీకమాసం చివరిరోజును పోలి స్వర్గంగా వ్యవహరిస్తారు. హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. ఈ మాసం ముగింపు సందర్భంగా వత్తులతో దీపాలను వెలిగిస్తారు. భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున మహిళలు ప్రాతఃకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడుతారు. బియ్యపుపిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు.

పురాణగాధ
ఈ పర్వదినానికి పోలిస్వర్గం అని ఎందుకు వచ్చిందో అని తెలిపేందుకు ఒక కథ వుంది. పూర్వం కృష్ణాతీరంలో ఇద్దరు దంపతులు వుండేవారు. వీరికి నలుగురు కుమారులు. అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న కోడలు పేరు పోలి. అమాయకురాలు. అత్తతో పాటు తోడికోడళ్లు ఆమెను అనేక రకాలుగా కష్టాలకు గురిచేసేవారు. అన్నింటిని పోలి మౌనంగా భరించేది. కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఆమె పూజలు చేయడాన్ని గమనించిన అత్తా, తోడికోడళ్లు ఆమెను ఇంటిలోనే వుంచి ఆలయానికి వెళ్లేవాళ్లు. వీరు ఆలయంలో వున్నా మనస్సంతా పోలి ఇంట్లో ఏంచేస్తుంది అన్న దానిపైనే ఆలోచించేవారు. ఇంట్లో వున్న పోలి తన బాధలను విష్ణుమూర్తితో విన్నవించుకునేది. నిత్యం ప్రార్థనలు చేసేది. కార్తీకమాసం ముగింపు సమయంలో ఆమె మొరను ఆలకించిన ఆ పరంధాముడు తన దూతలను పిలిచి స్వర్ణవిమానంలో ఆమెను వైకుంఠానికి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. భగవంతుని ఆనతి మేరకు దూతలు తమ సందేశాన్ని పోలికి వినిపించారు. పరమానందభరితురాలైన పోలి విమానాన్ని ఎక్కింది. ఆ సమయంలోనే గుడి నుంచి వచ్చిన అత్తా, కోడళ్లు పోలితో పాటు తాము వైకుంఠానికి వెళ్లాలని కోరారు. అయితే విష్ణుదూతలు అందుకు నిరాకరించడంతో విమానం ఎక్కుతున్న పోలి కాళ్లను అత్త పట్టుకుంది. ఆమె కాళ్లను మొదటి కోడలు, మొదటి కోడలు పాదాలను రెండో కోడలు, రెండో కోడలు కాళ్లను మూడోకోడలు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన విష్ణుదూతలు అత్త చేతులను ఖండించారు. దీంతో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్లు కిందపడిపోయారు. పోలి విమానంలో వైకుంఠానికి చేరుకుంది. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీమహావిష్ణువును ప్రార్థించిపోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలిస్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని