దూకేద్దాం..కొలువుల సాగరంలోకి!

కొంచెం కొత్తదనం.. ఓ డోసు సాహసం... రెండూ కలిసిన ధోరణి వెనకే యువత పయనం... అలా వాళ్ల మనసుల్ని...

Published : 19 Jan 2016 12:07 IST

దూకేద్దాం..కొలువుల సాగరంలోకి!



కొంచెం కొత్తదనం.. ఓ డోసు సాహసం... రెండూ కలిసిన ధోరణి వెనకే యువత పయనం... అలా వాళ్ల మనసుల్ని దోచేస్తున్న తాజా ట్రెండ్‌ స్కూబా డైవింగ్‌! ఈతకొలనులో చేపలా ఈదుతూ.. సముద్రగర్భంలో సాహసాలు చేస్తూ జోష్‌ మీదున్నారు మన కుర్రకారు... సరదా, సాహసాలే కాదు ఇందులో ఉపాధి అవకాశాలూ బోలెడు అన్నది నిపుణుల మాట... ఆ హుషారైన సంగతులు.. వింతల విశేషాల కోసం కథనంలోకి దూకేద్దాం.  సరదా కోసం ఖండాలు దాటే కాలమిది. సంతోషం కోసం సాగరం గాలించే యువతరం ఉన్న రోజులివి. అందుకే ఈ రెండూ మేళవించిన స్కూబా డైవింగ్‌ ఇప్పుడు పాపులర్‌.

వూరించే అంశాలెన్నో
స్కూబా డైవింగ్‌ని యువత ఇంతగా ఆదరించడానికి కారణం వారిని వూరించే అంశాలెన్నో. ఒక్కసారి సముద్ర గర్భంలోకి వెళితే వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టే. కొత్తకొత్త ప్రాణుల్ని చూడొచ్చు. లోపలికి వెళ్తున్నకొద్దీ శరీరం బరువు కోల్పోతుంది. గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. ఈ సరికొత్త అనుభవం కోసమైనా స్కూబా డైవింగ్‌ ఇష్టపడేవాళ్లు పెరుగుతున్నారు. ఇంతకుమించి ఆసక్తి ఉన్నవాళ్లైతే సముద్రగర్భంలో కొత్త ప్రదేశాలు, జీవాల్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంటారు. విశాఖ బృందం ‘ఎలక్ట్రిక్‌ రే’ అనే ముట్టుకుంటే షాక్‌ కొట్టే చేపను కనుగొన్నారలా. వీటన్నింటికీ మించి వాటర్‌ ఫోబియా ఉన్నవాళ్లు ఆ భయం పోగొట్టుకోవడానికి దీన్నో చక్కని మార్గంగా భావిస్తున్నారు.

నిపుణుల శిక్షణ
ఆసక్తి ఉన్నవాళ్లు మోజుతో సముద్రంలోకి దూకేస్తున్నారు సరే.. కానీ వాళ్లనలా తయారు చేయాలంటే మాత్రం ఎంతో నైపుణ్యం, అనుభవం ఉండాల్సిందే. హైదరాబాద్‌, వైజాగ్‌ నగరాల్లో స్కూబా డైవర్లను తయారు చేస్తున్న బలరాం నాయుడుకి పదిహేనేళ్లు ఇండియన్‌ నేవీలో పనిచేసిన అనుభవం ఉంది. నాలుగేళ్లు ‘ఏరో అడ్వెంచర్స్‌ సెల్‌’కి సారథ్యం వహించాడు. సెయిలర్స్‌, క్యాడెట్స్‌కి శిక్షణనిచ్చాడు. ప్రపంచ మిలట్రీ గేమ్స్‌ స్కై డైవింగ్‌లోనూ సత్తా చాటాడు. ఈ అనుభవంతో ఔత్సాహికులకు శిక్షణనిస్తున్నాడు. ఇలాంటి వారు తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురున్నారు. ఒక్కొక్కరు ఇప్పటికి రెండు, మూడువేల మందికి శిక్షణనిచ్చారు. ఈ ట్రైనర్లు ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ (ప్యాడీ), అమెరికా సభ్యులైతే అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారిగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వీరికి గుర్తింపు ఉంటుంది. వారి ఆధ్వర్యంలో స్కూబా (సెల్ఫ్‌ కంటెయిన్డ్‌ అండర్‌వాటర్‌ బ్రీతింగ్‌ అప్పారటస్‌) పరికరాలతో డైవింగ్‌కి దిగితే సముద్రాన్ని గుప్పిట్లో బంధించినట్టే.

నేర్పించే అంశాలివే
ఈ డైవింగ్‌కి రకరకాల కోర్సుల ద్వారా శిక్షణనిస్తున్నారు. సాధారణంగా పదిరోజుల సర్టిఫికేషన్‌ కోర్సు ఉంటుంది. రెండ్రోజులు థియరీ క్లాసులు. డైవింగ్‌ సమయంలో ఎదురయ్యే ప్రమాదేంటి? ఎలా అప్రమత్తంగా ఉండాలి? లోపలికి వెళ్తున్నకొద్దీ ఏ అవయవాల మీద ఒత్తిడి పెరుగుతుంది? దాన్ని ఎదుర్కొంటూ మధ్యమధ్యలో ఎలా విశ్రాంతి తీసుకోవాలి? ఎలా ముందుకెళ్లాలో నేర్పిస్తారు. నోట్లోకి, మాస్క్‌లోకి నీళ్లు వెళ్తే ఎలా కవర్‌ చేసుకోవాలో చెబుతారు. దీని తర్వాత పూల్‌ ట్రైనింగ్‌. స్విమ్మింగ్‌పూల్‌లో ఒకట్రెండురోజులు శిక్షణనిచ్చి సముద్రంలోకి తీసుకెళ్తారు. బోటు, స్కూబా సెట్‌, పరికరాలన్నీ సమకూర్చుతారు. కొత్తవాళ్లైతే సముద్రంలో పదిహేను మీటర్ల లోపలికి తీసుకెళ్తారు. ఇంకా లోపలికెళ్తే శరీరంపై ఒత్తిడి అధికమై ఎయిర్‌ కేవిటీస్‌తో నొప్పి మొదలవుతుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ముందే చెబుతారు. ఈ కోర్సుల్లోనూ ఓపెన్‌ వాటర్‌ డైవర్‌, అడ్వాన్స్డ్‌ ఓపెన్‌ వాటర్‌ డైవర్‌, ఫొటోగ్రఫీ డైవర్‌, పీక్‌ పాయింట్‌ డైవర్‌, నైట్‌ డైవర్‌, రెస్క్యూ డైవర్‌, డైవ్‌ మాస్టర్‌, ఎమర్జెన్సీ ఫస్ట్‌ రెస్పాండర్‌.. ఇలా రకరకాల కోర్సులుంటాయి. ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్లెవరైనా చేరొచ్చు. ప్రొఫెషనల్‌గా రాణించాలనుకుంటే తప్పకుండా ఈత వచ్చి ఉండాలి.

ఉపాధి బాట

డైవింగ్‌తో బోలెడు లాభాలు. ఇవిగో..

* భూమ్మీద, నీటిలోనూ బతకగలం అనే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది
* యాత్రికులను డైవింగ్స్‌కి తీస్కెళ్తూ రోజుకు పది నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించొచ్చు
* వినోద, పర్యటక రంగంలో అండమాన్‌ దీవులతోపాటు దక్షిణాఫ్రికా, గల్ఫ్‌ దేశాల్లో అవకాశాలెక్కువ ఉన్నాయి
* పెద్దపెద్ద నావలకు వెల్డింగ్‌, కటింగ్‌, బఫరింగ్‌, మరమ్మతు నిపుణులుగానూ ఉద్యోగాలుంటాయి
* అండర్‌వాటర్‌ ఫొటోగ్రఫీతో కొత్త ప్రపంచాన్ని, కొత్త ప్రాణుల్ని కనిపెట్టొచ్చు. పేరు, డబ్బూ
* కాస్త అనుభవం తోడైతే శిక్షకులుగానూ రాణించొచ్చు.

ముఖచిత్రం మారుతుంది

స్కూబా డైవింగ్‌ నిపుణులైతే ఉద్యోగ అవకాశాలకూ కొదవ ఉండదు. ముఖ్యంగా విదేశాల్లో వీరికి గిరాకీ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాహస క్రీడల్ని ప్రోత్సహించాలనుకుంటోంది. ఆ జాబితాలో స్కూబా డైవింగ్‌తోపాటు స్కై డైవింగ్‌ను చేర్చమని ప్రభుత్వాన్ని కోరాను. ఓ ప్రాజెక్టు తయారు చేసి ఏపీ టూరిజం, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అధికారులను కలిశాను. సానుకూలంగా స్పందించారు. ఇది కార్యరూపం దాల్చితే ఏపీ ముఖచిత్రమే మారిపోతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అత్యధిక సంఖ్యలో పర్యటకులను ఆకట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే స్కూబా డైవింగ్‌లో శిక్షణనిస్తున్నా. భవిష్యత్తులో స్కై డైవింగ్‌ నిపుణులనూ తయారు చేయాలని కోరిక. నాదగ్గరికొచ్చేవాళ్లలో ఎక్కువమంది యువతే. బ్లూ వాటర్స్‌ టూ బ్లూ స్కై అనే నినాదంతో ముందుకెళ్తున్నా. ఆసక్తి ఉన్నవాళ్లు www.liveinadventures.com లో పూర్తి వివరాలు చూడొచ్చు.

- బలరాం నాయుడు
శిక్షకుడు, ప్యాడీ సభ్యుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని