పెళ్లి సంబంధాల సంత

కూరగాయల సంత.. చేపల మార్కెట్‌.. స్టాక్‌మార్కెట్‌... ఇలాంటివి మనకి చాలానే తెలుసు. వరుడు, వధువు కోసం వెతికే ఓ సంత చైనాలోని షాంఘైలో .....

Published : 04 Mar 2017 01:41 IST

పెళ్లి సంబంధాల సంత

కూరగాయల సంత.. చేపల మార్కెట్‌.. స్టాక్‌మార్కెట్‌... ఇలాంటివి మనకి చాలానే తెలుసు. వరుడు, వధువు కోసం వెతికే ఓ సంత చైనాలోని షాంఘైలో ఉందనే సంగతి మీకు తెలుసా? పెళ్లీడుకొచ్చిన కుర్రకారు తల్లిదండ్రులు, బామ్మలు, అమ్మమ్మలు వందలమంది ప్రతి వారాంతం ఇక్కడ పోగవుతారు. తమ అమ్మాయి లేదా అబ్బాయి గుణగణాల్ని ఏకరువు పెడుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తారు. నోటీసుబోర్డులు, గొడుగులు, ఫ్లెక్సీలు.. అబ్బో చాలావాటిపై తమ పిల్లల వివరాలు రాసి నిల్చుంటారు. వాళ్ల ఫొటోలు, ఎత్తూపొడుగూ, ఉద్యోగం, ఇష్టాయిష్టాలు, ఆస్తిపాస్తులు, జాతకం.. అన్నీ ఉంటాయ్‌ అందులో. నచ్చినవాళ్లు కలం, కాగితం పట్టుకొని వచ్చి ఎంచక్కా ఇవన్నీ రాసేసుకుంటారు. అవసరమైతే కెమేరాతో చిత్రాలను కూడా క్లిక్‌మనిపిస్తారు. తమ గారాలపట్టికి ఓ చక్కని చుక్కనో, సక్కనయ్యనో కట్టబెట్టాలనే తాపత్రయం కోసమే పెద్దలు ఇలా చేస్తుంటారు. అన్నట్టు ఈ వింత యవ్వారానికి అక్కడి యువతలో ఎక్కువమంది జై కొట్టడం గమనార్హం. ముఖ్యంగా బోయ్‌ఫ్రెండ్‌, గాళ్‌ఫ్రెండ్‌ లేని ఒంటరులు ఏదోరకంగా తమకు తోడు దొరికితే సరి అనుకుంటున్నారు. చైనాలో అనుసరిస్తున్న ఒకే సంతానం విధానం కారణంగానే కుర్రకారు తోడు కోసం అల్లాడిపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు. అమ్మాయి, అబ్బాయిలకు సంబంధం కుదిర్చే విషయంలో మనం సరదాగా అనుకునే ‘సంతలో బేరమాడినట్టు’ అనే సామెత చైనాలో ఏమాత్రం చెల్లదన్నట్టే మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని