పాత సొగసులే.. సరికొత్తగా

స్మార్ట్‌ఫోన్‌లో సంగీతానికి అలవాటు పడ్డ చెవులు సైతం గ్రామ్‌ఫోన్‌ని చూస్తే ఆహా.. ఆ పాత మధురం...

Published : 11 Mar 2017 01:18 IST

పాత సొగసులే.. సరికొత్తగా

స్మార్ట్‌ఫోన్‌లో సంగీతానికి అలవాటు పడ్డ చెవులు సైతం గ్రామ్‌ఫోన్‌ని చూస్తే ఆహా.. ఆ పాత మధురం అంటాయ్‌. ఫ్యాషన్లకీ అదే సూత్రం వర్తిస్తుంది బాసూ. అందుకే పది, పాతికేళ్ల కిందటి వరకు దేశాన్ని వూపేసిన ఫ్యాషన్లే కొద్దిపాటి మార్పులతో కళ్లు జిగేల్‌మనేలా మళ్లీ దూసుకొచ్చాయి. కాలేజీ క్యాంపస్‌లు.. వెండితెరపై.. తెరవేల్పుల ఒంటిపై.. ఫ్యాషన్‌వీక్‌ల్లో చక్కర్లు కొడుతున్న కొన్ని పాత కొత్త స్టైల్స్‌ ఇవి.
హైవెయిస్ట్‌ జీన్స్‌: నడుముపైకి, మోకాళ్లు కిందికి దిగిన జీన్స్‌ ఒక్కసారి తొంభైల్లో తెగ సందడి చేసేవి. వీటినే అప్పట్లో ‘మామ్‌ జీన్స్‌’ అనేవారు. దిల్‌, హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌, కుచ్‌కుచ్‌ హోతాహైలో కాజల్‌ ఈరకం స్టైల్‌కి బాగా పేరు తెచ్చారు. అచ్చంగా ఈ స్టైల్‌నే మళ్లీ దించేసింది బాలీవుడ్‌. ప్రియాంకాచోప్రా, ప్రాచీ దేశాయ్‌, కృతి సనన్‌లు.. పలు ప్రైవేటు కార్యక్రమాల్లో ఈ ట్రెండ్‌తో మెరిశారు.
చంకీ బూట్లు: సొగసుతోపాటు కాస్త హుందాగా కనిపించాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలు చీలమండల వరకు ఉండే చంకీ బూట్లను అప్పట్లో ధరించేవారు. ఇవే ఇప్పుడు కాలేజీ ప్రాంగణాల్లో సందడి చేస్తున్నాయి. స్కిన్నీ ఫిట్‌ జీన్స్‌, బాంబర్‌ జాకెట్లకు జతగా ఈ బూట్లు వేస్తే అదిరిపోతుంది అంటారు డిజైనర్‌ అనీషారావు.
ఫ్లానెల్‌ చొక్కాలు: మిలీనియమ్‌ మొదట్లో ఈ గళ్ల చొక్కాల్ని ధరించని అమ్మాయిలు అరుదే. ఈ స్టైల్‌ రెండువేల సంవత్సరం నుంచి ఒక దశాబ్దం వరకు దేశాన్నే వూపేసింది. అలాంటిది గత లాక్మే ఫ్యాషన్‌వీక్‌లోనూ ఇవే డిజైన్లు తళుక్కుమన్నాయి. ఈ చొక్కాల్ని జీన్స్‌తో కలిపి వేస్తే ఆధునికంగా కనిపిస్తారన్నది డిజైనర్ల సలహా.
మినీ బ్యాక్‌ప్యాక్‌: సన్నని పట్టీల బ్యాక్‌ప్యాక్‌లు పదేళ్ల కిందట హాట్‌ ఫ్యాషన్‌. ముఖ్యంగా ఆధునికంగా ఉండాలనుకునే అమ్మాయిలు వీపు వెనకభాగంలో ఎడాపెడా ధరించేవారు. ఇవే మళ్లీ మార్కెట్లోకి వచ్చాయి. కాలేజీ విద్యార్థులు డిజైన్లతో కూడిన మినీ బ్యాక్‌ప్యాక్‌లను ఆదరిస్తుంటే.. యువ ఉద్యోగులు సాదాసీదావైపు మొగ్గుచూపుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని