భయానికి బై..ఈతలో సై!

ఆ కుర్రాడికి నీళ్లంటే భయం.. నాన్న ఈతకొలనులో చేర్పించాడు... కొన్నాళ్లకే చేపపిల్లలా ఈదే స్థాయికెదిగాడు...

Published : 13 May 2017 01:15 IST

భయానికి బై..ఈతలో సై!

ఆ కుర్రాడికి నీళ్లంటే భయం.. నాన్న ఈతకొలనులో చేర్పించాడు... కొన్నాళ్లకే చేపపిల్లలా ఈదే స్థాయికెదిగాడు... ఆపై మేటి స్విమ్మర్‌గా, డైవర్‌గా విదేశాల్లో పేరు గడించాడు... అక్కడే స్థిరపడితే లక్షల సంపాదన... దాన్ని వదులుకొని భారత్‌ తిరిగొచ్చాడు... నీట మునిగి ఎవరూ చనిపోవద్దనే ఉద్దేశంతో... సకల సదుపాయాలతో రేజర్‌ఫిష్‌ స్విమ్‌ యూనివర్సిటీ ప్రారంభించాడు... యువతకి ఈతలో మెలకువలు నేర్పిస్తూ, అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అతడే హైదరాబాదీ జుబైర్‌ మొహమ్మద్‌ ఇఫ్తెకార్‌.
ప్రేరణ: ఈత రాక నీటిలో మునిగి ఏడాదికి 4 లక్షల మంది చనిపోతున్నారు. ఒక్క భారత్‌లోనే 29 వేల మంది మరణిస్తున్నారు. ఓ పత్రికలో వచ్చిన ఈ కథనం జుబైర్‌ని కదిలించింది. సౌదీ అరేబియాలో స్థిరపడ్డ తను వెంటనే ఇండియా తిరిగొచ్చాడు. ప్రతి ఒక్కరికీ ఈత నేర్పే ఉద్దేశంతో ‘రేజర్‌ఫిష్‌ స్విమ్‌ యూనివర్సిటీ’ స్టార్టప్‌ ప్రారంభించాడు.

నేపథ్యం: జుబైర్‌ కుటుంబం ఉద్యోగరీత్యా సౌదీఅరేబియాలో స్థిరపడింది. నాన్న ‘సౌదీ అరాంకో’ కంపెనీలో పనిచేసేవారు. ఆ సంస్థలో ఉద్యోగులు, వారి పిల్లలకోసం అత్యాధునిక వసతులతో ఆక్వాటిక్‌ సెంటర్‌ ఉండేది. నీళ్లంటే జడుసుకునే జుబైర్‌ భయం వదిలించడానికి అతడి నాన్న సరదాగా స్విమ్మింగ్‌కి తీసుకెళ్లేవాడు. నాలుగేళ్లకే ఈత కొలనులో దిగిన అతగాడు ఎప్పుడు ఖాళీ దొరికినా సాధన చేస్తూ రేజర్‌ఫిష్‌లా దూసుకెళ్లేవాడు. అతడి ప్రతిభకి మరింత పదునుపెట్టాలని అమెరికాకు చెందిన ఒక ప్రొఫెషనల్‌ కోచ్‌తో శిక్షణ ఇప్పించారు నాన్న. ఫ్రీస్టైల్‌, బ్యాక్‌, బటర్‌ఫ్లై, బ్రెస్ట్‌.. అన్ని విభాగాల్లో రాటుదేలిపోయాడు. హైస్కూల్‌ పూర్తయ్యాక సముద్రంలోకి దిగి స్కూబా డైవింగ్‌ సైతం నేర్చుకున్నాడు. ఆపై స్థానిక క్లబ్‌, సౌదీ ఆరాంకోల తరపున బరిలో దిగి చాలా పతకాలు గెలిచాడు. తర్వాత చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ వెళ్లి మాస్టర్‌ డిగ్రీ చేశాడు. అక్కడ జుబైర్‌ ఈత ప్రావీణ్యం గుర్తించి యూనివర్సిటీ సొంత ఖర్చులతో అతడ్ని అమెరికన్‌ రెడ్‌క్రాస్‌ లైఫ్‌గార్డ్‌ సర్టిఫికేషన్‌ కోర్సు చేయించింది. శిక్షకుడిగా అక్కడే రెండేళ్లు పనిచేశాడు.

ఈతే లక్ష్యం: ఇండియా తిరిగొచ్చిన జుబైర్‌ ఒక హోటల్‌ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఈత విశ్వవిద్యాలయం ప్రారంభించాడు. ఈతలో మెలకువలతోపాటు నీటిలో మునిగిపోతుంటే తమనుతాము కాపాడుకునే నైపుణ్యాలు ప్రాథమికంగా కోర్సులో నేర్పిస్తారు. సామాన్య జనానికి సైతం అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియమ్‌లో స్విమ్‌ మీట్‌ పోటీలు నిర్వహిస్తున్నాడు. దీనికోసం స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ సాయం తీసుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో దీన్ని మరింత విస్తృతపరిచేందుకు నగరం దగ్గర్లో ఉన్న గ్రామాల్లో సైతం ఈత కొలనుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. మరింత ప్రచారం తీసుకురావడానికి ఎఫ్‌టాప్సీ (ఎఫ్‌టీఏపీసీసీఐ), టెక్కి (టీఈసీసీఐ)ల్లో సభ్యుడిగా చేరాడు.

ప్రత్యేకతలు: రేజర్‌ఫిష్‌ విశ్వవిద్యాలయం ఆక్వాటిక్స్‌కు సంబంధించి అత్యాధునిక వసతులతో ఏర్పాటైంది. ఈతకొలను, ఆవిరి గదులు, బాత్‌ టబ్‌లు, స్పా.. అన్ని ఏర్పాట్లున్నాయి. నిపుణులైన శిక్షకులతోపాటు మేటి కోచ్‌లు, అథ్లెట్లను పిలిపించి వారితో సెమినార్లు నిర్వహిస్తున్నారు.

గుర్తింపు
* జుబైర్‌ ప్రఖ్యాత ప్యాడి (ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డైవింగ్‌) ఇన్‌స్ట్రక్టర్‌.
* అమెరికన్‌ రెడ్‌క్రాస్‌ సర్టిఫైడ్‌ లైఫ్‌గార్డ్‌, అమెరికన్‌ రెడ్‌క్రాస్‌ సర్టిఫైడ్‌ వాటర్‌ సేఫ్టీ ఇన్‌స్ట్రక్టర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని