యాప్‌ కండలు టెక్‌ నరాలు

ఇలా... సాగుతోంది నేటి యువత ఫిట్‌నెస్‌ బాతాకానీ. ఎప్పుడూ కొత్తదనం కోరుకునే కుర్రకారు, వ్యాయామంలోనూ అదే పాట పాడుతున్నారు. పవర్‌ యోగా నుంచి ఫంక్షనల్‌ ఎక్సర్‌సైజ్‌ల వరకూ బాడీబిల్డింగ్‌ నుంచి కార్డియో వరకూ అధునాతన విధానాలు అవలంబిస్తున్నారు. సాంకేతికతను స్వాగతిస్తున్నారు. చేసిన వ్యాయామాన్ని ఒకరు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే... మరొకరు వాట్సప్‌లో స్నేహితులకు షేర్‌ చేస్తున్నారు. వారానికోసారి విహారయాత్రల్లా అవుట్‌డోర్‌ వర్కవుట్లతో కొత్త శక్తి నింపుకొంటున్నారు. ఎప్పటికప్పుడూ తమలో వచ్చిన మార్పులను పంచుకుంటున్నారు. ఫిట్‌నెస్‌పై ధ్యాస పెంచుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు అంటే..? ఇదిగో చదివేయండి.

Published : 07 Apr 2018 01:32 IST

ఫటాఫిట్‌
యాప్‌ కండలు టెక్‌ నరాలు

ఈ వారం మనకు గోల్కొండలో ట్రెక్కింగ్‌ వర్కవుట్‌...
ఈ రోజు మొత్తంలో   నేను 9867 అడుగులు నడిచాను తెలుసా?...
ఉదయం జిమ్‌లో 750 క్యాలరీలు కరిగించాను...
ఈ పూట నా సప్లిమెంట్‌.. మల్టీ విటమిన్‌
లా... సాగుతోంది నేటి యువత ఫిట్‌నెస్‌ బాతాకానీ. ఎప్పుడూ కొత్తదనం కోరుకునే కుర్రకారు, వ్యాయామంలోనూ అదే పాట పాడుతున్నారు. పవర్‌ యోగా నుంచి ఫంక్షనల్‌ ఎక్సర్‌సైజ్‌ల వరకూ బాడీబిల్డింగ్‌ నుంచి కార్డియో వరకూ అధునాతన విధానాలు అవలంబిస్తున్నారు. సాంకేతికతను స్వాగతిస్తున్నారు. చేసిన వ్యాయామాన్ని ఒకరు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే... మరొకరు వాట్సప్‌లో స్నేహితులకు షేర్‌ చేస్తున్నారు. వారానికోసారి విహారయాత్రల్లా అవుట్‌డోర్‌ వర్కవుట్లతో కొత్త శక్తి నింపుకొంటున్నారు. ఎప్పటికప్పుడూ తమలో వచ్చిన మార్పులను పంచుకుంటున్నారు. ఫిట్‌నెస్‌పై ధ్యాస పెంచుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు అంటే..? ఇదిగో చదివేయండి.

‘బ్యాండ్‌’ బాజా : ఫిట్‌నెస్‌ మంత్రాలోకి దూసుకొచ్చాయి యాప్‌లు, బ్యాండులు. ఇవి వేర్వేరుగానూ, కలిసి ఫిట్‌నెస్‌కు దోహదపడుతుంటాయి. కొన్ని యాప్‌ల్లో మనం రోజూ చేస్తున్న వాకింగ్‌, సైక్లింగు, కసరత్తులను నమోదు చేస్తే ఖర్చు చేసిన క్యాలరీలను చెబుతాయి. తీసుకొనే ఆహార పదార్థాలను నమోదుచేయొచ్చు. నిద్రపోతున్న గంటలు నమోదు చేయడం వల్ల వారంలో మనం సరిపడా నిద్రపోతున్నామా లేదా? అనేది తెలిపే యాప్‌లు ప్లేస్టోర్లో ఉన్నాయి. ఇలా వారానికి, నెలకు మనం చేసిన వ్యాయామం ఏంటి? తీసుకున్న ఆహారం ఏమిటి? అనేది విశ్లేషించి చెప్పే యాప్‌లున్నాయి. ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ల్లో చాలా రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రోజులో మనం నడిచే దూరం, ఖర్చు చేస్తున్న క్యాలరీలను చూపుతుంటాయి. సమయంతో పాటు, హార్ట్‌బీట్‌ను చెబుతాయి. డ్రోయ్‌హెల్త్‌, జియోమీ.. ఇలా చాలా ఉదాహరణలున్నాయి. వీటి ద్వారా కచ్చితమైన సమాచారం కాకపోయినా సగటు  తెలుస్తుందని, దీని వల్ల మనం ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యే అవకాశముంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ వేసవిలో వీటితో చాలా ఉపయోగమంటున్నారు. ఎక్కువ డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి ఇవి మనల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటాయి.

‘గ్రూప్‌’ కట్టి.. మేలు తలపెట్టి : వాట్సప్‌ వచ్చాక ప్రతీ దానికి ఒక గ్రూప్‌ క్రియేట్‌ చేయడం యువతకు అలవాటు. ఈ పరంపరలోనే ఫిట్‌నెస్‌ గ్రూపులు పుట్టుకొచ్చాయి. చిన్ననాటి స్నేహితులు, కార్యాలయ మిత్రులు... కలిసి వీటిని నడుపుతున్నారు. తాము ఆరోజుకు చేసిన వర్క్‌అవుట్స్‌ గురించి గ్రూప్‌లో పోస్ట్‌ చేస్తారు. చేస్తున్న వ్యాయామం, ఖర్చు చేసిన క్యాలరీలు, తీసుకుంటున్న ఆహారం... వాటి తాలుకు ఫీలింగ్స్‌లు ఇలా అనేక రకాలుగా ఈ పోస్టులు సాగుతుంటాయి. వీటి వల్ల గ్రూప్‌లో ఉండే వారు ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందుతారని అంటారు ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ గ్రూప్‌ నిర్వాహకురాలు శ్రీలక్ష్మీ. మనకు ఎప్పుడైనా వ్యాయమం చేయడానికి బద్ధకిస్తే... ఈ గ్రూపుల్లో పోస్టింగులు చూసి బద్ధకంపై యుద్ధం మొదలవుతుందంటుంది యువత. కొన్ని జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లూ ఈ వాట్సప్‌ గ్రూపులు నిర్వహిస్తున్నాయి. రోజూ అక్కడ జరిగిన వర్కవుట్స్‌పై అప్‌డేట్లు పెడుతుంటారు. వ్యాయామం ప్రాధాన్యం తెలిపే సంక్షిప్త సందేశాలు పంచుకుంటారు. ఫొటోలు, డైట్‌ వివరాలను పంచుకుంటుంటారు.

వ్యాయామ యాత్రలకు బృందావనం.. : రోజూ చేసే చోటే నడకంటే కొంచెం బోరే కదా! ప్రతిరోజూ అదే జిమ్‌... ఆసక్తి ఏముంటుంది? అనే వారికి  వ్యాయామ యాత్రలు ఉపయోగపడుతున్నాయి. వారానికో, నెలకో ఒకసారి ఇలాంటి యాత్రలు చేస్తున్నారు కుర్రకారు. ట్రెక్కింగ్‌, అవుట్‌డోర్‌ జుంబా, పార్క్‌ డ్యాన్స్‌, స్విమ్మింగ్‌, యోగా, క్రాస్‌ కంట్రీ లాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. దీనివల్ల మనసుకు ఎంతో ఉల్లాసం వస్తుందని, తర్వాత వ్యాయామాల పట్ల వ్యామోహం పెరుగుతుందంటున్నా జిమ్‌ నిర్వాహకులు. వీటి వల్ల సోషల్‌ లైఫ్‌ కూడా అలవడుతుందని చెబుతున్నారు. జిమ్‌లకు వేర్వేరు జీవనశైలి, ఉద్యోగాలు, ప్రాంతాల నుంచి వస్తారు. వీరందరినీ కలపడానికి ఇలాంటి యాత్రలు ఎంతో ఉపకరిస్తాయి. వారానికోసారి కొత్త చోట కసరత్తులు చేస్తే తర్వాతి రోజు వ్యాయామం చేసేటప్పుడు వారిలో ఉత్సాహం రెట్టింపవుతుంది.

యంత్రం... కండర మంత్రం :  సప్లిమెంట్లను మొదట్లో తక్కువమందే వాడినా... ప్రస్తుతం ట్రెండీగా మారిపోయాయి. బాడీబిల్డింగ్‌ చేసే వారికి, ప్రత్యేకంగా కొన్ని భాగాల్లోనే కొవ్వు కరిగించుకోవాలని ప్రయత్నించే వారికి ఉపయుక్తం. చేసిన వ్యాయామం, కండరాలు పొందుతున్న శక్తి, గట్టిదనం వివరాలను కంప్యూటర్‌, ఫోన్లలో చూపేవి ఒకరకమైతే.  కొవ్వు పెరిగిపోయిన ప్రదేశాల్లో వేడి సృష్టించడం ద్వారా కరగదీసే పరికరాలూ మరో రకం. కండర పటుత్వం, సామర్థ్యం చెప్పే పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక వ్యాయామం చేస్తున్నప్పుడు ఆ కండరంపై పడే ప్రభావం వీటితో తెలిసిపోతుండటంతో యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.

మిస్టర్‌ ‘పోషక్‌’ : బాడీబిల్డింగ్‌ చేసేవారికి సప్లిమెంట్లు, బరువు తగ్గాలనుకొనే వారికి తగిన డైట్‌ చాలా అవసరం. వీటిల్లో ప్రీవర్క్‌అవుట్స్‌, ఆఫ్టర్‌ వర్‌అవుట్స్‌ అని రకాలున్నాయి. ముఖ్యంగా విటమిన్లు, ప్రొటీన్లు ఎక్కువగా అందించే సప్లిమెంట్లు చాలా జిమ్‌ల్లో అందుబాటులో ఉంచుతున్నారు. వీటిల్లో డైటీషన్‌ సలహా మేరకు నాణ్యమైనవి ఎంపిక చేసుకోవడం మంచిది. డైట్‌ ఎలా పడితే అలా చేస్తే శరీరానికి కావాల్సిన పోషకాలు తగ్గిపోతాయి. నీరసం ఆవహిస్తుంది. అందుకే నిపుణుల సాయం తీసుకోవాలి. మన శరీర తత్వం మనం చేస్తున్న వ్యాయామం బట్టి డైట్‌ చార్ట్‌ తయారు చేసుకుంటే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. చాలా మంది సప్లిమెంట్లు అంటే స్టెరాయిడ్స్‌, డ్రగ్స్‌ అనుకుంటారు అది తప్పని అంటున్నారు నిపుణులు. శరీర తత్వాన్ని బట్టి కొందరికి మల్టీవిటమన్లు అవసరమవుతాయి. ఇంకొందరికి ప్రొటీన్లు కావాలి. ఎనర్జీ డ్రింకులూ ఇందులో భాగమే. వీటిని సరైన నిపుణుడి పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది.

అవుట్‌డోర్‌లో కొత్త శక్తి

మనం కొంతకాలం పాటు జిమ్‌లో చేసిన కష్టంతో వచ్చిన ఫలితాన్ని అవుట్‌డోర్‌ వ్యాయామాలతో తెలుసుకొనే వీలుంటుంది. పైగా శరీరానికి కావాల్సిన మంచి ఆక్సిజన్‌ అందుతుంది. రొటీన్‌కు భిన్నంగా స్కిప్పింగ్‌, రోపింగ్‌, ట్రెక్కింగ్‌, జుంబా లాంటివి చేయిస్తాం. సైకిలింగ్‌, క్రాస్‌కంట్రి వంటి ద్వారా మన శరీర సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చు.

-శ్రీనివాస్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, ఎఫ్‌9 జిమ్‌

సహజమే సగం బలం

సప్లిమెంట్ల పేరుతో కృత్రిమ ఆహారం తీసుకోవడం కంటే సహజసిద్ధంగా లభించేవి తీసుకోవడం మంచిది. పాలు, గుడ్లు, ఆలివ్‌ ఆయిల్‌లో వేయించిన చికెన్‌, మొలకెత్తిన గింజలు... ఇలా ప్రొటీన్లు ఇచ్చేవి చాలా ఉన్నాయి. విటమిన్ల కోసం అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. ఉడకబెట్టిన ఆకుకూరలూ మనకు కావాల్సిన పోషకాలిస్తాయి. మంచి ఆహార నిపుణుడి సలహా మేరకు సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవడం ద్వారా సప్లిమెంట్ల లాగానే మంచి ఫలితాలు వస్తాయి.

- భాస్కర్‌రెడ్డి, డైరెక్టర్‌, లైఫ్‌స్టైల్‌ ఫిట్‌నెస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని