ఓ జూనియర్‌... జంకు ఏల?

ర్యాంకులు సాధించి... కౌన్సెలింగ్‌ని ఛేదించి... కొత్త రెక్కలతో కాలేజీల్లో ఫ్రెషర్స్‌ వాలిపోయే సమయమిది.. ఎగిరొచ్చే ఆ గువ్వల మదిలో ఎన్నో సందేహాలు... సూర్య, విరాట్‌లూ ఫ్రెషర్లే. మరి, వారి సందేహాల్ని తీర్చేదెవరు? సీనియర్లే!! ఎందుకంటే.. వారూ నిన్న మొన్నటి జూనియర్లే కదా! కంగారొద్దు.. క్యాంపస్సే అన్నీ నేర్పుతుందని వెల్‌కమ్‌ చెబుతున్నారు...

Published : 23 Jun 2018 03:40 IST

క్యాంపస్‌

ఓ జూనియర్‌... జంకు ఏల?

ర్యాంకులు సాధించి... కౌన్సెలింగ్‌ని ఛేదించి...
కొత్త రెక్కలతో కాలేజీల్లో ఫ్రెషర్స్‌ వాలిపోయే సమయమిది..
ఎగిరొచ్చే ఆ గువ్వల మదిలో ఎన్నో సందేహాలు... సూర్య, విరాట్‌లూ ఫ్రెషర్లే.
మరి, వారి సందేహాల్ని తీర్చేదెవరు? సీనియర్లే!!
ఎందుకంటే.. వారూ నిన్న మొన్నటి జూనియర్లే కదా!
కంగారొద్దు.. క్యాంపస్సే అన్నీ నేర్పుతుందని వెల్‌కమ్‌ చెబుతున్నారు.
‘సూర్య..
బ్యాగులో నీ డ్రస్‌లు అన్నీ సర్దుకున్నావా? హాస్టల్‌ భోజనం ఎలా ఉంటుందో ఏమో? పచ్చళ్లేమైనా తీసుకెళ్తావా? తమరికి నేను చేసిన కూరలే నచ్చవ్‌!’ అంటూ... అమ్మ ఒకవైపు
‘బేటా... ఏం ఫర్లేదు. మెస్‌ బాగుంటుందంటా. కనుక్కున్నాలే. అమ్మ చేసే రొటీన్‌ వంటల నుంచి నీకు విముక్తే! మాకు తప్పదులే!!’ అని నాన్న మరోవైపు.
‘రేయ్‌ అన్నయ్యా.. కొత్త ఫ్రెండ్స్‌. కొత్త ప్లేస్‌. మీ క్యాంపస్‌కి నార్త్‌ నుంచి కూడా వస్తారంటగా. ఇంక మేం గుర్తుంటామా?’
అంటూ.. ఇంకోవైపు చెల్లి
అన్నీ తన రూమ్‌లో ఉన్న సూర్య.. చెవిన పడుతున్నాయి. చూపంతా... తను చదివేసి టేబుల్‌పై పేర్చిన ఇంటర్‌ పుస్తకాలు.. ఆ పక్కనే జీవంలేని తేగ తొక్కలా జారబడి ఉన్న తన పాత కాలేజీ బ్యాగు. అటుగా మూలన ఇంటెనక షాట్‌లు కొట్టి కొట్టి వదిలేసిన కుకుంబర్‌ బ్యాటుపైనే! ఇల్లు.. పక్క సందులో స్కూల్‌. నాలుగు వీధుల అవతల ఇంటర్‌ కాలేజీ... ఇప్పుడు అవన్నీ దాటుకుని ఎక్కడికో... ఊళ్లు దాటి వెళ్లిపోయాడు. సూర్య.. ఆలోచనలు క్యాంపస్‌ గేటు దగ్గర ఆగాయి...
* క్యాంపస్‌ లైఫ్‌ ఎలా ఉంటుంది?
* ఎలాంటి ఫ్రెండ్స్‌ కలుస్తారు?
* నేను త్వరగా కలిసిపోతానా?
* ర్యాగింగ్‌ ఏమైనా చేస్తే?
* ఇల్లు వదిలి హాస్టల్‌లో ఉండాలా?
* భోజనం ఎలా ఉంటుందో?
* రూమ్‌ మేట్స్‌ ఎవరొస్తారో?...
ఇలా ఎన్నో ప్రశ్నలు. సూర్య.. ఉన్న స్థితి తనకే కొత్తగా చిత్రంగా అనిపిస్తోంది. నెల క్రితం ఇవేం లేవు. మంచి మార్కులు, ర్యాంకులతో ఫ్రెండ్స్‌తో మస్తీ చేసిన నేనేనా ఇలా ఆలోచిస్తున్నది అనుకుంటూ గది నుంచి బయటికి వచ్చాడు. తన బెస్టీ విరాట్‌కి ఫోన్‌ చేశాడు.
‘మాట్లాడాల్రా... కలుద్దాం. మన అడ్డాకి వచ్చెయ్‌’ అని ఫోన్‌ కట్‌ చేశాడు. ‘అమ్మా... విరాట్‌ని కలిసొస్తా’ అని చెప్పి మూలన ఉన్న బ్యాటుని తీయబోయి ఒక్క క్షణం ఆగాడు.
‘ఊహు.. వద్దు’ అని ఓ నిట్టూర్పు. ఒట్టి చేతులతో...
మదిలో ఓవరైట్‌ అయిన ఆలోచనలతో బయటికి అడుగులు వేశాడు. ఎందుకీ మార్పు? దీన్నేలా అధిగమించాలి? ఇవి సూర్య.. ఒక్కడి ఆలోచనలే కాదు. క్యాంపస్‌లో అడుగుపెట్టే ఫ్రెషర్స్‌ ముందున్న అనేక ప్రశ్నలు!!
వీధి చివరున్న సలీమ్‌ భాయ్‌ ఛాయ్‌ బండి పక్కనే ఓ పిట్టగోడ. దానిపై కూర్చున్న సూర్య.... విరాట్‌ల చర్చ ఇలా సాగుతోంది.. అందుకు సీనియర్లు ఏం చెబుతున్నారో చూద్దాం రండి?

సూర్య: రేయ్‌ విరాట్‌. ఇన్నేళ్లూ ఓ గ్యాంగులా తిరిగాం. ఇప్పుడు సింగిల్‌గా వేరు వేరు క్యాంపస్‌ల్లోకి వెళ్తున్నాం. ర్యాగింగ్‌ ఉంటుందా? ఉంటే ఏం చేయాలి?
విరాట్‌: నేనూ అదే ఆలోచిస్తున్నా. చాలా సినిమాల్లో చూశాంగారా. అలాగే ర్యాగ్‌ చేస్తారంటావా?
......సీనియర్‌ సలహా: ‘అంత సీన్‌ లేదు. దేశంలోని చాలా కాలేజీల్లో ర్యాగింగ్‌ భూతాన్ని ఎప్పుడో తరిమేశారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. ఒకవేళ ఉన్నా అది కేవలం ఫన్‌ కోసమే తప్పా.. సినిమాల్లో చూపించినట్టు ఉండదు. మీరు జాయిన్‌ అయ్యే క్యాంపస్‌ కహానీల్ని ముందే తెలుసుకోవడం మంచిది. అందుకు తగినట్టుగా సిద్ధం అవ్వొచ్చు. ఒకవేళ హద్దులు దాటేసి ర్యాగింగ్‌కి పాల్పడితే కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు వెనకాడొద్దు.
- హారిక, ఎంటెక్‌ సెకండ్‌ ఇయర్‌  
విరాట్‌: మన చిన్నప్పటి ఫ్రెండ్స్‌ గురించి తెలుసు. ఇప్పుడు వేరు వేరు క్యాంపస్‌లకు వెళ్తున్నాం. అక్కడ మనకి మంచి ఫ్రెండ్స్‌ దొరుకుతారా?
సూర్య: ఏమోరా? నాకు డౌటే. కొత్తగా ఏం మారాల్సివస్తుందో..ఏమేం అలవాటు చేసుకోవాలో?
......సీనియర్‌ సలహా: ‘స్నేహం లెక్కలేసుకుని చేసేది కాదు. హాయ్‌తో మొదలై అలా కలిసిపోతాం. కొన్ని రోజులకు తెలిసిపోతుంది మనకి కరెక్టా.. కాదాని. ఎలాంటి అపోహలకు తావు లేకుండా మనసేం చెబితే అదే చేయండి. మీ మనస్తత్వానికి సరిపడే వారితో జట్టుకట్టండి. తర్వాత నాలుగేళ్లు వాళ్లే మీతో అంటిపట్టుకుని ఉంటారు. ఆ గ్యాంగుతో తీపి గుర్తుల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మరి మనమూ వారికి అలా మంచి ఫ్రెండ్‌లా ఉండాలి మర్చిపోవద్దు. గెలిచినప్పుడు చప్పుట్లు కొట్టి, ఓడిపోయినప్పుడు వెన్ను తట్టే స్నేహితుడు దొరికితే అంతా హాయే.
- ప్రఘ్నేష్‌, బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌  
సూర్య: చెల్లి... ఇంటికెనక గల్లీ క్రికెట్‌... నేను రోజూ అడుకునే పప్పీ. ఇవన్నీ మిస్‌ అయిపోవాలా? తల్చుకుంటేనే నాకేంటోలా ఉందిరా. 
విరాట్‌: నువ్వింకా నయంరా. నువ్వు మన రాష్ట్రంలోనే. నేనైతే రాష్ట్రాలు దాటేస్తున్నా. నేనెవడితో చెప్పుకోవాలి?
......సీనియర్‌ సలహా: ‘మొదట్లో అందరి మానసిక స్థితి ఇలానే ఉంటుంది. హోమ్‌సిక్‌గా అనిపిస్తుంది. కానీ, కెరీర్‌ బాగుండాలంటే కంఫర్ట్‌జోన్‌ నుంచి బయటపడాలి. నగరం, రాష్ట్రం, దేశం దాటి వెళ్లాల్సివచ్చినా వెనకాడకూడదు. చుట్టు ఉన్నవారితో కలిసిపోయి హోమ్‌సిక్‌ని పోగొట్టుకోవచ్చు. అన్నీ షేర్‌ చేసుకోగలిగే బెస్టీలు ఒకరిద్దరు ఉంటే చాలు. ఇంటి ధ్యాసని రానివ్వరు. అయినా, ఫ్యామిలీని మిస్‌ అవుతున్నాం అనిపిస్తే టెక్నాలజీ ఉందిగా. ఎప్పుడంటే అప్పుడు వీడియో కాల్స్‌, సెల్ఫీలు, టెక్స్ట్‌మెసేజ్‌లు. నెట్టింట్లోంచి ఇంటికెళ్లి రావచ్చు. అన్నీ సర్దుకునేటప్పుడు మీకు ఇష్టమైన ప్లేటు... స్పూను... దిండు.. ఇలా ఏవైనా ప్యాక్‌ చేసుకోండి. ఇవి కొంత ఊరటనిస్తాయి.
- సౌరభ్‌, బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌  
విరాట్‌: ఇంట్లో అమ్మ వండిందే నాకు సరిగ్గా ఎక్కదు. బయటికొచ్చి పిజ్జా, బర్గర్లు తింటాం. ఇప్పుడు హాస్టల్‌ ఫుడ్‌ ఏంట్రా బాబు. ఏం తినాలి? ఎలా తినాల్రా!
సూర్య: మీటూ. పొద్దున ఇంట్లో ఇదే టాపిక్‌. నాకేం అర్థం కావట్లే!
......సీనియర్‌ సలహా: కచ్చితంగా భయపట్టే విషయమే. కానీ, క్యాంపస్‌ల్లో మెస్‌లు బాగుంటాయ్‌. దానికి తోడు స్నేహితుల సందడితో ఏం తింటున్నామో... ఎంత తింటున్నామో కూడా తెలియదు. కొన్ని సార్లు ఇంటి నుంచి తెచ్చుకున్న పచ్చళ్లు సిసలైన ఇంటి వాతావరణాన్ని పరిచయం చేస్తాయి. కొన్ని క్యాంపస్‌ల్లో నార్త్‌...  సౌత్‌ ఇండియన్‌ మెనూలుంటాయి. సెలెక్ట్‌ చేసుకుని కావాల్సింది తినొచ్చు. ఒక్కటి గుర్తుంచుకోండి... ఇంట్లో అమ్మ చేసినట్టు  శుభ్రంగా ఉంటే తప్ప నేనేం ముట్ట‌ను అనే తీరుగా ఆలోచిస్తే కష్టమే. అడ్జెస్ట్‌ అవ్వాలంతే.
- సుప్రజ, డిగ్రీ సెకండ్‌ ఇయర్‌  
సూర్య: ఇదంతా పక్కన పెడితే. ఇప్పటి వరకూ ఇంట్లో, కాలేజీల్లో రుద్ది రుద్ది చదివించారు. మన పేర్లు, సెక్షన్‌తో సహా లెక్చరర్లకు తెలుసు. ఇకపై క్యాంపస్‌ల్లో ఎలా ఉంటుంది? మనల్ని అసలు పట్టించుకుంటారా?
విరాట్‌: నాకూ అదే డౌట్‌ రా. ఇప్పటి వరకూ కాలేజీలో మొదటి రెండు స్థానాలు మనవే. ఇకపై అలా చదవగలమా?
......సీనియర్‌ సలహా: ఈ సందేహం సరైనదే. బట్టికొట్టే చదువులు క్యాంపస్‌లో ఉండవు. బుద్ధిగా కూర్చుని చదువుకోండి అని చెప్పేవారూ ఉండరు. ఎవరికి వారు స్వతంత్రంగా ఆలోచించి పుస్తకం తెరవాల్సిందే. అదే క్యాంపస్‌ గొప్పతనం. విద్యార్థి ఉన్నత ఆలోచనలకు అదే భీజం. అది  మొదలు... ఏం చదువుతున్నాం? ఎందుకు చదువుతున్నాం?... లాంటి ప్రశ్నలు వేసుకుంటూ తామేం అవ్వాలనుకున్నారో తెలుసుకుంటారు. ఆయోమయంగా క్యాంపస్‌లో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థికి జీవితంపై ఎంతోకొంత క్లారిటీ ఇచ్చి పంపేదే క్యాంపస్‌.
- సాయి కుమార్‌, ఎంటెక్‌ సెకండ్‌ ఇయర్‌  

‘ఫస్ట్‌ డే’ కిక్కే వేరప్పా!  

కొత్త క్యాంపస్‌.. కొత్త ప్రాంతం... తెరచిన రోజే కాలేజీకి ఎవరొస్తారులే అనుకోవద్దు. మొదటి రోజే వెళ్తే ఆ కిక్కే వేరు. ఎందుకంటే...
* అప్పుడే పుట్టిన బిడ్డకి తల్లి పాలు తాగించడం ఎంత ముఖ్యమో... క్యాంపస్‌లో కొత్తగా అడుగుపెట్టి రూపాంతరం చెందే విద్యార్థికి మొదటి రోజు అంతే విలువైంది. కాలేజీ యాజమాన్యాలు చేపట్టే ‘ఓరియంటేషన్‌’కి ఉండే ప్రాధాన్యత అలాంటిది. విద్యార్థుల్లో బెరుకుతనాన్ని పోగొట్టేందుకు పలు రకాల సెషన్స్‌ ఉంటాయి. ఓ నాలుగేళ్ల పాటు తిరిగే క్యాంపస్‌పై ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ తొలిరోజు పరిచయ కేరింతలతోటే కలుగుతుంది.
* మొదటి వారం జరిగే తరగతుల్ని మిస్‌ చేసుకోవద్దు. ఎందుకంటే అధ్యాపకులు మొదటి తరగతుల్లోనే వారి చెప్పే సబ్జెక్టులు, కోర్సులో వాటికున్న ప్రాధాన్యత, బోధనా పరమైన  అంశాలపై స్పష్టతనిచ్చే అంశాల్ని విద్యార్థులతో పంచుకుంటారు.
* క్యాంపస్‌కి వచ్చే ముందే విద్యార్థులు ‘అడల్ట్‌ కమ్యూనికేషన్‌’ని  అలవర్చుకోవాలి. భయం, బెరుకు లేకుండా అధ్యాపకుల నుంచి కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకునేలా కమ్యూనికేషన్‌ని పెంచుకోవాలి. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి, అధ్యాపకుల మధ్య సమానత్వం ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.
* ‘ఫ్రెషర్స్‌ డే’ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడాలి. ఎందుకంటే సీనియర్లతో స్పోర్టీవ్‌గా కలిసిపోయేందుకు అదే సరైన వేదిక.
* చివరి రోజు క్యాంపస్‌ నుంచి ఎలా వెళ్లాలనుకుంటున్నారో దృష్టిలో పెట్టుకుని తొలి రోజు ప్లానింగ్‌ మొదలవ్వాలి.
* వెంకటరావు యడ్ల, ఆచార్యులు, పుదుచ్చెరి కేంద్రీయ విశ్వవిద్యాలయం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని