ఆన్‌లైన్‌లో ఉన్నా పలకరించదే?

ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. రెండుసార్లు బయట కూడా కలుసుకున్నాం. సమస్య ఏమిటంటే తను ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది...

Published : 14 Jan 2016 15:32 IST

ఆన్‌లైన్‌లో ఉన్నా పలకరించదే?

 ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. రెండుసార్లు బయట కూడా కలుసుకున్నాం. సమస్య ఏమిటంటే తను ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఆమె విష్‌ చేస్తే నేను వెంటనే జవాబివ్వాలి. క్షణం ఆలస్యమైనా సహించదు. నాకేమో త్వరగా సమాధానమివ్వదు. అడిగితే నెట్‌వర్క్‌ నెమ్మదిగా ఉంది, నెట్‌ ఆన్‌ చేసి మర్చిపోయానంటుంది. నీ పాస్‌వర్డ్‌ నాకు చెప్పు.. నాది నీకు చెబతా అని అడిగానోసారి. నన్ను అనుమానిస్తున్నావ్‌ అని ఏడ్చి గొడవ చేసిందే తప్ప ఇవ్వలేదు. నేను ఆమెని పెళ్లాడితే భవిష్యత్తులో సుఖంగా ఉండగలనా?

- రమేశ్‌, ఖమ్మం

  ఆమె ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండటం నెట్‌ అడిక్షన్‌ని సూచిస్తోంది. ఇలాంటి వాళ్లు అంతర్జాలం లేకుండా ఉండలేరు. ఏ విషయంపై ఏకాగ్రత చూపించలేరు. దీన్నుంచి బయటపడటం సులువు కాదు. పైగా ఈతరహా వ్యక్తులు చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తారు. వీళ్లలో మానసిక ఒత్తిడి తట్టుకునే సామర్థ్యం తక్కువ. ఈ సమస్యను పక్కన పెడితే కేవలం రెండుసార్లు కలిసి, మాట్లాడిన వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎలా సాధ్యం? ఆమెను పెళ్లాడాలనే మీ నిర్ణయం సమంజసంగా తోచడం లేదు. త్వరగా దగ్గరైనవాళ్లు త్వరగా దూరమయ్యే అవకాశాలెక్కువని సర్వేలు నిరూపిస్తున్నాయి. ఇక ఆన్‌లైన్‌ అనుబంధాలను అంత నమ్మకమైనవిగా ధృవీకరించలేం. వూహాజనిత ప్రపంచానికి, వాస్తవిక జీవితానికి ఎంతో తేడా ఉంటుంది. ఆన్‌లైన్‌లో మీరు వెంటనే స్పందించకపోతే తట్టుకోలేకపోవడం ఆమె చిన్న ఆశాభంగాన్ని కూడా భరించలేదనే విషయం తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లతో జీవితం పంచుకోవడం అంత సులభం కాదు. మీ మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఫేస్‌బుక్‌ ఖాతా పాస్‌వర్డ్‌లు ఇచ్చిపుచ్చుకుందాం అని మీరన్నారు. దాన్ని నిరాకరించడం, అనుమానిస్తున్నావు అని ఏడవడం సమంజసంగా లేదు. ఇవన్నీ ఆలోచించాక ఆ అమ్మాయి ప్రేమ నిజమా, కాదా అనే అనుమానం కలుగుతోంది. తనని పెళ్లాడితే మీరు సంతోషంగా ఉండరనే విషయం బోధపడుతోంది. ఆపై నిర్ణయం మీదే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని