ఆంధ్ర మహాభారతం 108 పద్య గానమాలిక ఆడియో ఆవిష్కరణ

కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ రచించిన అంధ్ర మహాభారతంలోని పద్యాలు నేటి బాల బాలికలు , యువతీ యువకులు పఠించడం ఎంతో అవసరమని స్వామి విజయేంద్ర సరస్వతి అన్నారు.

Published : 12 Dec 2022 19:08 IST

అమలాపురం: కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని 108 పద్యాలను డా.గజల్‌ శ్రీనివాస్‌ గానం చేసి జగద్గురు విజయేంద్ర సరస్వతి శంకరాచార్య మహాస్వామికి భక్తిపూర్వకంగా సమర్పించారు. స్వామివారి చేతుల మీదుగా ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా పేరూరు గ్రామంలో ఘనంగా జరిగింది. ఇటీవల జరిగిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామి విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ రచించిన ఆంధ్ర మహాభారతంలోని పద్యాలు నేటి బాల బాలికలు , యువతీ యువకులు పఠించడం ఎంతో అవసరమన్నారు. తద్వారా తెలుగు భాషా వైభవం, భక్తితత్వం, అత్యంత సుందరమైన భావ వ్యక్తీకరణ వారికి అర్థమవుతాయని చెప్పారు.

శ్రీ కంచి పరమాచార్య  శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి జన్మదిన సందర్భంగా డిసెంబర్‌ 20న కొవ్వూరు సంస్కృత విద్యా పీఠం వేదికగా వేల మంది బాలబాలికలతో ఈ 108 పద్యాలను వేర్వేరు ప్రాంతాల నుంచి ఒకే సమయంలో సామూహికంగా గానం చేయించే ప్రయత్నాన్ని కంచి కామాక్షి పీఠం చేపట్టనుందని నిర్వాహకులు తెలిపారు.  ఈ 108 పద్యాలను అందరూ సులువుగా ఆలపించేలా గానం చేసి రికార్డు చేయించిన ‘సేవ్ టెంపుల్స్ భారత్’ అధ్యక్షులు, ప్రముఖ గాయకులు డా.గజల్ శ్రీనివాస్‌ను శ్రీ కంచి శంకర విజయేంద్ర స్వామి అభినందిస్తూ తీర్థ ప్రసాదాలు అందజేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని