పసి(డి)ప్రాయం

సృష్టిలో ప్రతి శిశువూ అపురూపం. ఆ బిడ్డలో ఏదో తెలుసుకోవాలన్న కోరిక, ఆసక్తి, ఆటలు... తదేకంగా చూడటం, పెద్దలను అనుకరించడం... అన్నీ అందరికీ ముద్దొచ్చేవే. ఆరుమాసాలు వచ్చేసరికి తనకు తాను కూర్చోగలగడం, ఏడాది సమీపించేసరికి ముద్దు ముద్దు పలుకులు... చిట్టిచిట్టి తప్పటడుగులు... కన్నవారికే కాదు, చూసేవారికీ ఆనందమే. వీటిలో ఏ ఒక్కటీ ప్రత్యేకంగా నేర్పింది కాదు.

Published : 21 Jan 2023 00:33 IST

సృష్టిలో ప్రతి శిశువూ అపురూపం. ఆ బిడ్డలో ఏదో తెలుసుకోవాలన్న కోరిక, ఆసక్తి, ఆటలు... తదేకంగా చూడటం, పెద్దలను అనుకరించడం... అన్నీ అందరికీ ముద్దొచ్చేవే. ఆరుమాసాలు వచ్చేసరికి తనకు తాను కూర్చోగలగడం, ఏడాది సమీపించేసరికి ముద్దు ముద్దు పలుకులు... చిట్టిచిట్టి తప్పటడుగులు... కన్నవారికే కాదు, చూసేవారికీ ఆనందమే. వీటిలో ఏ ఒక్కటీ ప్రత్యేకంగా నేర్పింది కాదు. వారిలోని నిగూఢశక్తి- వికాసానికి దారి చూపెడుతుంది. ప్రతి శిశువూ తనదైన ప్రత్యేకతతో ఎదగడం గమనిస్తాం. పిల్లలను మించిన గురువులు లేరు. వారి ప్రపంచం ప్రతిక్షణం కొత్తదనంతో నిండి ఉంటుంది.

శిశువు ఎదిగే సామాజిక పరిస్థితులు, అందుబాటులో ఉండే అవకాశాలు తీవ్రప్రభావం చూపుతాయి. కొందరు ఇరుకు పరిసరాలలో ఉన్నా, చుట్టుపక్కల వారితో ఎక్కువ అన్యోన్యంగా మెలగుతుంటారు. ఆ పిల్లలు ఆటపాటల మధ్య హాయిగా తోటి పిల్లల మధ్య ఎదుగుతారు. ఒక శిశువుకు ఆటబొమ్మలు అత్యంత ఆనందాన్నిస్తాయి. ఒక కప్పు, మూత, డబ్బా, ఒక రెమ్మ... దేన్ని చూసినా ఒక కొత్తదనం... దేనినైనా విలువైనదిగా చూడటం గమనిస్తాం. ప్రతిదాన్నీ రెట్టించిన ఉత్సాహంతో పరిశీలించడం వారిలో అంతర్గతంగా ఉండే ఆసక్తిని తెలుపుతుంది. ఎక్కడో, వయసురీత్యా ఎదిగేక్రమంలో ఈ గుణం జారిపోతుంది. కొద్దిమంది మాత్రమే ఈ సామాజిక విషయాలను లెక్కచేయకుండా సంకెళ్లను తెంచుకుంటారు.

మనిషి తనలోని ఆ శిశువుతో సంబంధం తిరిగి ఏర్పరచుకోవాలి. శిశువులా ఉంటూ కార్యసాధకుడిగా మారడమనేదే అసలైన సవాలు. ప్రతి ఒక్కరిలో ఆ శిశువు జీవిస్తూనే ఉంటాడు.

పిల్లలకు కోపం వస్తుంది. అత్యాశా ఉంటుంది. దానిమీదే వ్యక్తిత్వం రూపుదిద్దుకొంటుంది. ‘నాది’ అన్న స్పృహ బయలుదేరుతుంది. ఆటవస్తువును తీసుకుంటే, తన ప్రాణాన్నే లాగేసుకున్నట్లు ప్రవర్తిస్తాడు ఆ పసివాడు. ఏడుస్తాడు... కేకలు పెడతాడు... గంటల తరబడి బొమ్మలతో ఆడుకుని వాటిని పిల్లలు అలాగే ఎక్కడివక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వాటిని వెంట తీసుకుపోరు. వారి అంతరంగం అందమైనది, స్వచ్ఛమైనది.

కుటుంబం అనేది పిల్లల జీవితంలో కేంద్ర బిందువు. అనేక సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలతో ఎంత సమయం గడిపారు అన్నదానికంటే, ఏ రకంగా గడిపారన్నది ముఖ్యం. అన్యోన్యత, ఆత్మీయతల్లాంటివి వారి జీవితాల్లో మంచి ప్రభావాన్ని కలిగిస్తాయి.

శిశువు ఒక వస్తువు కాదు... స్వాధీనపరచుకోవడానికి. ‘ఈ బిడ్డ నా బిడ్డ’ అని చెప్పడం అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడమే. జీవితాన్ని సొంతం చేసుకోవడం అనేది ఉండదు. పిడికిళ్లు బిగిస్తే జీవితం తప్పించుకుపోతుంది. శిశువు ఎదుగుదలను అర్థం చేసుకుంటే ఎన్నో సత్యాలు బోధపడతాయి.  తల్లిదండ్రులు పిల్లల్ని కనగలరు గానీ, వారి భవిష్యత్తును కాదు. పెద్దలు తమ పనికిమాలిన పైత్యాన్ని వారిపై రుద్దకూడదు. తెలియనిదాని కోసం చేసే వారి అన్వేషణకు అడ్డుతగలకూడదు. పెద్దలు ‘నిన్న’కు చెందినవారైతే, వారు ‘రేపటి’ వారసులు. మురిగిపోయిన వారసత్వాన్ని వారికి అందించకుండా ఉంటే, అదే గొప్ప మేలు. ప్రతి శిశువూ భిన్నమైన పుష్పం. అన్నీ కలిసినప్పుడు ఈ ప్రపంచం ఒక అందమైన వనం!

మంత్రవాది మహేశ్వర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు