హంసగీతి

భారతీయ పురాతన వాఙ్మయాల్లో హంసలకొక ప్రత్యేక స్థానం ఉంది. వైదిక సరస్వతీ నది భారతదేశంలో ప్రవహిస్తున్నంతకాలం, ఆ నదిలో తిరుగాడుతూ తెల్లని హంసలు కనపడేవని స్కందపురాణంలోని కౌమారీ ఖండం చెబుతోంది.

Published : 08 Mar 2023 00:32 IST

భారతీయ పురాతన వాఙ్మయాల్లో హంసలకొక ప్రత్యేక స్థానం ఉంది. వైదిక సరస్వతీ నది భారతదేశంలో ప్రవహిస్తున్నంతకాలం, ఆ నదిలో తిరుగాడుతూ తెల్లని హంసలు కనపడేవని స్కందపురాణంలోని కౌమారీ ఖండం చెబుతోంది. భూలోకానికి హంసలు నారదుడి వెంట వచ్చాయని అంటారు. నారదుడు బ్రహ్మ మానసపుత్రుడైనందువల్ల తండ్రి వాహనంగా ఉన్న హంస కుటుంబంలోని రెండు హంస జంటలు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ని చూడటానికి ఆ రుషి వెంట వచ్చాయన్నది పురాణ గాథ. అలా భూమిపై హంసలు వృద్ధి చెందాయని అంటారు. అంతరిక్షంలో ఎగురుతున్నప్పుడు, నదుల్లో జలకాలు ఆడుతున్నప్పుడు హంసలు కోయిలలా గానం చేసేవని హంసోపనిషత్తు వెల్లడిస్తోంది. ఆ గానాన్ని హంసధ్వని అనేవారు. విచిత్రం ఏమంటే హంసధ్వని రాగానికి మధ్యమం గాని దైవతం గాని లేవు. ఇప్పటికీ ఈ రాగం అదే రీతిలో కొనసాగుతోంది. సామాన్యంగా పార్వతీ నందనుడైన విఘ్నేశ్వరుణ్ని స్మరించేందుకు ఈ రాగాన్ని వినియోగిస్తారు. సంగీత త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్‌ రచించిన వాతాపి గణపతిం భజే కీర్తన హంసధ్వని రాగంలోనే ఉంది. త్యాగరాజుల వారి ‘రఘునాయక నీ పాద యుగ రాజీవముల నే విడజాల’, ‘శ్రీ రఘుకులమందు  బుట్టి నీవు సీతను చేకొనిన రామచంద్ర’ కీర్తనలు హంసధ్వని రాగంలోనివే!

హంసకు మానవుడికన్నా రెండు ఇంద్రియాలు ఎక్కువని అంటారు. అందుకే మనిషిలోని పంచేంద్రి యాలను అధిగమించినవాడిని హంస అనే బిరుదుతో గౌరవిస్తారు. ఈ స్థితిని సైతం మించిన జ్ఞానం సంపాదించిన వ్యక్తిని పరమహంస అంటారు.

జ్యోతిషశాస్త్రంలో సైతం హంస వైదిక జ్ఞానానికి సంకేతం. ఈ శాస్త్రంలో వ్యవహరించే పంచ మహా పురుష యోగాల్లో హంస యోగానికి అత్యంత ప్రాముఖ్యం ఉందని శాస్త్రం చెబుతోంది. ఈ యోగం జన్మతః ఉన్నవాడు మహాజ్ఞాని అవుతాడని చెబుతారు. సిద్ధార్థుడు జన్మించినప్పుడు అతడి జాతకం పరిశీలించిన జ్యోతిష్కులు ఆ శిశువుకు హంసయోగం ఉందని తండ్రి శుద్ధోధనుడికి చెప్పారట. వివాహం తరవాత యౌవనంలోనే సిద్ధార్థుడు పరివ్రాజక జీవితం గడపడానికి సంసార లంపటం నుంచి మహాభినిష్క్రమణం చేశాడు. హంసయోగం వల్లే సిద్ధార్థుడు సర్వార్థసిద్ధుడయ్యాడని బౌద్ధ సాహిత్యం తెలుపుతోంది.

కాళిదాసు రాసిన రఘువంశంలో సైతం హంస గురించిన ప్రస్తావన ఉంది. నల దమయంతుల అపూర్వ ప్రేమ గాథలో హంస సందేశం ఒక మనోహర ఘట్టం. ఈ ప్రబంధంలో హంస సందేశాన్ని మనోజ్ఞమైన భావనగా కవులు వర్ణిస్తారు.

హంస అంటే ఆత్మకు సంకేతమని గరుడ పురాణం చెబుతోంది. ఆత్మను పరమాత్మతో సంలీనం చేసినవాడే పరమహంస. కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, అద్వైత తత్త్వవేత్త సదాశివ బ్రహ్మేంద్ర రాసిన ఆత్మానుసంధానంలో శ్వాసను హంసతో పోల్చారు. ప్రాణాయామం కారణంగా కుండలినీ శక్తి ఉద్దీపన చెంది ఆత్మానుసంధానం అవుతుందని రాశారు.

అప్పరుసు రమాకాంతరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని