మహాత్ములు

లోకంలో అనేక విధాలుగా గొప్ప గుణాలతో కూడినవారిని మహాత్ములు అనడం పరిపాటి. ఏ మనిషి అయినా మహాత్ముడు కావచ్చు. అందరూ మెచ్చుకొనేలా కీర్తిని గడించవచ్చు. అయితే అలాంటి గొప్పతనాన్ని పొందాలంటే లోకానికి ఉపకరించే ఎన్నో పనులు చేయాలి.

Updated : 10 Mar 2023 05:10 IST

లోకంలో అనేక విధాలుగా గొప్ప గుణాలతో కూడినవారిని మహాత్ములు అనడం పరిపాటి. ఏ మనిషి అయినా మహాత్ముడు కావచ్చు. అందరూ మెచ్చుకొనేలా కీర్తిని గడించవచ్చు. అయితే అలాంటి గొప్పతనాన్ని పొందాలంటే లోకానికి ఉపకరించే ఎన్నో పనులు చేయాలి. భోగమయ జీవితాన్ని కాకుండా త్యాగమయ జీవితాన్ని గడపాలి. మనిషికి భగవంతుడు ఇచ్చిన జన్మ మంచిపనులు చేయడానికే. పుట్టడం, పెరగడం, పొట్ట నింపుకోవడం, చావడం అనేవి ఏ ప్రాణికి అయినా సహజమే. పుట్టుకకు గల పరమార్థం ఏమిటో తెలుసుకునే వివేచనాశీలం మానవుడికే ఉంది. కనుక అన్ని ప్రాణులకంటే విశిష్టమైన ప్రాణి మానవుడే. అలాంటి మానవుడు మహాత్ముడిగా మారి, చివరికి మాధవుడు కావడమే మానవజన్మకు పరమార్థం.

మహాత్ములను గురించి కవులు అనాదిగా ఎన్నో వర్ణనలు చేశారు. వారి గొప్పతనానికి కవితా హారతులు పట్టారు. వారి గుణ గణాలను వేనోళ్ల కీర్తించారు. చరి త్రలో నిలిచిపోయేలా కావ్యాలు రాశారు. కవులు వర్ణించిన మహా త్ములు నేడు లేకపోవచ్చు. కానీ వారి స్మృతులు మిగిలి ఉన్నాయి. వారి చరిత్రలు పాఠ్యాంశాలైనాయి. వారి ఆదర్శాలు అద్దాల్లా ప్రతి బింబిస్తున్నాయి. మహనీయుల జీవి తాలు ఎప్పటికీ తెరచిన పుస్తకాలే.

మహాత్ములు స్వర్గం నుంచి ఊడిపడరు. భూమిపైనే అందరి మధ్యనా ఉంటారు. వారు అందరి క్షేమంకోరి, విశ్వకల్యాణంకోసం పనిచేస్తారు. సాదాసీదాగా కనిపిస్తూ అసాధారణమైన సేవలు చేస్తారు. మహాత్ములు సంపదల కోసం వెంపర్లాడకుండా మంచి పనులు చేయడానికి పూనుకొంటారు. తోటిప్రాణుల ఆర్తికి స్పందిస్తారు. ఆకలి తీరుస్తారు. చేయూతనందిస్తారు. అలాంటి మంచి పనులు చేసినప్పుడు తమకు ఎన్నో ఆటంకాలు ఎదురుకావచ్చు. కష్టాలు రావచ్చు. నష్టాలు కలగనూవచ్చు. అయినా భయపడకుండా తాము తలపెట్టిన సేవను వదిలిపెట్టరు. అదే వారిలోని ధీర లక్షణం.

మనిషి బతుకు అమూల్యం. తాను బతికే నూరేళ్ల స్వల్పకాలంలో సమాజానికి కొంతైనా సేవ చేయాలనే ఆశయం మహాత్ములకు దృఢంగా ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకోకుంటే మిగిలేది ఏమీ ఉండదు. లోకంలో ఎందరో పుడుతున్నారు. చస్తున్నారు. అందరికీ అమూల్యావకాశం లభించదు. మనిషి వివేచనాశీలం అతణ్ని మంచివైపు నడిపిస్తుంది. గంగానదిలో స్నానంచేస్తే పాపం పోతుందంటారు. వెన్నెలలో విహరిస్తే శరీరతాపం తగ్గుతుందంటారు. కల్పతరువును ఆశ్రయిస్తే అన్నీ లభిస్తాయని అంటారు కానీ, మహనీయులను ఆశ్రయిస్తే ఈ మూడూ ఒకేచోట లభిస్తాయని ఒక ప్రాచీనకవి అంటాడు. మహాత్ములు దారిలో కనిపించే చెట్లవంటివారు. బాటసారులకు చల్లని నీడను ఇస్తారు. ఆకలి అయినవారికి తీయనిపండ్లు ప్రసాదిస్తారు. తాము ఎండకు మండిపోతూ కూడా తమను ఆశ్రయించినవారికి సేద తీరుస్తారు. రాళ్లతో కొట్టినా సహిస్తారు. పూలను అందరికీ పంచుతారు. ఇదీ మహాత్ముల నైజం.
మనిషి జీవితకాలం అతిస్వల్పం. దాన్ని సత్కర్మలతో అనల్పంగా మార్చుకోవాలి. మరణం ఎప్పటికైనా తప్పదు. కానీ మరణించేలోగా ఎందరి జీవితాలను ఆనందమయం చేశామనేదే మనిషి బతుకుకు గీటురాయి!

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని