మంచిగంధపు పరిమళం

మనకు గానీ ఇతరులకు గానీ ఏది హాని చేయదో అది మంచి.  ఎటువంటి ప్రవర్తన వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుందో అది మంచితనం. ఇతరులు ఏమి చేస్తే మనకు బాధ కలుగుతుందో అది ఇతరులకు మనం చేయకుండా ఉండటమే సత్ప్రవర్తన అని శాంతిపర్వంలో తిక్కన చక్కగా చెప్పారు.

Published : 01 Dec 2023 00:19 IST

నకు గానీ ఇతరులకు గానీ ఏది హాని చేయదో అది మంచి.  ఎటువంటి ప్రవర్తన వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుందో అది మంచితనం. ఇతరులు ఏమి చేస్తే మనకు బాధ కలుగుతుందో అది ఇతరులకు మనం చేయకుండా ఉండటమే సత్ప్రవర్తన అని శాంతిపర్వంలో తిక్కన చక్కగా చెప్పారు. సృష్టిలో ఏ జీవికీ కీడు చేయనిదైతే అది ఉత్తమోత్తమమైన మంచితనంగా స్వీకరించాలి.

మంచి ఎప్పుడూ మన్ననలు పొందడం,  చెడు ఛీత్కారం పాలవడం లోక సహజం.  ప్రపంచంలోని అన్ని మతాలు, ధర్మాలు మంచితనం ప్రాముఖ్యం గురించి చెబుతూనే ఉన్నాయి. అయినా మంచి దినదిన ప్రవర్ధమానమైపోలేదు. చెడు తోక ముడిచి పారిపోలేదు.

మనిషిలో మంచితనాన్ని పెంపొందించడానికి ఆధ్యాత్మిక భావన చాలా తోడ్పడుతుంది. మానవ ఇచ్ఛా ప్రవృత్తిని నియంత్రించడంలో చట్టం మొదలైనవాటి కంటే దైవభక్తి, పాపభీతి మెరుగైన ఫలితాలు సాధిస్తాయి. అందుకే లోకంలో మంచితనం కొంచెమైనా మిగిలి ఉంది. పరుల మేలే తన మేలుగా భావించడం విశ్వజనీనమైన భావన. ఒకరికి మంచి చేయడమంటే పరోక్షంగా తనకు తాను మేలు చేసుకోవడమే.

లోకంలో మనుషులందరూ ఒకేలా ఉండరు. అది లోక సహజం కూడా.  ఒకరు తమ స్వభావ రీత్యా మనకు హాని చేయవచ్చు. దానికి ప్రతిచర్యగా మనం తిరిగి అటువంటివారికి హాని తలపెట్టకూడదు. అలా చేస్తే వారికి, మనకు తేడా ఏముంటుంది? పగ పగతోను, కక్ష కక్షతోను నశించవు. మంచితనంతో శత్రువుల దురాలోచనలను సైతం మార్చవచ్చు. మంచితనం మానవ సమాజం నుంచే  వృద్ధి చెందుతుంది.

మనిషి చేసే ఏ పనికైనా మనసే మూలకారణం. మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి. శరీరాన్ని ఎలా అయితే ప్రతి నిత్యం స్నానాదులతో పరిశుభ్రం చేసుకుంటామో, అలాగే మనసునూ పరిశుభ్రం చేసుకోవాలి. మనసులో పుట్టే దురాలోచనలను మొగ్గలోనే తుంచివేయాలి.  మెదడులో జనించే ఆలోచనలను బుద్ధి అనే గీటురాయి మీద పరీక్షించి ఉత్తమ ఆలోచనలను సాగుచేయాలి. ఇటువంటి సాధనకు ప్రశాంతమైన మనసు అవసరం. పరిపక్వతతో కూడిన బుద్ధికుశలత ముఖ్యం. అంతకు మించి రాగద్వేషాలకు అతీతమైన మనసు ఉండాలి. పుట్టుకతోనే ఎవరికీ పరిపూర్ణమైన  మంచితనం అలవడదు. నాటిన రోజు నుంచి ఎదుగుతూ మొక్క ఎలా ఫలవంతం అవుతుందో అలాగే మనిషీ తనలో మంచి స్వభావాన్ని పెంచుకుంటూ ఎదగాలి. ఒక మనిషి  పుట్టి పెరిగిన వాతావరణం అతడి మంచితనం మీద  చాలా  ప్రభావాన్ని చూపుతుంది. అలాగే కుటుంబ నేపథ్యం కూడా.  వ్యక్తులు మంచితనం పాలు ఎక్కువగా ఉన్న పరిసరాల్లో  పెరిగితే, వారిలో  ఏ కొంచెమో ఉన్న దుర్గుణాలు క్రమంగా దూరమవుతాయి.

నీటికి  దాహాన్ని  తీర్చే  గుణం  ఉన్నట్టు మనిషి లోలోపల ఎదుటివారికి సహాయపడే మంచితనం ఉండాలి. అవసరమైనప్పుడు సాటివారికి  చేయూతనివ్వడం ద్వారా లోకంలో మంచితనాన్ని ఇనుమడింప చేయగలగాలి.

మంచిని పంచడంలో ఎటువంటి ప్రతిఫలాపేక్షా ఉండకూడదు.

మంచితనం నిజాయతీతో కూడినదై ఉండాలి. అటువంటిది దోష రహితంగా ఉంటుంది. అలాంటి మంచితనమే సార్వకాలికమై నిలుస్తుంది. అప్పుడే మంచితనం మంచిగంధమై పరిమళిస్తుంది.

 డాక్టర్‌ బండి సత్యనారాయణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని