దేవుడికి ధన్యవాదాలు!

ఎవరి ఆజ్ఞను శిరసా వహించి సూర్యుడు తన కక్ష్యలో తిరుగుతూ కాంతినిస్తున్నాడు? ఎవరి సంకల్పాన్ని అనుసరించి చంద్రుడు వెలుగునిస్తున్నాడు? ఎవరి శాసనాన్ని తలదాల్చి భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తూ జీవకోటిని భరిస్తున్నది? ఇటువంటి ప్రశ్నలెన్నో మనకు కలుగుతుంటాయి.

Updated : 02 Dec 2023 00:58 IST

ఎవరి ఆజ్ఞను శిరసా వహించి సూర్యుడు తన కక్ష్యలో తిరుగుతూ కాంతినిస్తున్నాడు? ఎవరి సంకల్పాన్ని అనుసరించి చంద్రుడు వెలుగునిస్తున్నాడు? ఎవరి శాసనాన్ని తలదాల్చి భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తూ జీవకోటిని భరిస్తున్నది? ఇటువంటి ప్రశ్నలెన్నో మనకు కలుగుతుంటాయి. వీటికి సమాధానం ఒక్కటే- పరమేశ్వరుడని, అతడే ప్రకృతి శక్తులనన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకొని కట్టడి చేస్తాడని; అతడే నియామకుడని.

ఈ శక్తి ఎక్కడినుంచి వచ్చిందోగాని, ఆయనను మాత్రం మనం సర్వశక్తిమంతుడని భావించవలసిందే. ఆయన జ్ఞానం హెచ్చుతగ్గులు లేనిది కనుక సర్వజ్ఞుడని ఒప్పుకోవలసిందే. పరమాణువులోనూ ఆయనే ఉన్నాడు కనుక సర్వవ్యాపకుడని నిశ్చయించవలసిందే!

పరమేశ్వరుడి అపార శక్తిని ఊహించలేం కనుక... ఊహాతీతుడు. జ్ఞానాన్ని కొలువలేం కనుక ఆయన అప్రమేయుడు. గుణగణాలివీ అని చెప్పలేం కనుక అతడు వర్ణనాతీతుడు. పరమేశ్వరుడు ఎల్లప్పుడుంటాడు కనుక సనాతనుడు. శాశ్వతమైన ఉనికి కలిగినవాడు కనుక సత్‌ స్వరూపుడు. ఆనందమే లక్షణం కనుక ఆనంద స్వరూపుడు. ఎన్నో విధాలైన సుగుణాలున్నప్పటికీ ఆయన అనిర్వచ నీయుడు, సమానుడెవ్వడూ లేడు కనుక అద్వితీయుడు.

పరమేశ్వరుడు మనకు మనసిచ్చాడు. కాని అతడు మనసుకందడు. నేత్రాలిచ్చాడు కాని, నేత్రాలకు కనిపించడు. వాక్కును అందిం చాడు కాని వాక్కుతో ఊహకందడు. చేతులిచ్చాడు కాని మన చేతులాయనను పట్టుకోజాలవు. పాదాలిచ్చాడు కాని మన పాదాలతణ్ని చేరలేవు. పరమేశ్వరుడే మనకు జన్మతోపాటు ఆయుష్షును, సుఖ దుఃఖాలనిచ్చాడు. అంతే కాదు- మోక్షప్రదాత కూడా అతడే. మరి మోక్షాన్ని ఇచ్చినవాడే మనల్ని సంసార బంధనాల్లో ఇరికిస్తున్నాడా? మన బంధనానికి పరమేశ్వరుడు కారణం కాడని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును ఇచ్చిన పరమేశ్వరుడే కర్మలు కూడా అంటగట్టినాడా? మన కర్మలకు పరమేశ్వరుడు ఎంతమాత్రం బాధ్యుడు కాడని భగవద్గీత స్పష్టం చేస్తుంది.

అన్నింటినీ శాసించే పరమేశ్వరుడు, అన్నింటినీ నియమించే పరమేశ్వరుడు మనం చేసే వాచిక, మానసిక, కాయిక కర్మలకు బాధ్యుడు కాడు. మనం కర్మలకు కర్తలం. కర్మఫలాలకు భోక్తలం. మరి పరమేశ్వరుడేం చేస్తాడంటే, మనం చేసే కర్మలకు ఫలాలిస్తాడు. కనుక అతణ్ని సర్వకర్మఫలప్రదాత అంటాం.

సంసార వృక్షానికి ఫలం మోక్షం. ఆ గొప్ప ఫలాన్ని ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడే. పరమేశ్వరుడు మన కర్మలకు సాక్షీభూతుడిగా ఉంటాడు కాని, ఏ వృత్తులనూ మనకంటగట్టడు. ఈ పని చేయండి- అని పరమేశ్వరుడే మనల్ని ఆజ్ఞాపిస్తే, దాని ఫలం మనం అనుభవించవలసిన పని ఉండదు. అతడు కర్మలంటనివాడు కదా!

ఇంత గొప్ప ప్రపంచాన్ని నిర్మించి, ప్రకృతి శక్తులను శాసించి, జీవకోటికి ఉపయోగకరమైన రీతిలో పంచభూతాలను నియమించిన పరమేశ్వరుడు కర్మల విషయంలో మనల్ని స్వతంత్రులను చేసినందుకు ఆయనకు ధన్యవాదాలర్పించక తప్పదు.

ఆచార్య మసన చెన్నప్ప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని