సంకల్ప సిద్ధి

కార్యారంభంలో చాలామందికి ఉదయించే ప్రశ్న- చేపట్టే పని సఫలమవుతుందా లేక కార్యభంగం జరిగి, సమస్యలు ఎదురై అపకీర్తి పాలవుతామా అని. అర్థరహితమైన సందేహాలు క్షణక్షణం ఎదురై మనోబలాన్ని బలహీనపరుస్తాయి.

Published : 05 Dec 2023 00:43 IST

కార్యారంభంలో చాలామందికి ఉదయించే ప్రశ్న- చేపట్టే పని సఫలమవుతుందా లేక కార్యభంగం జరిగి, సమస్యలు ఎదురై అపకీర్తి పాలవుతామా అని. అర్థరహితమైన సందేహాలు క్షణక్షణం ఎదురై మనోబలాన్ని బలహీనపరుస్తాయి. కార్యనిర్వహణ పట్ల అవగాహనా లేమి, స్వశక్తిపై అపనమ్మకమే దీనికి కారణం. సంకల్పం బలంగా నిలిస్తే ఎలాంటి సందేహాలనైనా తరిమికొట్టవచ్చు. భయం, పిరికితనం ఎంతటి బలవంతుడినైనా భీరువుగా మారుస్తాయి. అసాధారణ వ్యక్తి సైతం అతి సామాన్యుడిగా ప్రవర్తిస్తాడు. స్వశక్తిని మరచి బెంబేలుపడతాడు. అలాంటి తరుణంలో వెన్నుతట్టి నడిపించే అండ కావాలి. నేనున్నాననే తోడు లభించాలి. రణరంగంలో అశక్తుడైన అర్జునుడికి మార్గం చూపించిన పరమాత్మ అలాంటి అండ. కార్యసాధనకు బలమైన పునాది అచంచల విశ్వాసం. అడుగడుగునా అడ్డుతగిలే అపనమ్మకమనే ముళ్లను, రాళ్లను దాటుకుంటూ ముందుకు సాగాలి. గాఢాంధకారంలోనూ నిర్భయంగా నడిపించే దివిటీ- నమ్మకం. ఈ కార్యాన్ని నేను నెరవేర్చగలననే విశ్వాసం ఎవరినైనా విజేతగా నిలబెడుతుంది. ఆత్మవిశ్వాసం తోడుగా, తిరుగులేని సంకల్పం నీడగా ముందుకు సాగితే కఠినమైన యాత్ర సైతం కడు సులభంగా సాగి గమ్యాన్ని చేరుస్తుంది. నమ్మకానికి ఏకాగ్రత మంచి మిత్రుడు. స్వాగతం పలకాలి. నెరవేరే కార్యానికి ఓర్పు, నేర్పు, సంయమనం ఆత్మబంధువులు. దరిజేర్చుకోవాలి. స్థిరచిత్తానికి, సహనానికి పరమశత్రువు తొందరపాటు. దాన్ని దూరం తరిమెయ్యాలి. కాదని జతకడితే విజయం అందనంత దూరంలో కనిపించే ఎండమావే.

సంకల్ప రథాన్ని అధిరోహించి నిర్దేశిత లక్ష్యంతో సూటిగా పయనిస్తే జటిలమైన కార్యమూ జరిగి తీరుతుంది. రామరావణ యుద్ధంలో వానరసేనపై విజృంభిస్తున్న ఇంద్రజిత్తును చూసి కోపావేశంతో రగిలిపోయాడు లక్ష్మణుడు. అతడి సంకల్పం ఒక్కటే. శత్రువును ఎలాగైనా జయించాలి. అందుకు బ్రహ్మాస్త్ర ప్రయో గమే సరైందని భావించి రాముడికి చెప్పాడు. శత్రువును నిర్జించాలన్న నీ సంకల్పం అమోఘం. పూర్ణ విశ్వాసంతో గడ్డిపరకను ప్రయోగించినా అది బ్రహ్మాస్త్రమే. ఆలోచించు అన్నాడు. రామ సేవికుడైన లక్ష్మణుడు అన్నను ప్రార్థించి ఒక సాధారణ అస్త్రాన్ని ప్రయోగించాడు. అదే బ్రహ్మాస్త్రంలా ఇంద్రజిత్తు ప్రాణాలను హరించింది. రామానుజుడి విశ్వాసమే అతణ్ని విజేతను చేసింది.

సంకల్పం గొప్పదైతే గడ్డిపరక కూడా గడ్డపార అవుతుంది. బలహీనుడు కూడా బండరాయిని పెకలించి విసిరిపారేస్తాడు. అసాధ్యమనే మాటకు అర్థం ఉండదు. సంకల్ప బలంతో ఆకాశం అంచుల్ని, సముద్రపు లోతుల్ని కొలవవచ్చు. ప్రయత్నించాలి, పట్టుపట్టాలి, చివరికి సాధించాలి. అనుకోని రీతిలో పరాజయాలు ఎదురైనా బెదరక అవి తాత్కాలికమని భావించి మళ్ళీ ప్రయత్నించాలి. కార్యసాధకుడికి ఆశ ఆరోప్రాణం. గమ్యాన్ని చేర్చగలిగే ప్రాణవాయువు. భవిష్యత్తుకు బంగరుబాటలు పరచే ఆశ కొత్త ఊపిరులిస్తుంది. గెలుపు అందలంలో ఊరేగిస్తుంది. విజయానికి ముందు అపజయం సర్వసహజమే అన్న భావన మదిలో స్థిరపడితే ఎదురుపడే పరాజయం దూదిపింజలా తేలికైపోతుంది. సులభంగా దాన్ని దాటగలమనే విశ్వాసం మనసును గట్టిపరుస్తుంది. సంకల్పాన్ని స్థిరపరుస్తుంది. గొప్ప నిర్ణయానికి పునాది పడుతుంది.

సీతాన్వేషణ సమయంలో సీత జాడ కనుగొనక హనుమ నిర్వేదానికి గురవుతాడు. తనకు తానే ధైర్యాన్ని నింపుకొని మరింతగా ప్రయత్నించి కార్యసాధకుడవుతాడు. అందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు. బలమైన నిర్ణయం బలమైన ఆశయాన్ని తప్పక నెరవేరుస్తుంది. ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలచుకొనేవారికి, దుఃఖపడక సానుకూల దృక్పథంతో దూసుకుపోయేవారికి విజయం చేతికి అందే తియ్యని పండు అని సుందరకాండ మహోత్కృష్ట సందేశాన్ని మనకందించింది.

మాడుగుల రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని