ఏది సుపరిపాలన?

ప్రజాపాలన ఒక అసిధారావ్రతం. అంటే కత్తి మీద సాము చేయడం వంటిది. అధికారంలో ఉన్నప్పుడు ‘ఆహా! ఓహో’ అని పొగిడేవారు, అధికారం పోయినప్పుడు ఛీ కొడతారు. ప్రజల మన్ననలు ఎల్లకాలం ఎవరి మీదా స్థిరంగా ఉండవు. కాలానుగుణంగా మారుతుంటాయి.

Published : 07 Dec 2023 00:05 IST

ప్రజాపాలన ఒక అసిధారావ్రతం. అంటే కత్తి మీద సాము చేయడం వంటిది. అధికారంలో ఉన్నప్పుడు ‘ఆహా! ఓహో’ అని పొగిడేవారు, అధికారం పోయినప్పుడు ఛీ కొడతారు. ప్రజల మన్ననలు ఎల్లకాలం ఎవరి మీదా స్థిరంగా ఉండవు. కాలానుగుణంగా మారుతుంటాయి. కనుక ప్రజలను పాలించే ప్రభువులు ఎంతో జాగరూకతతో వ్యవహరించాలి.

అధికారం రాగానే పాలకులకు ఉన్మాదం తలకెక్కుతుందనడానికి నహుషుడి కథ ఉదాహరణ. వంద అశ్వమేధయాగాలు చేసి ఇంద్ర పదవిని పొందిన నహుషుడు అధికార పీఠాన్ని అధిరోహించడం కోసం పల్లకిలో తనను మహర్షులే మోసుకొని వెళ్ళాలని కళ్లు నెత్తికెక్కి ఆదేశించిన పర్యవసానంగా అతడొక కొండచిలువగా మారి భూమిపై ఒక నిర్జనారణ్యంలో పడిపోయాడు. అగస్త్యమహర్షి శాపం అధికారచ్యుతికి కారణమై, అధోగతి పాలుచేసింది. కనుక పాలకులు అధికారమదాన్ని పరిత్యజించాలి. తానొక సామాన్య సేవకుడినేనని భావించాలి. లేకుంటే పుట్టగతులుండవు.

బాణభట్టు రచించిన కాదంబరి మహాకావ్యంలో యువరాజుగా చంద్రాపీడునికి పట్టాభిషేకం చేసే ఘట్టంలో రాజగురువైన శుకనాసుడు- ‘నాయనా చంద్రాపీడా! నీవు చేపట్టబోతున్న ఈ అధికార పదవి అనేక దుర్గుణాలను నీకు అలవాటు చేస్తుంది. అభిషేక జలాలతోనే నీలోని ఉత్తమ గుణాలన్నీ కడిగివేసినట్లు వెళ్ళిపోతాయి. నీ చుట్టూ ధూర్తులు చేరి, నిన్ను అన్ని విధాలా వాడుకొని, పక్కదారి పట్టిస్తారు. నీవు వాటికి లొంగిపోయావంటే నీకు అధోగతి తప్పదు. కనుక అప్రమత్తుడవై, విజ్ఞతతో రాజ్యపాలన నిర్వర్తించు’ అంటాడు.

నేటికాలంలో ఇలా హెచ్చరించే గురువులున్నారా? ఉన్నా వారు చెప్పే మాటలు అధికారదర్పసర్పదష్టులైన పాలకులకు వినబడతాయా? వినబడినా గురువులపై భక్తితో ఆచరిస్తారా అంటే- అనుమానమే.

కాళిదాస మహాకవి తన రఘువంశ మహాకావ్యంలో రఘువంశ రాజుల ప్రజాపాలన వైభవాన్ని వర్ణిస్తూ- ‘ప్రజల్లో వినయాన్ని, రక్షణను, పోషణను నిరంతరం నెరవేర్చిన కారణంగా రఘువంశరాజులు ప్రజలకు కన్నతండ్రులయ్యారని, నిజమైన తల్లిదండ్రులు కేవలం జన్మకారకులు మాత్రమే అయ్యారు’ అంటాడు. దీన్ని బట్టి ప్రజల బాగోగులు చూడటం పాలకుల ప్రధాన కర్తవ్యమనే సత్యం స్పష్టమవుతోంది.

దండించవలసిన నేరస్థులను దండించకుండా, సాధుజనులను దండించే పాలకులకు అపఖ్యాతితోపాటు నరకం కూడా సంప్రాప్తిస్తుందని మనువు అంటాడు. ప్రజల సంతృప్తే తనకు ప్రధానమని, వారు సంతృప్తిగా జీవించడం కోసం స్నేహాన్ని, దయను, సౌఖ్యాలను, చివరికి సీతాదేవిని కూడా వదిలేయడానికి వెనకాడనని రాముడు ప్రతిజ్ఞ చేశాడంటే- ఒక పాలకుడికి ఎంత నిబద్ధత, త్యాగం ఉండాలో తెలుస్తుంది. సమాజం ఒక కల్పవృక్షం వంటిదని, దానినుంచి కాలానుగుణంగా అమృత ఫలాలను కోసుకోవడానికి పాలకుడు ప్రయత్నించాలని పరాశరస్మృతి చెబుతోంది. సమాజాన్ని పాలించడం చేతకాని పాలకుడు బొగ్గుల కోసం చెట్టునే తగలబెట్టే వ్యర్థజీవిగా మారతాడని నీతికోవిదుల మాట.

పాలకుడు తన పాలన యంత్రాంగాన్ని పారదర్శకంగా, నీతిమంతంగా నిలపడానికి అహర్నిశలూ కృషిచేయాలి. ప్రజాగ్రహాన్ని చవిచూడకుండా ఎంతో నియమనిష్ఠలతో పాలన కొనసాగించాలి. పాలకులే భక్షకులైతే ‘యథా రాజా తథా ప్రజాః’ అన్నట్లు ప్రజలూ వారినే అనుసరిస్తారు. కనుక పాలకులు తాము ప్రజారక్షకులుగా చరిత్రలో నిలిచిపోవాలో, ప్రజాభక్షకులుగా చరిత్రహీనులుగా మిగిలిపోవాలో తేల్చుకోవాలి.

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని