పారమార్థిక సత్యాలు

మానవ స్వభావం- సుఖం తప్ప దుఃఖాన్ని ఆమోదించనీయదు. సుఖదుఃఖాల మూలాలు ఉండేది అపారమైన తన కోరికలలోనని అతడు సామాన్య జ్ఞానంతో తెలుసుకోలేడు. ఆ పారమార్థిక సత్యం గ్రహించినప్పుడు జ్ఞానోదయమై అతడు మహనీయుడవుతాడు.

Published : 11 Feb 2024 00:53 IST

మానవ స్వభావం- సుఖం తప్ప దుఃఖాన్ని ఆమోదించనీయదు. సుఖదుఃఖాల మూలాలు ఉండేది అపారమైన తన కోరికలలోనని అతడు సామాన్య జ్ఞానంతో తెలుసుకోలేడు. ఆ పారమార్థిక సత్యం గ్రహించినప్పుడు జ్ఞానోదయమై అతడు మహనీయుడవుతాడు. సుఖదుఃఖాలు రెండింటిలో సంయమనం పాటిస్తూ భౌతిక జీవన గమనంపై నియంత్రణ సాధించుకోవడమెలాగో మనిషికి చెప్పడానికి భగవంతుడి మాటల్లోనే గీతోపదేశం జరిగింది. భౌతిక జీవనం జీవనది లాంటిది. అందులో ప్రవాహం ఆగిపోనంత కాలం ఎక్కడివరకు అది తీసుకువెళితే, దానితోపాటే సాగిపోవాలన్నది మనుషులు గ్రహించని మొట్టమొదటి జీవనసత్యం.

మనిషిలో జీవంపోసి భూమిపైకి పంపినప్పుడే అక్కడ అతడు జీవించడానికి భగవంతుడు అంతులేని అవకాశాలనూ సృష్టించాడు. కళ్ల ఎదుట కనబడుతున్నా అవి గుర్తించడానికి అతడు తడబడుతుంటాడు. జీవనమార్గంలో ఎదురవుతున్న ఎత్తుపల్లాలను తన అదృష్ట దురదృష్టాలతో సరిపోలుస్తూ విధిని, భగవంతుడిని అందుకు కారణంగా చూపిస్తాడు. మనిషి కార్యాచరణలన్నీ స్వయంకృతాలని అందుకు బాధ్యత అతడే వహించాలని గీతలో భగవంతుడు అన్నమాట అతడికి గుర్తురాదు.

జీవనగమనంలో ఎదురయ్యే ఏ చిన్న అడ్డంకినైనా మనిషి అదొక సమస్య అనుకుంటాడు. భగవంతుడి సృష్టిలో అవకాశాలు తప్ప సమస్యలుండవు. జీవం ఉన్నచోటనే సమస్యలు తలెత్తుతాయి. సమస్యలు ఎన్ని ఉంటే అక్కడ అంతగా జీవం ఉందని చెప్పడానికి అవి సంకేతాలు. మానసిక వైజ్ఞానికులు పరిష్కారం ఉండని సమస్యలే లేవంటారు. అది వెదకలేకపోవడమే మనిషికి ఉన్న నిజమైన సమస్య అని చమత్కరిస్తారు. చిరునవ్వుతో స్వీకరించగలిగినప్పుడు సమస్యల నుకున్నవి కనిపించవంటారు.

ఆదిశంకరులు మానవజన్మ దుర్లభమన్నారు. ఇహలోక జీవితం నేర్పుతున్న అనుభవాల పాఠాలు పునశ్చరణ చేసుకుని, అన్ని దృక్కోణాల నుంచి సమీక్షించుకుంటూ సాగినప్పుడు, భౌతిక ప్రపంచంలో సౌలభ్యం కానిదేదీ మనిషికి ఉండదు. ‘దైవత్వమే తనలో నిబిడీకృతమై ఉన్నప్పుడు మనిషి శక్తిహీనుడు ఎలాగ అవుతాడని ఆలోచించండి’ అని వివేకానందుడు అనేవారు. ఆత్మహత్యకు తెగబడుతున్న వారికి అర్థంకాని భౌతిక జీవనసత్యమది.

అవకాశాలను గుర్తించగానే చేజారిపోకుండా చూసుకోవలసిన బాధ్యత మనిషిదే అనేవారు అబ్రహాం లింకన్‌. దేశాధ్యక్ష పీఠం అధిరోహించడానికి అన్ని విధాలా అర్హుడినని తన సామర్థ్యానికి తగిన లక్ష్యం అదేనని భావించేవారు. ఆత్మవిశ్వాసాన్ని ఇంధనంగా తనలో నింపుకొని రాజకీయ జీవన ప్రస్థానం ప్రారంభించారు. ప్రాథమిక ఎన్నికలన్నింటిలో ఓటముల పరంపర వేధించినా ఆత్మన్యూనతకు లోను కాలేదు. పట్టుదలతో ప్రయత్నిస్తూ, చిట్టచివరకు అనుకున్నట్లు అమెరికా అధ్యక్ష సింహాసనంపై కూర్చున్నారు. ఓటమిని అంగీకరించినవాడెప్పుడూ గెలవలేడు. గెలుపు ఓటములు శాశ్వతం కాదు. అవి ఒకే నాణానికి ఇరుపక్కలు. మనిషి జీవితం ప్రయోగశాల వంటిది. ప్రయత్నలోపం లేకుండా అక్కడ ప్రయోగాలు చేసుకుపోతుంటే ఫలితం ఆలస్యమైనా రాక మానదు.

భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలు భిన్నమైనవి కావు. అవి ఎగిరే పక్షికి రెండు రెక్కలవంటివి. ఆ రెక్కల్లో సమతుల్యం ఉన్నప్పుడు పక్షిలా ఎగిరి మనిషి భగవంతుణ్ని చేరుకోగల శక్తిమంతుడవుతాడు. భౌతిక జీవన సత్యాలను, భగవంతుడెవరో చెబుతున్న పారమార్థిక సత్యాలతో అనుసంధానించి లౌకిక జీవితాన్ని అర్థవంతంగా ముగిస్తాడు.  

జొన్నలగడ్డ నారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని