విడువదగినది విశ్వహయమే!

సృష్టిలో నిరంతరం అశ్వమేధయాగం జరుగుతుందని ఉపనిషత్తులు ప్రకటించాయి. అందుకే సృష్టిని అశ్వంతో పోల్చారు. అశ్వమంటే గుర్రమని మనకు తెలిసిన అర్థం. కానీ, తెలియని అర్థం ఒకటుంది. అన్నం లభించే చోటు అని దాని అర్థం. సామాన్యులు ఈ సృష్టిని అన్నం కోసం ఆశ్రయిస్తారు.

Published : 27 Feb 2024 00:20 IST

సృష్టిలో నిరంతరం అశ్వమేధయాగం జరుగుతుందని ఉపనిషత్తులు ప్రకటించాయి. అందుకే సృష్టిని అశ్వంతో పోల్చారు. అశ్వమంటే గుర్రమని మనకు తెలిసిన అర్థం. కానీ, తెలియని అర్థం ఒకటుంది. అన్నం లభించే చోటు అని దాని అర్థం. సామాన్యులు ఈ సృష్టిని అన్నం కోసం ఆశ్రయిస్తారు. అన్నం కోసం కష్టపడతారు. అన్నమే పరమావధిగా జీవిస్తారు. వారికి అన్నం తప్ప మరొక ఆలోచన ఉండదు. వారిని కష్టజీవులుగా లెక్కించవచ్చు. లోకంలో కేవలం సామాన్యులే లేరు. హింసకు పాల్పడేవారున్నారు. తోటి జీవులను బాధించకపోతే వారికి తృప్తి కలగదు. లోకాన్ని బాధించడానికే తమను దేవుడు సృష్టించాడనీ వారు భావిస్తారు. మరొక రకంవారున్నారు. వారు ఎప్పుడూ సుఖంగా ఉండాలని చూస్తారు. వారినే భోగజీవులంటారు. ఎవరేమైనా తమకేమిటని, తమ సుఖమే సుఖమని తలచేవారు భోగజీవులు. వారికి సామాన్యుల్లాగా కష్టపడటం తెలియదు. కష్టపడేవారిని, కష్టపెట్టేవారిని లెక్కచేయక, తమ సుఖాన్ని మాత్రమే చూసుకుంటారు. ఇంకొందరుంటారు... ఈ సృష్టి భౌతికమైంది, ఇదెంతకాలం మనల్ని సుఖపెట్టినా ఒకరోజు కనుమరుగవుతుంది, దీనితో మనకేమి పని అన్న నిస్పృహతో జీవించేవారు వీరు.

ఈ విధంగా ఈ సృష్టి కష్టపడేవారికి, కష్టపెట్టేవారికి, కష్టం అంటే తెలియనివారికి, సర్వసంగపరిత్యాగులకు ఆశ్రయమైంది. సృష్టి తత్త్వాన్ని తెలుసుకున్న ఋషులు- కష్టజీవులకు సృష్టి అశ్వమని, కష్టపెట్టే వారికి అర్వమని, భోగజీవులకు వాజి అని, జీవన్ముక్తులకు హయమని పేర్కొన్నారు. అశ్వమన్నా, అర్వమన్నా, వాజి అన్నా, హయం అన్నా- అన్నింటికీ గుర్రమనే అర్థం. కానీ, ఒక్కొక్క పేరు ఒక్కొక్క విలక్షణమైన అర్థాన్నిస్తుంది. అశ్వమంటే అన్నం దొరికే చోటు. అర్వమంటే హింసకు అనుకూలమైన చోటు. వాజి అంటే సుఖించడానికి వీలైన చోటు. ఇక హయమంటే హేయమని అర్థం. దానికి విడువదగిన చోటు అని అర్థం.

ఎందరెందరు అన్నం కోసం కష్టపడుతూ, సృష్టి అనే గుర్రాన్ని ఆశ్రయించినా, ఎందరెందరు సృష్టి అనే గుర్రాన్ని హింసించినా, ఎందరెందరు సుఖమే పరమావధిగా సృష్టి అనే అశ్వాన్ని అధిరోహించినా, ఒకరోజు సృష్టి అనే గుర్రాన్ని (హయాన్ని) తప్పక విడవాల్సిందేనని యోగుల భావన. సృష్టిని అశ్వం- అన్నం దొరికే చోటుగా అభివర్ణించిన ఋషులు, హయం అనడం వారి పారమార్థిక దృష్టిని తెలియజేస్తుంది.

ఎన్నాళ్లు గుర్రాన్ని ఎక్కి సవారి చేసినా ఒకనాడు దాన్ని విడవాల్సిందే. ఎన్నాళ్లు ఈ ప్రపంచాన్ని ఆశ్రయించినా ఒకనాడు దీన్ని త్యజించవలసిందే. కనుక మానవుడు ప్రపంచానికి హితకారి కావాలి కాని, అపకారి కారాదు. సృష్టిని కేవలం భోజనశాలగా భావించేవారు సాధారణ మానవులు. తోటిప్రాణులకు హాని చేసేవారు అసురులు. తాము సుఖంగా ఉంటే చాలునని విర్రవీగేవారు విలాసపురుషులు. ఎంతకాలం సృష్టి అనే గుర్రాన్ని అధిరోహించినా, ఒకరోజు తప్పక దాన్ని విడవాల్సిందేనని ముందుగానే ఊహించేవారు జ్ఞానులు. మనం అలాంటి జ్ఞానులం కావాలని ఉపనిషత్తులు ఉపదేశిస్తున్నాయి.

ఆచార్య మసన చెన్నప్ప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని