సమయమే సంపద

మనిషి తనకు ఇష్టమైన పని అయితే ఎంత సమయమైనా వెచ్చిస్తాడు. ఇష్టం కాని పనిని కష్టంగా భావించి అసలు సమయమే కేటాయించడు. జీవితం ఎంతో అమూల్యమైంది. సమయం అంతకు మించి విలువైంది.

Published : 01 Mar 2024 00:15 IST

నిషి తనకు ఇష్టమైన పని అయితే ఎంత సమయమైనా వెచ్చిస్తాడు. ఇష్టం కాని పనిని కష్టంగా భావించి అసలు సమయమే కేటాయించడు. జీవితం ఎంతో అమూల్యమైంది. సమయం అంతకు మించి విలువైంది. మనకు తెలియకుండానే క్షణాలు గడిచిపోతుంటాయి. మనం సంతోషం కోసం, ఆనందం కోసం వెదుకుతుంటాం. అది ధర్మబద్ధమైనదో, అలౌకికమైనదో అయితే మంచిదే. కేవలం భౌతికమైనదో, ఐహికమైనదో అయితే గడుపుతున్న సమయం గురించి ఆలోచించాల్సిందే! ఏ పనికి ఎంత సమయం కేటాయించాలన్న సమయజ్ఞతను ఎరిగినవాడే గ్రహించగలడు.

మనకు తెలియకుండానే అనేక సందర్భాల్లో కాలాన్ని వృథా చేస్తుంటాం. సంభాషణ ఎంత సంక్షిప్తంగా ఉంటే సమయం అంతగా సద్వినియోగమవుతుంది. విధ్యుక్త ధర్మ నిర్వహణలో కొందరికి సమయం సరిపోని మాట సత్యమే! అయితే ఎవరైనా మిగతా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో తమకు తాముగా ఆలోచించాలి. ఏ వ్యవహారాన్ని అయినా సమయాన్ని దృష్టిలో పెట్టుకునే ముగించుకోవాలి. మన జీవితంలో బాల్య, కౌమార, యౌవన, గృహస్థ, వృద్ధాప్య దశలనేవి అనివార్యం. ఈ దశల్లో దొరికే అవకాశాలను అందిపుచ్చుకొని నిర్ణీత సమయాలలో నిర్ణీత జీవన విధానాలను, విధులను అనుసరించాలి. ఏ దశలోనైనా విలువలకు, సంస్కృతీ సంప్రదాయాలకు, ధార్మిక నిబద్ధతకు సమయం ఇచ్చి తీరాలి. సమయాన్ని మించిన సంపద లేదు. సమయానికి ముందే ఒక్కొక్కప్పుడు పరుగెత్తాల్సి వస్తుంది. ఒక్కొక్కప్పుడు సమయంతో పాటు పరుగులు తీయాల్సి వస్తుంది. సమయాన్ని నియంత్రించుకోవడం వల్ల, సమయ నియంత్రణలోనే ఉండటం వల్ల విజయం సాధించగలం.

తాత్కాలిక భోగలాలసతకు, విలాసాలకు బానిసలైనవాళ్లు సమయాన్ని పట్టించుకోరు. జీవితంలోని అమూల్య క్షణాలను జారవిడుచుకుంటున్నామన్న సత్యాన్ని గ్రహించలేరు. వార్ధక్యంలో అటువంటివాళ్లకు మిగిలేది పశ్చాత్తాపమే.

‘కష్టాలొచ్చినప్పుడే కరుణా సింధువును శరణు వేడుతాం. సుఖశాంతులు ఉన్నప్పుడే, జవసత్వాలు ఉన్నప్పుడే జగత్పతిని స్మరిస్తే కష్టాలే రావు కదా!’ అంటాడు ప్రాచీన హిందీ భక్తకవి కబీర్‌దాసు. ఏ క్షణాన ఏ మార్పును చూస్తామో తెలియదని సాగర కెరటమే చెబుతోంది. ‘లెక్కించే వాటిలో కాలాన్ని నేను’ అన్నాడు గీతాచార్యుడు. మనిషి సర్వదా లక్ష్యపెట్టాల్సింది కాలాన్నే అని అర్థం. 

పూర్వం రుషులు, యోగులు, కవులు, అవధూతలు సమయాన్ని స్వాధీనంలో ఉంచుకోవడం వల్లనే జాతికి అమృతభాండంలాంటి జ్ఞాన భాండాగారాన్ని అందించగలిగారు. సమ్మతికైనా, దుర్మతికైనా ఒక క్షణం చాలు- యశోశిఖరాగ్రానికి చేరడానికి, అథఃపాతాళానికి పడిపోవడానికి. ఖ్యాతికి, అపఖ్యాతికి బీజం సమయమే.

లంకకు చేరిన హనుమ సీతాన్వేషణలోనే నిమగ్నమై తిరిగాడు తప్ప, లంకాపురి సౌందర్య వీక్షణానికి ఏ క్షణమూ వినియోగించలేదు. కాలం పాండవులను అరణ్య-అజ్ఞాత వాస బంధనాలతో కట్టి పడేసింది. అయినా ఆ సమయాన్ని వారు సద్వినియోగ పరచుకున్నారు. అది ధీరుల లక్షణం. సమయమే సర్వేశ్వర స్వరూపం. దాన్ని గౌరవించాలి. ప్రేమించాలి. పాలించాలి. పాటించాలి. ఇతరుల సమయాన్ని సంగ్రహించకూడదన్న సత్యం నిత్యం గుర్తుంచుకోవాలి. సంకల్ప శుద్ధి కలవాడు సమయం చాలడం లేదనలేడు. సమయజ్ఞుడి కోసం సమయం, అవకాశం నిరీక్షిస్తూనే ఉంటాయి!

 చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని