రంగులహేల... హోలీ!

జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన...

Updated : 25 Mar 2024 08:32 IST

జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన, ఆహ్లాదభరితమైన పండుగ- హోలీ! వెండివెన్నెలకు, వెల్లివిరిసే వర్ణార్ణవ శోభ సమ్మిళితమై ఫాల్గుణ పౌర్ణమినాట హోలీ సంబరం అలరింపజేస్తుంది.

శివ తపస్సును భగ్నం చేసిన మన్మథుణ్ని, ఈశ్వరుడు ఫాల్గుణ పౌర్ణమినాడే భస్మం చేశాడని శివమహా పురాణం వెల్లడిస్తోంది. కుమార సంభవానికి, తారకాసుర సంహారానికి ఈ ఘట్టం ప్రాతిపదిక అయ్యింది. హోలిక అనే రాక్షసి అంతానికి సంకేతంగా హోలీ ఏర్పడిందంటారు. అగ్ని సైతం దహించలేని హోలిక, హిరణ్యకశిపుని సోదరి. హరినామ స్మరణ వీడని తన పుత్రుడైన ప్రహ్లాదుడిని, ఒళ్లో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని ఆమెను, హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు. శ్రీహరి భక్తుడి స్పర్శ వల్ల హోలిక శక్తిహీనురాలై, అగ్నికి ఆహుతి అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా అగ్ని నుంచి బయటపడతాడు. అలా హోలిక అంతమైంది ఫాల్గుణ పౌర్ణమినాడే! బృందావనంలో యమునా తీరాన సిరివెన్నెల మిసిమిలో, గోపికలపై కృష్ణుడు నానావిధాల వర్ణాలతో కూడిన వసంతాన్ని విరజిమ్మాడని భాగవతం అభివర్ణించింది. ఆ వసంత హేల హోలీ. ఉత్తర భారతదేశంలో ఈ వేడుకనే డోలా జాత్రాగా నిర్వహిస్తారు. సుందరేశ్వర స్వామిని మెప్పించి మధుర మీనాక్షీదేవి, ఫాల్గుణ పౌర్ణమినాడే వివాహమాడిందనీ, అందుకే ఈ పున్నమిని ‘కల్యాణ పౌర్ణమి’ అని పేర్కొంటారని తమిళ ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ఫాల్గుణశుద్ధ అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఎనిమిది రోజుల్ని హోలాష్టకం అంటారు. ఈ తిథులలో రోజుకొక్క గ్రహ స్వరూపం చొప్పున, నవగ్రహాల్ని ఆరాధించే సంప్రదాయం ఉంది. నవగ్రహాల్ని, అష్టదిక్పాలకుల్ని ఫాల్గుణ పౌర్ణమినాడు నవధాన్యాలతో సమార్చన చేసి, ఆ విగ్రహాకృతులపై చందన జలాన్ని చిలకరించే ప్రక్రియ హోలీ వేడుకగా స్థిరపడిందంటారు.

ప్రకృతి సహజమైన రంగులతోనే హోలీని జరుపుకోవాలని ‘పర్వ చూడామణి’ నిర్దేశించింది. హానికారకమైన కృత్రిమ రంగులతో హోలీని నిర్వహించుకోవడం సంప్రదాయ విరుద్ధం. ఫల, పుష్ప రసాలు, పసుపు కలిపిన చందన జలం, మోదుగ పుష్పాల గుజ్జు, వృక్ష మూలాల రసాలు, పసుపు, కుంకుమ, కాస్త సున్నం కలిపిన వసంత జలాన్ని హోలీ రంగులుగా వినియోగించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. శివుడు ఆత్మకు, పార్వతి ప్రకృతికి, మన్మథుడు చంచలమైన మనసుకు ప్రతీక. వ్యక్తి ఉత్తమ స్థితిని సాధించాలంటే ముందు మనసును జయించాలి. మనసును విష వలయాలలో చిక్కుకోకుండా, భోగలాలసత వైపు వెళ్ళకుండా కట్టడిచేయాలి. అప్పుడు సాధకుడిగా వ్యక్తి పొందే సంపూర్ణత్వమే- మదన పూర్ణిమకు ప్రతిఫలనం. ఆ ఆధ్యాత్మిక సంబరమే వసంత వేడుక. వ్యక్తుల మధ్య సమైక్యతకు, సామరస్య భావాలకు హోలీ ప్రతీక. మనోపరమైన వికారాల్ని, దోష గుణాల్ని దుష్ట ఆలోచనల్ని దహింపజేసుకుని, వర్ణరంజితంగా జీవన సౌందర్యాన్ని, ప్రేమైక పావన మాధుర్యాన్ని ఆస్వాదించమని సందేశమిచ్చే రసరమ్య రంగులకేళి... హోలీ!

డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని