నిజ స్వభావం

మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం.

Published : 27 Mar 2024 00:46 IST

నిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. ఈ ప్రపంచంలో ఎదగడానికి ఏదైనా సాధించడానికి భగవంతుడు లెక్కలేనన్ని అవకాశాలు సృష్టించి జీవితానికి ఆకాశమే హద్దుగా గొప్పగా బతకమని ఆశలు, ఆశయాలు కల్పించాడు. ఇతరులను అనుకరిస్తూ జీవించేందుకు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఎవరి బలాబలాలు, తత్వాలు వారివి. ముందు మనం నిరాశా ధోరణులను వదిలిపెట్టాలి. నేనూ ఏదైనా సాధించగలనన్న నమ్మకాన్ని పెంచుకోవాలి.

క్రమశిక్షణ కలిగి జీవించగలిగితే మనిషి స్వభావరీత్యా మంచివాడిగా ఉంటాడన్నది భగవద్గీతలో పరమాత్మ ఉద్బోధ. ఒకరిని ద్వేషించడం ప్రారంభిస్తే పగ సైతం మన అంతఃరంగాన్ని వెంబడిస్తూనే ఉంటుంది. మనం చక్కటి ఆలోచనలతో జీవిస్తూ మనసుకు దేహానికి న్యాయంగా ప్రవర్తించడం అలవాటు చేయాలి. వారంటే ఇష్టం, ఇతరులంటే కోపం అనే ధోరణి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. పురాణాల్లో ఈ అనుభవాలు కోకొల్లలు. ధర్మరాజు ఈ పరిస్థితులను తనదాకా రానీయలేదు. స్థితప్రజ్ఞతో జీవించి అతడు అలుగుటయే ఎరుగనివాడిగా పేరు తెచ్చుకున్నాడు.

గౌతమబుద్ధుడు, చైతన్య మహాప్రభు, మాతా అమృతానందమయి లాంటివారిని స్థితప్రజ్ఞులు అంటారు. వారంతా తమను తాము జయించారు. మనలోని విభిన్న ఆలోచనలే మనలోని నిరాశలకు అసూయలకు అజ్ఞానానికి కారణమవుతున్నాయి. వీటన్నింటినీ స్థితప్రజ్ఞులు జయించారు. ఇందువల్లనే మనందరికీ బోధించగలవారయ్యారు. మండనమిశ్రుడు ఆదిశంకరాచార్యులతో అద్వైత వేదాంతంపై చర్చకు ఉపక్రమించినప్పుడు తనంత జ్ఞాని లేడని గర్వపడ్డాడు. చర్చ చాలా లోతైన విషయాలకు వెళ్ళేకొద్దీ మండనమిశ్రుడు ఓటమి అంచులకు చేరుకున్నాడు. చివరికి అతడి భార్య ఉభయ భారతి కల్పించుకొని అడిగిన ప్రశ్నలకు ఆదిశంకరులు వెంటనే సమాధానం చెప్పలేక తనకు కొంత సమయం కావాలని కోరే సమయం వచ్చేసరికి మండనమిశ్రుడు తాను స్థితప్రజ్ఞుడు కాదని గ్రహించాడు. ఎవరైతే లోతుగా ఆలోచించగలరో, ఎవరైతే తనలోని కోరికల్ని అదుపులో ఉంచుకోగలరో, ఎవరైతే యుక్తమైన మితమైన జీవితం గడపగలరో వారిని గెలవడం అసాధ్యం.

మనిషి తన మనసులోని ఆలోచనలను జయించనంత కాలం బాహ్య ప్రపంచంలో కనబరచే పరాక్రమాలన్నీ తాత్కాలికమేనని భాగవత తత్త్వ వైభవం చెబుతోంది. అప్పటివరకు మనిషిలోని నిజ స్వభావమేమిటో తెలియదు. ఎందుకంటే ఏ క్షణంలో ఏ పొరపాటు చేసినా ఆ స్వభావం అతడి నాశనానికి కారణమవుతుంది. పూర్వం రుషులు జ్ఞానం కోసం ఆధ్యాత్మిక మార్గం కోసం తమను ఆశ్రయించి వచ్చే శిష్యులను పలురకాల పరీక్షలకు గురిచేసేవారు. అందులో వారి నిజ స్వభావమేమిటో కనుగొనడం ఒకటి. ఇందులో శిష్యుడి నిజ స్వభావం తెలిసిందా... గురువు శిష్యుడిని నమ్మేవాడు. అలా నమ్మి సర్వం బోధించేవాడు. ఆధునిక ప్రపంచంలో ఎన్నో విద్యలను నేర్పేందుకు రకరకాల పరీక్షలు చేస్తున్నారు. అది తప్పనిసరి. నేర్చుకునే జ్ఞానం సరి అయిన రీతిలో ఉపయోగిస్తాడనే నమ్మకం గురువుకు కుదరాలి. విద్యను దుర్వినియోగం చేసి మేలుకు బదులు కీడు చేసే అవకాశాలు లేకుండేందుకే నిజ స్వభావ పరీక్షలు.

 అప్పరుసు రమాకాంతరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని