సిలువపై సత్య సందేశం

ఒక బోధకుడు రాత్రిపూట ఒక అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఒక దొంగ ఆ బోధకుడిని అడ్డగించాడు. ‘నీవద్దనున్న సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తాను’ అంటూ కత్తి చూపి భయపెట్టాడు.

Updated : 29 Mar 2024 05:27 IST

క బోధకుడు రాత్రిపూట ఒక అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఒక దొంగ ఆ బోధకుడిని అడ్డగించాడు. ‘నీవద్దనున్న సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తాను’ అంటూ కత్తి చూపి భయపెట్టాడు. దొంగ బెదిరింపులకు నవ్విన ఆ బోధకుడు- ‘ఇలా దారి దోపిడులు చేసి పాపాన్ని ఎందుకు మూటగట్టుకుంటున్నావు?’ అన్నాడు. ‘నా భార్యాబిడ్డలు, నా తల్లిదండ్రులు వారంతా సుఖంగా జీవించడం కోసమే ఇదంతా...’ అన్నాడా దొంగ.

‘వారికోసం నువ్వు ప్రాణాలకు తెగించి ఈ పాప భారాన్ని మోస్తున్నావు... అది అందించే పాప ఫలితాన్ని, చేదు ఫలాన్ని మీ కుటుంబం స్వీకరిస్తుందా?’ అన్నాడు బోధకుడు. ‘ఎందుకు స్వీకరించదు?’ అంటూ అతడు అక్కడినుంచి వెనుతిరిగాడు. గంట తరవాత మళ్ళీ ప్రత్యక్షమైన ఆ దొంగ ఆ బోధకుడి ముందు మోకరిల్లి- ‘మీరు చెప్పింది నిజమే! నా కుటుంబంలోని ఏ ఒక్కరూ నా పాపభారాన్ని మోయడానికి ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ సిద్ధంగా లేరు’ అంటూ విలపించాడు.

వెంటనే ఆ బోధకుడు- ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా సమస్త లోకపు ప్రజల పాపభారాన్ని మోయడానికి సిలువపై బలియాగం అయిన క్రీస్తు ప్రభువు గురించి చెప్పాడు.

వీపు మీద సిలువ భారం, కాళ్లూ చేతులకు మేకులు, తలపై ముళ్ల కిరీటం, పైన సూర్యతాపం... వీటికి మించిన గాయాల తీవ్రత... ఇన్ని బాధలు పెట్టినా, ఛీత్కారాలు చేసినా... ‘తండ్రీ వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము’ అని ప్రార్థించాడు.

క్రీస్తుకు సిలువ శిక్ష వేసే సమయంలో పిలాతు అనే న్యాయాధికారి ‘నువ్వు ఎవరు?’ అని ప్రశ్నించినప్పుడు- ‘నేనే సత్యం’ అన్నాడు ప్రభువు.

సత్యం కోసం తాను నమ్మిన ప్రేమ, కరుణ, సేవా మార్గాలను ఆచరించే క్రమంలో సత్యసంధతే ఆయన్ని సిలువ వైపు నడిపించింది. ప్రభువు మనసా వాచా కర్మణా నమ్మి చెప్పిన సత్యాన్ని మెచ్చని ఆనాటి రాచరిక వ్యవస్థ ఆయనకు సిలువపై చనిపోయేలా మరణశిక్ష విధించింది. అయినా సత్యానికి మరణం లేదు, సత్యవాదికి ఎదురు లేదు అని ఆయన తిరిగి లేవడం ద్వారా సమస్త మానవాళికి సత్యమే గెలుస్తుంది అనే నిత్యసత్యాన్ని సందేశంగా ఇచ్చారు.

పాపం చేస్తూ పట్టుబడిన ఒక విధివంచితను ఆనాటి మత ఛాందసులు రాళ్లతో కొట్టి చంపాలనే శిక్ష విధించినప్పుడు, ఆయన ఆనాడు సూటి ప్రశ్న వేశారు. ‘మీలో పాపం చేయనివాడే మొదటిరాయి విసరాలి. పాపులను కాదు, పాపాన్ని శిక్షించాలి’ అంటూ ధైర్యంగా, సూటిగా సమాజాన్ని ప్రశ్నించిన ఆయన సత్యమార్గం- అన్ని కాలాల్లోనూ అనుసరణీయం, ఆచరణీయం.

సకల మానవుల పాప ప్రక్షాళన నిమిత్తం సిలువపై అసువులు బాసిన క్రీస్తు ప్రభువు ఆ సిలువ మీద నుంచే తన సత్య సందేశాన్ని సమస్త మానవాళికీ చాటిచెప్పాడు. అలా ఆయన చనిపోయిన రోజు శుభ శుక్రవారం... తిరిగి లేచిన మూడో రోజు ఈస్టర్‌ పర్వదినం.

 డాక్టర్‌ ఎమ్‌.సుగుణరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని