అనుభవ సారం

జీవితం ప్రతీ క్షణం ఒక అనుభవమే. అటువంటి అనుభవాలే జ్ఞాపకాలుగా కాలక్రమంలో పాఠాలను చెబుతాయి. జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కానీ ఎల్లకాలం ఒకే రకమైన అనుభవాలుంటే మాత్రం విసుగు పుట్టిస్తాయి. అప్పుడు జీవితం నిస్తేజంగా తయారవుతుంది. అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకునే ఉద్దేశంతో, గాలి మార్పు పేరుతో వేరువేరు ప్రదేశాలను పర్యటించమని పెద్దలు చెబుతారు.

Published : 30 Mar 2024 00:38 IST

జీవితం ప్రతీ క్షణం ఒక అనుభవమే. అటువంటి అనుభవాలే జ్ఞాపకాలుగా కాలక్రమంలో పాఠాలను చెబుతాయి. జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కానీ ఎల్లకాలం ఒకే రకమైన అనుభవాలుంటే మాత్రం విసుగు పుట్టిస్తాయి. అప్పుడు జీవితం నిస్తేజంగా తయారవుతుంది. అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకునే ఉద్దేశంతో, గాలి మార్పు పేరుతో వేరువేరు ప్రదేశాలను పర్యటించమని పెద్దలు చెబుతారు. పూర్వకాలపు విద్యావిధానంలో మహారాజు బిడ్డయినా సరే సామాన్య పౌరుల సంతానంతో సమానంగా విద్యను అభ్యసించాలని చేసిన కట్టుబాటు ఇందుకే. దానితోపాటు విద్యాభ్యాసం తరవాత పట్టాభిషేకానికి ముందు దేశ పర్యటన చేయాలనే నియమం ఉండేది. అలా చేయడంవల్ల ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. జీవితంలో ఆటుపోట్లు అనుభవంలోకి వస్తాయి. లోకజ్ఞానం పెరుగుతుంది. మార్పు అభిలషణీయం. నిజమైన సుఖానుభవం కలగాలంటే మనిషి కష్టాలను అనుభవించవలసి రావడం తప్పనిసరి అంటారు అనుభవజ్ఞులు.

‘ఒక మనిషి జీవితంలో ఆనందాన్ని అనుభవించాలంటే ప్రాకృతిక ధర్మం ఎప్పటికప్పుడు మార్పు చెందుతుండాలి. ప్రతి అంశానికీ భిన్నమైన అనుభవం ఒకటుందనే అవగాహన కలగాలి. అప్పుడే ఓ కొత్త సుఖం అందుబాటులోకి వస్తుంది’ అంటాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. ఆనందాన్ని, కొత్త కొత్త సుఖాలను అనుభవిస్తున్న మనిషికి ఒకానొక సమయంలో అసలు సుఖాలంటేనే ముఖం మొత్తుతుంది. అప్పుడు అతడికి కావాల్సింది- ఇంతకు ముందు అనుభవించని మరొక నూతన అనుభవం. వినడానికి వింతగా ఉన్నా అతడికి అప్పుడు కావలసింది దుఃఖమే. ఒకసారి కుంతీదేవి శ్రీకృష్ణుడితో- కష్టాల్లోనే మనిషి స్థితప్రజ్ఞ వ్యక్తమవుతుందని, కాబట్టి కష్టాలు కలిగించే సంఘటనలు అంటేనే తనకిష్టమని చెప్పిందట.

భగవంతుడు సైతం తన సృష్టిలో సుఖం విలువ తెలియజెయ్యడానికి కష్టాన్ని, వెలుగు విలువ తెలపడానికి చీకటిని, తెలుపురంగు స్పష్టత తెలియడానికి నలుపురంగును... ఇలా ప్రతి విషయానికీ వ్యతిరేకతలను సృష్టించాడంటారు. మనిషి వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుని జీవితాన్ని మలచుకోవాలి.

చిత్రకారుడు తన చిత్రానికి వేసిన రంగుల అందం ఇనుమడించడానికి వాటి వ్యతిరేక రంగులను అంచులుగా చిత్రిస్తాడు. మానవుడు కష్టాలు కలిగినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా నిండుకుండలా దేనికీ చలించని మనస్తత్వంతో ఉండాలి. కష్టమొచ్చినా సుఖమొచ్చినా తటస్థంగా ఉండగలగాలి. అప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. ఆ తత్వం అలవడాలంటే అన్నిరకాల అనుభవాలూ చవిచూడాలి.

నేటితరం పిల్లలకు ఏ కష్టమూ తెలియకుండా పెంచాలనే తాపత్రయంతో వారి అవసరానికి మించిన సుఖాలను, సౌకర్యాలను కల్పిస్తున్నారు తల్లిదండ్రులు. దానికి కారణం తాము బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డామని, వారికి కూడా అవి దాపురించకూడదనే ఆలోచన! కానీ అది సరికాదు. ఎందుకంటే... కష్టం, బాధ, ఇబ్బంది లాంటివి తెలిస్తేనే- సుఖం విలువ, అందులోని మాధుర్యం తెలుస్తాయి. విపత్కర పరిస్థితులు కలిగినా తట్టుకుని నిలబడగలుగుతారు. అలాగని వారిని కావాలని కష్టాల్లోకి నెట్టేయమని కాదు. అవసరానికి మించిన సుఖాలు అలవాటు చేయకుండా ఉంటే చాలు!

గోపాలుని రఘుపతిరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని